నిదహాస్ ముక్కోణపు టి20 టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఎదురైన పరాజయానికి భారత్ బదులు తీర్చుకుంది. పద్ధతైన బౌలింగ్‌తో ముందుగా ప్రత్యర్థిని కట్టడి చేసి... తర్వాత పెద్దగా ఇబ్బంది పడకుండానే ఛేదనను పూర్తి చేసింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 19 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ (38 బంతుల్లో 55; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడి మంచి ప్రారంభాన్నిచ్చాడు.