‘‘గంభీర్ పట్టిందల్లా బంగారమే అవుతుంది. అతడు ఏ జట్టుతో చేరితే.. ఆ జట్టు విజయాలు సాధిస్తుంది. అసలు టీమిండియాకు విదేశీ కోచ్‌ల అవసరమే లేదు.
ఇండియాలోనే ఎంతో మంది ప్రతిభావంతులైన కోచ్‌లు ఉన్నారు. ద్రవిడ్ తర్వాత.. భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్ కంటే అత్యుత్తమ ఆప్షన్ ఇంకొకటి ఉంటుందనుకోను.
అతడొక అద్భుతమైన ఆటగాడు. గొప్ప కోచ్ కూడా కాగలడు. ప్రస్తుతం టీమిండియాకు హెడ్ కోచ్‌గా అతడే సరైనోడు. గంభీర్ తొలుత లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా ఉన్నాడు.
అతడి మార్గ నిర్దేశనంలో లక్నో జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. తర్వాత కేకేఆర్‌కు మెంటార్‌గా వెళ్లాడు. ఆ జట్టు ఏకంగా చాంపియన్‌గా నిలిచింది.
గంభీర్‌ది అత్యద్భుతమైన క్రికెటింగ్ మైండ్. ప్రత్యర్థి జట్టును కచ్చితంగా అంచనా వేసి అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించడంలో దిట్ట. తనతో కలిసి ఆడిన అనుభవం నాకుంది.
కలిసే భోజనం చేసేవాళ్లం. ఆట గురించి చర్చించుకునే వాళ్లం. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య స్నేహ బంధం ఉంది. టచ్‌లోనే ఉంటాం’’ అని పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ అన్నాడు.
భారత క్రికెట్ జట్టు హెడ్‌కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మాత్రమే సరైన ఆప్షన్ అని నొక్కి వక్కాణించాడు. అతడి మార్గదర్శనంలో టీమిండియా మరింత పటిష్టంగా మారుతుందని కమ్రాన్ అక్మల్ పేర్కొన్నాడు.
బౌలింగ్ కోచ్‌గా వారిలో ఒకరు బెటర్
ఇక గంభీర్ ప్రధాన కోచ్‌గా ఉంటే.. ఆశిష్ నెహ్రా లేదంటే జహీర్ ఖాన్‌లలో ఒకరిని బీసీసీఐ తమ బౌలింగ్ కోచ్‌గా ఎంచుకోవాలని సూచించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ కమ్రాన్ అక్మల్ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్నాడు. ఈ నేపథ్యంలో అతడి వారసుడిగా గౌతం గంభీర్ ఎంపిక దాదాపుగా ఖాయమైపోయింది.
మెంటార్‌గా మాత్రమే
ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు మెంటార్‌గా పనిచేశాడు గౌతీ. అయితే, కోచ్‌గా మాత్రం అతడికి అనుభవం లేదు.
ఇక వరల్డ్‌కప్ టోర్నీలో విజయ వంతంగా ముందుకు సాగుతున్న టీమిండియా గురువారం సూపర్-8 దశలో తొలి మ్యాచ్ ఆడనుంది. అఫ్గనిస్తాన్‌తో బార్బడోస్ వేదికగా తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment