సిరీస్ తొలి టెస్టులో లంక భారత్‌ను వణికించింది... తొలి వన్డేలో చిత్తుగా ఓడించింది... తొలి టి20కి వచ్చేసరికి మాత్రం చేతులెత్తేసింది. తమ 100వ మ్యాచ్‌లో కనీస పోరాటం కూడా చూపలేక తలవంచింది. సమష్టిగా రాణించిన భారత్ బారాబతి స్టేడియంలో 93 పరుగుల భారీ విజయాన్నందుకుంది. టి20ల్లో మనకిదే అతిపెద్ద గెలుపు కావడం విశేషం. రెండేళ్ల క్రితం ఇక్కడే దక్షిణాఫ్రికా చేతిలో 92 పరుగులకే ఆలౌటై అవమానం ఎదుర్కొన్న టీమిండియా... ఇప్పుడు దాదాపు అదే స్కోరు తేడాతో మరో మ్యాచ్‌లో గెలిచింది.
కటక్: లంకతో తొలి టి20 మ్యాచ్‌లో భారత్ జయకేతనం ఎగురవేసింది. ఇక్కడి బారాబతి మైదానంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 93 పరుగులతో ఘన విజయం సాధించింది. ముందు బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 61; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకానికి తోడుగా ఎంఎస్ ధోని (22 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్); మనీశ్ పాండే (18 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదరగొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. అనంతరం ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ చహల్ (4/23) ధాటికి లంక 87 పరుగులకే కుప్పకూలింది.
రాహుల్ అర్ధ సెంచరీ...
టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు టి20లకు తగ్గ ఆరంభం లభించింది. అరంగేట్ర పేసర్ విశ్వ ఫెర్నాండో వేసిన తొలి ఓవర్‌లోనే 10 పరుగులు వచ్చాయి. దీంతో లంక రెండో ఓవర్‌కు స్పిన్నర్ అఖిల ధనంజయను రంగంలోకి దించింది. మరో ఎండ్‌లో మాత్రం పేసర్లను మార్చుతూ వచ్చింది. మూడో ఓవర్ చమీర వేయగా, అయిదో ఓవర్‌కు మాథ్యూస్‌కు బంతినిచ్చారు. ఎట్టకేలకు ఈ ప్రయోగం ఫలించింది. మాథ్యూస్ ఓవర్ చివరి బంతికి రోహిత్ (13 బంతుల్లో 17; 2 ఫోర్లు) మిడాన్‌లో చమీరకు చిక్కాడు. అనంతరం వచ్చిన శ్రేయస్ ఆరో ఓవర్ చివరి రెండు బంతులను బౌండరీలుగా మలిచాడు. వ్యక్తిగత స్కోరు 23 వద్ద అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఇచ్చినా రాహుల్ సమీక్ష కోరి బయటపడ్డాడు. పదో ఓవర్లో అతడి అర్ధ శతకం (34 బంతుల్లో) పూర్తయింది. రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించాక శ్రేయస్ (20 బంతుల్లో 24; 3 ఫోర్లు) అవుటయ్యాడు. ధోని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగగా, సాధికారికంగా ఆడుతూ ఊపులో కనిపించిన రాహుల్... పెరీరా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఈ దశలో మనీశ్ పాండే, ధోని కుదురుకోవడానికి ప్రయత్నించడంతో పరుగుల వేగం తగ్గింది. అయితే చమీర వేసిన 17వ ఓవర్లో ధోని బౌండరీ, మరో వైపు పాండే ఫోర్, సిక్స్ బాదడంతో 19 పరుగులు వచ్చాయి. 18వ ఓవర్లో పెరీరా కొంచెం కట్టడి చేయడంతో 9 పరుగులే వచ్చాయి. కానీ... 19వ ఓవర్లో ఒక్కసారిగా స్కోరు గేరు మారింది. ప్రదీప్ వేసిన ఈ ఓవర్లో రెండు వైడ్లు, ఒక నోబాల్ సహా 21 పరుగులు వచ్చాయి. వైడ్ యార్కర్‌ను పాండే అప్పర్ కట్‌తో సిక్స్‌గా మలచడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్ చివరి బంతిని ధోని స్టాండ్స్‌లోకి కొట్టాడు. ఈ ఓవర్లోనూ 12 పరుగులు వచ్చాయి. పాండే, ధోని చివరి నాలుగు ఓవర్లలో 61 పరుగులు రాబట్టడం విశేషం.
లంక పేలవంగా...
181... కనీసం 150 స్కోరున్నా ఛేదన కష్టమయ్యే పిచ్‌పై లంకకు ఎదురైన లక్ష్యమిది. దీనికి తగ్గట్లుగా ఆ జట్టుకు ఆరంభం లభించలేదు. ఏమాత్రం ప్రతిఘటన లేకుండా... గెలుపుపై ఆశావహ దృక్పథమే లేదన్నట్లుగా సాగింది వారి ఆటతీరు. ఓపెనర్లు డిక్‌వెలా (13), తరంగ (16 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడు చూపినా అది ఎంతో సేపు నిలవలేదు. ఉనాద్కట్ బౌలింగ్‌లో రాహుల్‌కు డిక్‌వెలా క్యాచ్ ఇవ్వగా... తరంగను చహల్ బోల్తా కొట్టించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కుశాల్ పెరీరా (28 బంతుల్లో 19) బౌండరీనే కొట్టలేకపోయాడు. ఇతడితో కలిసి తరంగ నెలకొల్పిన 24 పరుగుల భాగస్వామ్యమే లంక ఇన్నింగ్స్‌లో అతి పెద్దది కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా చహల్, కుల్దీప్ (2/18) బౌలింగ్‌ను లంకేయులు ఎదుర్కోలేకపోయారు. జట్టు స్కోరు 46 వద్ద మాథ్యూస్ (1) వికెట్ కోల్పోయిన లంక ఇక కోలుకోలేకపోయింది. ఆ తర్వాత మరో 46 బంతులాడి 41 పరుగులకే ఏడు వికెట్లు చేజార్చుకుంది. వికెట్ల వెనుక ధోని... రెండు క్యాచ్‌లు, రెండు స్టంపౌట్‌లతో ఆకట్టుకున్నాడు.
బారాబతిలో 'భారీ' బహుమతి
Comments
Please login to add a commentAdd a comment