
కొందరిని మినహాయిస్తే చాలా మంది క్రికెటర్లు 38 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంటారు. ఆ వయసులో ఒకసారి జట్టులో స్థానం కోల్పోయాక వారి మదిలో పునరాగమనం చేయాలనే ఆలోచన రావడం అరుదుగా జరుగుతుంది. భారత వెటరన్ సీమర్ ఆశిష్ నెహ్రా ఇందుకు విరుద్ధం. ఐపీఎల్ ద్వారా యువ క్రికెటర్లు దూసు కొస్తున్న వేళ... పొట్టి ఫార్మాట్‌లో ఈ ఢిల్లీ పేసర్ తన ప్రత్యేకత నిలబెట్టుకున్నాడు. యువ ఆటగాళ్లతో పోటీపడుతూ 38 ఏళ్ల వయసులో మరోసారి జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఈ వారంలో జరిగే మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌కు ఎంపికైనందుకు ఆనందం వ్యక్తం చేసిన నెహ్రా... తన నైపుణ్యంపై సెలెక్టర్లకు, కెప్టెన్ కోహ్లికి నమ్మకం ఉన్నందునే మరోసారి అవకాశం వచ్చిందని అన్నాడు.
న్యూఢిల్లీ: అనూహ్యంగా వెటరన్ సీమర్ ఆశిష్ నెహ్రా భారత టి20 జట్టుకు ఎంపికయ్యాడు. లేటు వయసులో లేటెస్ట్‌గా మళ్లీ పునరాగమనం చేస్తున్న ఈ ఢిల్లీ స్పీడ్‌స్టర్... కెరీర్ ఆసాంతం విమర్శలెప్పుడూ పట్టించుకోలేదని కొత్తగా ఇప్పుడు ఏమంటారోననే బెంగలేదని స్పష్టం చేశాడు. సోషల్ మీడియాకు ఆమడదూరముండే ఆశిష్... అజహరుద్దీన్ హయంలో వచ్చాడంటే ఆశ్చర్య పోవాల్సిందే. 38 ఏళ్ల వయసులో కూడా యువకులాడే టి20 సత్తా తనలో ఉందంటున్నాడు. టెస్టులు, వన్డేల నుంచి ఎప్పుడో తప్పుకున్న ఈ సీనియర్ సీమర్ ఐపీఎల్ అయినా అంతర్జాతీయ క్రికెట్లో అయినా కేవలం పొట్టి ఫార్మాట్‌కే అందుబాటులో ఉంటున్నాడు. తన సుదీర్ఘ కెరీర్‌లోని ఆసక్తికర విషయాల్ని ఇలా పంచుకున్నాడు.
సెలక్టర్లకు తెలుసు... సారథికీ తెలుసు..
నేను తిరిగి భారత్‌కు ఆడితే ఎవరు నొచ్చుకుంటారో మరి! అయినా నేనెప్పుడు విమర్శలను, విమర్శకులను పట్టించుకోను. నా సత్తా ఏంటో డ్రెస్సింగ్ రూమ్‌కు తెలుసు. సారథి కోహ్లికి బాగా తెలుసు. సెలక్టర్లకు ఇంకా బాగా తెలుసు. జట్టులో ఉంటే నా వంతు నేను కష్టపడతాను. ఇక ఈ వయసులో పెద్ద గా లక్ష్యాలేవీ పెట్టుకోను. మూడు మ్యాచ్‌లకు నన్ను ఎంపిక చేశారు. ఒక్కో మ్యాచ్‌పై దృష్టి పెడతాను. నేను ఆడితే వార్త. బాగా ఆడకపోతే అది ఇంకా పెద్ద వార్త (వైసే భి నెహ్రా అచ్చా కరేగా తో భి న్యూస్ హై. అచ్ఛా నహీ కరేగా తో వో ఔర్ భి బడీ న్యూస్ హై).
నాకు తెలియదు...
ట్విట్టర్‌కు, ఫేస్‌బుక్‌కు నేను దూరం. నిజానికి ట్విట్టర్‌లో నా గురించి ఎమరు ఏమనుకుంటున్నారో నిజంగా నాకు తెలియదు. ట్రెయినింగ్, ఫిట్‌నెస్ ఇలా రోజువారీ పనుల్లోనే నిమగ్నమవుతాను. అందుకే ఈవయసులో కూడా స్థిరంగా గంటకు 140 కి.మీ వేగంతో బౌలింగ్ వేయగల సత్తా వుంది. సోషల్ మీడియాలో కనిపించని వారికి ఇప్పుడు జట్టులో కనిపించడం అనూహ్యమే కదా!
జహీర్ సూపర్ బౌలర్...
నా సహచరుడు జహీర్ ఖాన్ కెరీర్ ఆసాంతం టెస్టులు ఆడాడు. అద్భుత బౌలింగ్ నైపుణ్యం అతని సొంతం. ఐదు రోజుల మ్యాచ్ ఆసాంతం 80 శాతం సామర్థ్యంతో బౌలింగ్ చేయగలడు. నా వరకైతే నేను కేవలం టి20లకే పరిమితమయ్యా. నా బౌలింగ్ యాక్షన్ కూడా అసాధారణమైంది కాదు. అలాగే 80 శాతం సత్తా కూడా నాలో లేదు. కేవలం 24 బంతులు (టి20లో గరిష్టంగా 4 ఓవర్లు) మాత్రం చక్కగా వేయగలను. బహుశా ఓ సాధారణ బౌలిం గ్ యాక్షన్ కలిగివుండటం వల్లేనేమో ఈ వయసు లోనూ తేలిగ్గా బౌలింగ్ చేయగలుగుతున్నా.
అజ్జూ భాయ్ హయంలో వచ్చా...
చాలా మందికి తెలుసో, తెలియదో కానీ నేను 1999లో అజహరుద్దీన్ కెప్టెన్సీలో జట్టులోకి వచ్చాను. బహుశా నేను, హర్భజన్ సింగ్ తప్ప ఆయన హయాంలో జాతీయ జట్టులోకి వచ్చిన క్రికెటర్ ఇప్పటికీ ఆడుతున్నట్టు కనిపించడంలేదు. వచ్చే ఫిబ్రవరి నాటికి నా అంతర్జాతీయ కెరీర్‌కు 19 ఏళ్లు పూర్తవుతాయి. ఈ దశలో నేను డబ్బుకోసం ఆడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నాకు 12 సార్లు సర్జరీలు అయ్యాయి. అన్ని శస్త్రచికిత్సలయ్యాక కూడా కోలుకొని క్రికెట్ ఆడటం కూడా అరుదేనేమో? అయితే నా ఉదయం దినచర్య ప్రాక్టీస్‌తో మొదలవుతుంది. ఫిట్‌నెస్‌తో కొనసాగుతుంది. విరామం లేకుండా ఇలా చేస్తున్నందుకేనేమో ఇంకా నేను క్రికెట్ ఉత్సాహంగా ఆడగలుగుతున్నాను.