మరింతగా టి20 విందు | 158 matches in four-year FTP | Sakshi
Sakshi News home page

మరింతగా టి20 విందు

Published Tue, Dec 12 2017 12:57 AM | Last Updated on Tue, Dec 12 2017 3:13 AM

158 matches in four-year FTP - Sakshi

న్యూఢిల్లీ: క్రికెటర్లేమో ‘మేం రోబోలం కాదు. మాకూ విశ్రాంతి కావాలి’ అంటున్నారు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం ఆదాయం కావాలంటోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఇక్కడ జరిగిన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో కీలక నిర్ణయాలు తీసుకుంది. తక్కువ ర్యాంకు జట్లతో టీమిండియా మ్యాచ్‌లను కుదించింది. పోటీ జట్లతోనే సిరీస్‌లకు పచ్చ జెండా ఊపింది. 2019 నుంచి 2023 వరకు సంబంధించిన కొత్త ఎఫ్‌టీపీలో మూడు ఫార్మాట్లలో టీమిండియా ఇంటా బయటా కలిపి 158 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో భారత గడ్డపైనే 81 మ్యాచ్‌లు జరగనుండటం విశేషం. టి20ల సంఖ్యను అనూహ్యంగా పెంచారు. ఈ ఫార్మాట్‌లో 54 మ్యాచ్‌లను చేర్చారు.గత ఎఫ్‌టీపీతో పోలిస్తే 30 (స్వదేశంలో) మ్యాచ్‌లు పెరిగాయి. ఇక ఐపీఎల్‌లో రద్దయిన కొచ్చి టస్కర్స్‌ కేరళ ఫ్రాంచైజీపై న్యాయ పోరాటం చేసేందుకే బోర్డు సిద్ధపడింది. ఆ ఫ్రాంచైజీకి రూ. 850 కోట్ల చెల్లింపుపై కోర్టులో సవాలు చేయనున్నట్లు తెలిపింది. డోప్‌ టెస్టులపై ‘నాడా’ గొడుగు కిందకి వచ్చేందుకు నిరాకరించింది. అధికారికంగా టెస్టు హోదా పొందిన అఫ్ఘానిస్తాన్‌ జట్టుతో 2019లో భారత్‌ తొలి టెస్టు ఆడనుంది.    

మ్యాచ్‌లు ఎక్కువ... మైదానంలో తక్కువ
ఇదేంటి... మ్యాచ్‌ల సంఖ్య పెరిగినప్పుడు సహజంగా ఆడే రోజులు పెరుగుతాయనుకుంటే పొరపాటే! ఎందుకంటే మ్యాచ్‌ల శాతం పెరిగినా... కేవలం పొట్టి ఫార్మాట్‌ మ్యాచ్‌ల వల్ల సొంతగడ్డపై భారత ఆటగాళ్లు ఎక్కువ ఆడినా  మైదానంలో గడిపేది తక్కువ రోజులే! దీంతో ఒక టెస్టు కోసం ఐదు రోజుల స్టేడియంలో ఆడితే... టి20 కోసం ఒక పూట ఆడితే సరిపోతుంది. దీనిపై బోర్డు కార్యదర్శి అమితాబ్‌ చౌదరి మాట్లాడుతూ ‘ముందనుకున్న ప్రతిపాదిత ఎఫ్‌టీపీలో భారత్‌లో 51 మ్యాచ్‌లుంటే ఇప్పుడు ఈ సంఖ్య 81కి పెరిగింది. అయితే 60 శాతం మ్యాచ్‌లు పెరిగినా... 20 శాతం తక్కువగా మైదానంలో శ్రమిస్తారు’ అని అన్నారు.

బ్రాడ్‌కాస్టింగ్‌తో మరో భారీ డీల్‌
ప్రస్తుత ఎఫ్‌టీపీలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ (2021), వన్డే ప్రపంచకప్‌ (2023) మ్యాచ్‌లు భాగం కావని చౌదరి చెప్పారు. ఈ రెండు మెగా ఈవెంట్లకు భారతే ఆతిథ్యమివ్వనుంది. ఇవి కాకుండానే ఆడే 158 మ్యాచ్‌లతో బోర్డుకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అసాధారణ మొత్తం రానుంది. స్టార్‌ స్పోర్ట్స్‌తో ప్రస్తుత ఒప్పందం 2018 మార్చిలో ముగియనుంది. వచ్చే ఏడాది వేలంలో మరో రూ. 10 వేల కోట్లు రావొచ్చని బోర్డు అంచనా వేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement