ఓపెనర్‌గా రోహిత్ జోడీ ఎవరు?
రాహుల్‌కు తుది జట్టులో చోటుంటుందా?
మిడిలార్డర్‌లో భారాన్ని మోసేదెవరు?
బుమ్రాతో కొత్త బంతి పంచుకునేదెవరు?
పదునైన యార్కర్ల థంపి అరంగేట్రం చేస్తాడా?
హిట్టర్ దీపక్ హుడాకు అవకాశమిస్తారా?
కుర్రాడైన వాషింగ్టన్ సుందర్‌ను పరీక్షిస్తారా? శ్రీలంకతో బుధవారం ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు భారత తుది జట్టు కూర్పుపై ఇవీ సగటు క్రికెట్ అభిమాని సందేహాలు. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి, సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, పేసర్ భువనేశ్వర్‌కు విశ్రాంతినివ్వడంతో ఈ పొట్టి ఫార్మాట్ సిరీస్‌లో భారత్ అన్ని విభాగాల్లో కొత్త మేళవింపులతో బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సాక్షి క్రీడావిభాగం: టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత జట్టు చివరిదైన టి20 సిరీస్‌నూ గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉంది. రోహిత్ శర్మ (68 మ్యాచ్‌లు), ధోని (83 మ్యాచ్‌లు), బుమ్రా (30 మ్యాచ్‌లు), హార్దిక్ పాండ్యా (24 మ్యాచ్‌లు) మినహా జట్టులోని మిగతా వారికి అంతర్జాతీయ టి20ల్లో అంతగా అనుభవం లేదు. శ్రీలంక ఎలాగూ ప్రమాదకర ప్రత్యర్థి కాదు కాబట్టి... సమీకరణాల ప్రకారం చూస్తే తొలిసారి టి20 జట్టులోకి ఎంపికైన వాషింగ్టన్ సుందర్, బాసిల్ థంపి, దీపక్ హుడా అరంగేట్రం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పేస్ బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు భారం పంచుకునేది ఎవరనే ఆసక్తి కలుగుతోంది.
రెండో ఓపెనర్ ఎవరో?
రెగ్యులర్ ఓపెనర్‌గా కెప్టెన్ రోహిత్ శర్మ రావడం ఖాయం. మరి రెండో ఓపెనర్ ఎవరు? ఈ స్థానం కోసం రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లలో ఒకరిని ఎంచుకోవాల్సి ఉంటుంది. తాజా ఫామ్‌ను లెక్కలోకి తీసుకుంటే అయ్యర్‌కే ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే... తన తొలి టి20 మ్యాచ్‌లోనే విండీస్ గడ్డపై సెంచరీతో అదరగొట్టిన రాహుల్ అవకాశాలను తోసిపుచ్చలేం. వేగంగా, భారీ షాట్లు ఆడగలగడం అతడి ప్రత్యేకత. టెస్టుల్లో వచ్చినట్లు టి20ల్లో రాహుల్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక శ్రేయస్ రెండు వరుస అర్ధ శతకాలతో వన్డేల్లో సత్తా చాటాడు. ఖాళీల్లోకి బంతిని కొడుతూ కళాత్మకంగా ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో మిడిలార్డర్‌ను మరింత పటిష్టం చేయాలనుకుంటే ఇతడిని ఓపెనర్‌గా తీసుకొచ్చి అక్కడ మరొకరికి చోటిచ్చే ఆలోచన చేయొచ్చు. ఇదే జరిగితే రాహుల్ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఇంకా కావాలంటే జట్టు మేనేజ్‌మెంట్ దినేశ్ కార్తీక్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించే ప్రయోగమూ చేయొచ్చు.
మిడిలార్డర్ సంగతేంటి?
ఇటీవల జట్టును ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న అంశం మిడిలార్డర్. సీనియర్లు, ఫినిషర్ల అవసరం ఎక్కువగా ఉండే ఇలాంటి చోట వైఫల్యం పరాజయాలకు దారితీస్తోంది. ఒకవేళ రాహుల్‌ను ఓపెనర్‌గా పంపి, వన్‌డౌన్‌లో అయ్యర్‌ను ఆడిస్తే మిగిలేది 4, 5, 6 స్థానాలు. వీటిలో 6వ స్థానం ధోనిదే. మిగతా రెండింటికి మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్ పోటీలో ఉన్నారు. 7వ స్థానంలో హార్దిక్ పాండ్యా కుదురుకున్నాడు. ధనాధన్ మ్యాచ్‌లు కావడంతో పరిస్థితిని బట్టి పాండ్యాను ఇంకా ముందుకు పంపే ఆలోచన చేయొచ్చు. మంచి ఫీల్డర్ అయిన మనీశ్ పాండే వరుసగా విఫలమవుతున్నాడు. వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా వంటి ఆల్‌రౌండర్లతో బౌలింగ్‌ను మరింత పటిష్ఠం చేసి, వైవిధ్యం చూపాలనుకుంటే మనీశ్ అవకాశాలు సన్నగిల్లుతాయి. ఇక చహల్, కుల్దీప్ ప్రధాన స్పిన్నర్లు. టి20 సిరీస్‌లోనూ వీరే బాధ్యతలు తీసుకోవచ్చు. లంక జట్టులో ఎడంచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఎక్కువ కాబట్టి వీరికితోడుగా సుందర్, హుడాలలో ఒకరిని ఆడించవచ్చు.
‘పేస్’ వైపే చూపంతా..!
ప్రస్తుత సిరీస్‌లో ప్రధాన బౌలర్ బుమ్రాతో బంతిని పంచుకునే పేసర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే హైదరాబాదీ సిరాజ్‌కు ఒక అవకాశం దక్కింది. మిగిలింది కేరళ స్పీడ్‌స్టర్, యార్కర్ల దిట్ట బాసిల్ థంపి, జయదేవ్ ఉనాద్కట్. ఎడంచేతి వాటంతో పాటు, కొంత అనుభవం ఉన్న ఉనాద్కట్‌కు రెండో పేసర్‌గా ప్రాధాన్యం దక్కవచ్చు. సిరీస్ ఫలితం ముందుగా తేలిపోతే... చివరి మ్యాచ్‌కు సరికొత్త మేళవింపును చూసే అవకాశముంటుంది.
►7 భారత్, శ్రీలంక జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 11 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ ఏడింటిలో గెలుపొందగా... శ్రీలంక నాలుగింటిలో విజయం సాధించింది.
► 211 శ్రీలంకపై టి20ల్లో భారత్ అత్యధిక స్కోరు. 2009లో మొహాలీలో 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ టీమిండియా ఈ స్కోరు చేసింది.
► 101 శ్రీలంకపై భారత్ అత్యల్ప స్కోరు. 2016లో పుణేలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఓడింది.
► 88 ఇప్పటివరకు భారత్ ఆడిన టి20 మ్యాచ్‌లు. ఇందులో 52 గెలిచి, 33 ఓడింది. ఒక మ్యాచ్ ‘టై’ కాగా... రెండింటిలో ఫలితం రాలేదు.
► 15 స్వదేశంలో భారత్ 28 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 15 విజయాలు, 13 పరాజయాలు ఉన్నాయి.
► 6 వీరేంద్ర సెహ్వాగ్, ధోని, సురేశ్ రైనా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి తర్వాత టి20ల్లో భారత్‌కు నాయకత్వం వహించనున్న ఆరో కెప్టెన్ రోహిత్ శర్మ.
Comments
Please login to add a commentAdd a comment