టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ తరహా ఫలితాన్ని ఆశిస్తే ఒక విజయంతోనే భారత్ సంతృప్తి చెందాల్సి వచ్చింది. వన్డేల్లో సిరీస్ విజయం సాధించినా... తొలి పోరులో చతికిలపడ్డ తీరు జట్టు సంపూర్ణ ఆధిపత్యానికి సవాల్ విసిరింది. ఇప్పుడు పొట్టి ఫార్మాట్‌లో మన సత్తా ఎలాంటిది? ఇక్కడ కూడా మన కుర్రాళ్ల జోరు కొనసాగుతుందా? లేక శ్రీలంకకు మళ్లీ గెలుపు అవకాశం ఉంటుందా? నేటినుంచి జరిగే టి20 సిరీస్‌లో తమ బలాన్ని తేల్చుకునేందుకు ఇరు జట్లూ సన్నద్ధమయ్యాయి. ఎక్కువ మంది కుర్రాళ్లను పరీక్షించే అవకాశం ఉండటమే భారత్‌కు సంబంధించి ఈ సిరీస్‌లో కీలకాంశం.
కటక్: వచ్చే ఏడాది వరుసగా ఉండే విదేశీ పర్యటనలకు ముందు భారత క్రికెట్ జట్టు సొంతగడ్డపై తమ ఆఖరి సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. నేడు ఇక్కడ జరిగే తొలి మ్యాచ్‌తో భారత్, శ్రీలంక మధ్య మూడు టి20ల సిరీస్ ప్రారంభమవుతుంది. టెస్టు సిరీస్‌ను 1–0తో, వన్డే సిరీస్‌ను 2–1తో గెలుచుకున్న భారత్ ఈ ఫార్మాట్‌లోనూ గెలవాలని పట్టుదలగా ఉండగా... వన్డేల్లో కాస్త మెరుగైన ఆటతీరు కనబర్చిన లంక అదే ఉత్సాహంతో టి20ల్లోనైనా సంచలనం సృష్టించాలని భావిస్తోంది. 2017 మొత్తంలో భారత్ మూడు ఫార్మాట్‌లలో ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా ఓడిపోకపోవడం విశేషం.
ఎవరికి అవకాశం?
కెప్టెన్ కోహ్లితో పాటు ధావన్, భువనేశ్వర్‌లకు కూడా ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చారు. తాజాగా జరిగిన వన్డే సిరీస్‌తో పోలిస్తే ఈ టీమ్‌లో కొన్ని మార్పులు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ మళ్లీ టీమ్‌లోకి రాగా... పేస్ విభాగంలో బుమ్రాకు జోడీగా మరొక పేసర్ కోసం అనేక ప్రత్యామ్నాయాలు జట్టుకు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే అరంగేట్రం చేసిన హైదరాబాదీ సిరాజ్‌తో పాటు కేరళ పేసర్ బాసిల్ థంపి, ఏడాది క్రితం కెరీర్‌లో ఒకే ఒక్క టి20 ఆడిన ఉనాద్కట్ కూడా పోటీలో ఉన్నాడు. భారత బ్యాటింగ్‌కు సంబంధించి రోహిత్ శర్మ మళ్లీ భారీ మెరుపులను ప్రదర్శించేందుకు ఇది మరో అవకాశం. అతనితో పాటు రాహుల్ ఓపెనింగ్ చేస్తాడు. వన్డే సిరీస్‌లో సత్తా చాటిన శ్రేయస్ అయ్యర్ మూడో స్థానంలో రావడం ఖాయమే. వైజాగ్ మ్యాచ్‌లో సత్తా చాటిన కుల్దీప్‌ను ఎదుర్కోవడం లంకకు సులభం కాదు. ఇక వన్డేల్లో బ్యాటింగ్‌లో మెప్పించలేకపోయిన పాండ్యా తన సత్తా చాటేందుకు ఇది మంచి వేదిక.
బలం పెరిగిందా?
పాకిస్తాన్‌తో జరిగిన తమ ఆఖరి టి20 సిరీస్‌కు దూరమైన అనేక మంది శ్రీలంక సీనియర్ ఆటగాళ్లు ఈ సిరీస్‌తో మళ్లీ జట్టులోకి వచ్చారు. దాంతో లంక జట్టులో కాస్త ఆత్మవిశ్వాసం పెరిగింది. పైగా టెస్టులతో పోలిస్తే వన్డేల్లో కాస్త మెరుగ్గా ఆడటం కూడా ఆ జట్టుకు మానసిక బలాన్ని ఇస్తోంది. అయితే భారతగడ్డపై ప్రభావం చూపించిన పేసర్ లక్మల్ మాత్రం ఈ సిరీస్‌లో లేడు. లంక బ్యాటింగ్‌కు సంబంధించి ఓపెనర్ తరంగ కీలకం కానున్నాడు. సీనియర్ మాథ్యూస్‌తో పాటు జూనియర్ జయసూర్య, కుషాల్ పెరీరా చెలరేగితే లంక భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. ఇటీవలే ఒక మ్యాచ్‌లో భారత్‌ను వణికించిన అఖిల ధనంజయ స్పిన్‌పై కూడా లంక భారీ నమ్మకం పెట్టుకుంది. మిడిలార్డర్‌లో డిక్‌వెలా దూకుడైన బ్యాటింగ్ లంకకు అదనపు బలం. అయితే అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో వరుసగా విఫలమవుతూ కూడా కెప్టెన్సీ అదృష్టం దక్కించుకోగలిగిన తిసారా పెరీరా ఒక్క మ్యాచ్‌లోనైనా తన ప్రభావం చూపిస్తాడా అనేది ఆసక్తికరం.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, అయ్యర్, దినేశ్ కార్తీక్, పాండే, ధోని, పాండ్యా, కుల్దీప్, బుమ్రా, చహల్, సిరాజ్/థంపి.
శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్), గుణతిలక, తరంగ, కుషాల్ పెరీరా, మాథ్యూస్, డిక్‌వెలా, గుణరత్నే, పతిరణ, ధనంజయ, చమీరా/ఫెర్నాండో, ప్రదీప్.
పిచ్, వాతావరణం
సాధారణ బ్యాటింగ్ వికెట్. భారీ స్కోరుకు అవకాశం ఉంది. రెండేళ్ల క్రితం ఇక్కడ జరిగిన ఏకైక టి20లో ప్రేక్షకుల గొడవ మధ్య కొనసాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడింది. వర్ష సూచన లేదు.
►రాత్రి గం. 7.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment