శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను జట్టులోకి పిలిపించడం సరైన నిర్ణయం కాదేమోనని టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. ఈ దిగ్గజ బ్యాటర్లకు విశ్రాంతి ఇవ్వకుండా నూతన కోచ్ గౌతం గంభీర్ తప్పుచేశాడని అభిప్రాయపడ్డాడు. రోహిత్- కోహ్లి గంభీర్‌కు కొత్త కాదని.. వారి ఆట తీరు గురించి అతడికి అవగాహన ఉందని నెహ్రా పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. ఈ టోర్నీ తర్వాత సెలవులు తీసుకున్నారు. భార్య రితిక, కూతురు సమైరాలతో కలిసి రోహిత్ అమెరికాకు వెళ్లిపోగా.. కోహ్లి లండన్‌లో ఉన్న తన సతీమణి అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్‌ల దగ్గరకు వెళ్లాడు.
ఈ నేపథ్యంలో వీరిద్దరు శ్రీలంకతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపించాయి. కుటుంబాలతో మరికొన్నాళ్లు ఎక్కువ సమయం గడపాలని భావించిన కోహ్లి- రోహిత్.. ఈ విషయాన్ని ముందుగానే బీసీసీఐతో చర్చించినట్లు సమాచారం. అయితే, చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు టీమిండియాకు శ్రీలంక, ఇంగ్లండ్‌తో మాత్రమే మ్యాచ్(3+3)లు మిగిలి ఉండటంతో.. గంభీర్ వీరిద్దరిని వెనక్కిపిలిపించాడని తెలిసింది.
సీనియర్లు జట్టులో ఉండాలని అతడు భావించాడని.. తన ఆలోచనను కోహ్లి- రోహిత్‌లతో పంచుకోగా వారు లంక పర్యటనకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా తదుపరి వన్డే సిరీస్‌కు 2- 3 నెలల సమయం ఉంది. నిజానికి ఇలాంటివి అరుదుగా జరుగుతూ ఉంటాయి.
అంతకంటే ముందు టెస్టు, టీ20 సిరీస్‌లు జరుగనున్నాయి. అలాంటపుడు రోహిత్, కోహ్లిలను హడావుడిగా రప్పించాల్సిన అవసరం లేదు. నిజానికి శ్రీలంక సిరీస్ ద్వారా ఇతర ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇస్తే బాగుండేది. గంభీర్ కొత్తగా కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో అతడు ఎక్కువ సమయం గడపాలని భావించడం సహజం.
అయితే, రోహిత్- కోహ్లి గురించి అతడికి ముందే తెలుసు కదా! ఈ ఇద్దరితో ఎక్కువ సమయం గడిపి వారి ఆట తీరును పరిశీలించిందేకు తనేమీ విదేశీ కోచ్ కాదు. స్వదేశీ సిరీస్‌లు మొదలైన తర్వాత కోహ్లి- రోహిత్ ఎలాగో ఆడతారు. అప్పటిదాకా వేరే వాళ్లకు అవకాశం ఇస్తే బాగుండేది.
ఈ విషయంలో నేను గంభీర్‌ను తప్పుబట్టడం లేదు. అయితే, ఇలాంటి వ్యూహాల వల్ల జట్టుకు మేలే చేకూరుతుంది’’ అని ఆశిష్ నెహ్రా సోనీ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. కాగా శ్రీలంకతో ఇప్పటిదాకా రెండు వన్డేల్లో రోహిత్ 122 పరుగులతో రాణించగా.. కోహ్లి మాత్రం కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment