మ్యాచ్‌కు ముందు పుల్వామా ఘటనకు సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు రెండు నిమిషాల మౌనం పాటించారు. కానీ మ్యాచ్‌లో కూడా ఎక్కువ భాగం మైదానంలో ఇలాంటి నిశ్శబ్ద వాతావరణమే కనిపించింది. భారత్ బ్యాటింగ్ చేసినంత సేపు మెరుపులు లేకపోగా... ఫీల్డింగ్ సమయంలో ఒక దశలో ఓటమి వెంటాడుతుండగా వైజాగ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. చివర్లో కొంత ఉత్సాహం వచ్చినా ఆఖరికి ఓటమితోనే విశాఖ ప్రేక్షకులు వెనుదిరగాల్సి వచ్చింది.
చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 14 పరుగులు కావాలి. టెయిలెండర్లు క్రీజ్‌లో ఉండగా ఉమేశ్ చేతిలో బంతి. అంతకుముందు ఓవర్లో 2 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన బుమ్రా తానేమిటో చూపిస్తే ఉమేశ్ తాను ఏం చేయగలడో అదే తప్పు చేశాడు. అతని పేలవ బౌలింగ్‌లో కమిన్స్, రిచర్డ్సన్ చెరో ఫోర్ బాదారు. చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా, రాహుల్ త్రో సరైన వైపు వెళ్లకపోవడంతో ఆసీస్ రెండో పరుగును విజయవంతంగా పూర్తి చేసుకొని విజయతీరాలకు చేరింది.
విశాఖపట్నం నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి : టి20ల్లో వరుసగా 61 బంతుల పాటు భారత్ బౌండరీని బాదకపోవడం చాలా అరుదు. ఆదివారం ఇలాంటి ఇన్నింగ్సే ఆడిన టీమిండియా ముందే ఓటమిని ఆçహ్వానించింది. చివర్లో కొంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఫలితంగా తొలి టి20లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులే చేయగలిగింది. రాహుల్ (36 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... ధోని (37 బంతుల్లో 29 నాటౌట్; 1 సిక్స్), కోహ్లి (17 బంతుల్లో 24; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. రాహుల్, కోహ్లి కలిసి రెండో వికెట్‌కు 37 బంతుల్లో 55 పరుగులు జోడించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కూల్టర్ నీల్ 3 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశాడు. అనంతరం ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 127 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (43 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డార్సీ షార్ట్ (37 బంతుల్లో 37; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 68 బంతుల్లో 84 పరుగులు జత చేశారు. రెండో టి20 బుధవారం బెంగళూరులో జరుగుతుంది. ఈ మ్యాచ్‌తో పంజాబ్ ఆటగాడు మయాంక్ మార్కండే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున టి20లు ఆడిన 79వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
మిడిలార్డర్ విఫలం...
బెహ్రన్‌డార్ఫ్ వేసిన తొలి ఓవర్లో చేసిన ఒకే పరుగుతో భారత్ ఇన్నింగ్స్ ప్రారంభం కాగా... రిచర్డ్సన్ తర్వాతి రెండు ఓవర్లలో రాహుల్ రెండేసి ఫోర్లు కొట్టి దూకుడు ప్రదర్శించాడు. మరోవైపు రోహిత్ (5) ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. ఆ తర్వాత కోహ్లి ఐదు బంతుల వ్యవధిలో మూడు ఫోర్లు బాది జోరును ప్రదర్శించాడు. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ స్కోరు 49 పరుగులకు చేరింది. అనంతరం ఆడమ్ జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లి లాంగాన్‌లో క్యాచ్ ఇచ్చాడు. అనంతరం తన స్వీయ తప్పిదం, బెహ్రన్‌డార్ఫ్ అద్భుత ఫీల్డింగ్ కలగలిసి రిషభ్ పంత్ (3) రనౌట్‌కు కారణమయ్యాయి. ఆ తర్వాత భారత ఇన్నింగ్స్ తడబాటు కొనసాగింది. 35 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్‌తో పాటు దినేశ్ కార్తీక్ (1)ను ఒకే ఓవర్లో కూల్టర్ నీల్ ఔట్ చేశాడు. కృనాల్ పాండ్యా (1) విఫలం కాగా, ఉమేశ్ యాదవ్ (2) కూడా నిలవలేదు. మరో ఎండ్‌లో ధోని కొంత పోరాడే ప్రయత్నం చేసినా అందులోనూ దూకుడు కనిపించలేదు. ఎన్నో సార్లు భారీ షాట్లకు ప్రయత్నించి అతను విఫలమయ్యాడు. సింగిల్స్ తీసే అవకాశం ఉన్నా... చహల్ (0 నాటౌట్)ను వారించి తనే బాధ్యత తీసుకోబోయాడు. ఎట్టకేలకు తాను ఎదుర్కొన్న 33వ బంతికి ధోని సిక్సర్ కొట్టినా... అది జట్టు భారీ స్కోరుకు సరిపోలేదు. తొమ్మిదో ఓవర్ చివరి బంతికి రాహుల్ సిక్సర్ కొడితే... చివరి ఓవర్ రెండో బంతిని ధోని సిక్స్‌గా మలచే వరకు భారత్ ఒక్క బౌండరీ కూడా కొట్టలేదంటే పరిస్థితి అర్థమవుతుంది.
భారీ భాగస్వామ్యం...
స్వల్ప లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాకు పేలవ ఆరంభం లభించింది. చహల్ ఫీల్డింగ్‌కు స్టొయినిస్ (1) రనౌట్ కాగా, బుమ్రా బౌలింగ్‌లో తొలి బంతికే ఫించ్ (0) ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూలో కూడా ఫలితం లేకపోవడంతో 5 పరుగుల వద్దే ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. అయితే కొద్ది సేపట్లోనే భారత్‌కు ఈ ఆనందం దూరమైంది. షార్ట్, మ్యాక్స్‌వెల్ కలిసి భారత బౌలర్లపై చెలరేగారు. ముఖ్యంగా మ్యాక్స్‌వెల్ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించాడు. ఉమేశ్ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతను చహల్ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. అదే జోరులో 40 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చహల్ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి మ్యాక్స్‌వెల్ లాంగాఫ్‌లో క్యాచ్ ఇవ్వడంతో భారీ భాగస్వామ్యం ముగిసింది. కొద్ది సేపటితో హ్యండ్స్‌కోంబ్ (13)తో సమన్వయ లోపంతో షార్ట్ కూడా వెనుదిరిగాడు. ఛేదనలో తడబాటుకు గురై 12 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఓటమి ఖాయమనిపించింది. అయితే చివరి బంతికి విజయంతో ఆసీస్ గట్టెక్కింది.
► 4 టి20ల్లో భారత్‌పై చివరి బంతికి ప్రత్యర్థి జట్టు నెగ్గడం ఇది నాలుగోసారి. న్యూజిలాండ్ (2009లో; లక్ష్యం 150), శ్రీలంక (2010లో; లక్ష్యం 164), ఇంగ్లండ్ (2014లో; లక్ష్యం 178), ఆస్ట్రేలియా (2019లో; లక్ష్యం 127) ఈ ఘనత సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment