IPL 2025: గుజరాత్‌ హెడ్‌ కోచ్‌గా యువరాజ్‌ సింగ్‌..? | Yuvraj Singh To Replace Ashish Nehra As Gujarat Titans Head Coach Ahead Of IPL 2025 Says Reports | Sakshi
Sakshi News home page

IPL 2025: గుజరాత్‌ హెడ్‌ కోచ్‌గా యువరాజ్‌ సింగ్‌..?

Published Wed, Jul 24 2024 7:58 AM | Last Updated on Wed, Jul 24 2024 9:30 AM

Yuvraj Singh To Replace Ashish Nehra As Gujarat Titans Head Coach Ahead Of IPL 2025 Says Reports

ఐపీఎల్‌ 2025 సీజన్‌ ప్రారంభానికి చాలా సమయం ఉన్నప్పటికీ అన్ని ఫ్రాంచైజీలు ప్రక్షాళన బాట పట్టాయి. కొన్ని ఫ్రాంచైజీలేమో ఆటగాళ్లను వదిలించుకోవాలని భావిస్తుంటే.. మరికొన్ని కోచింగ్‌ స్టాఫ్‌, మెంటార్‌లను మార్చే పనిలో పడ్డాయి. తాజాగా గుజరాత్‌ ఫ్రాంచైజీకి సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. హెడ్‌ కోచ్‌ ఆశిష్‌ నెహ్రా గుజరాత్‌ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. 

అతనితో పాటు డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ విక్రమ్‌ సోలంకి కూడా తప్పుకోనున్నట్లు సమాచారం. వీరిద్దరి పర్యవేక్షణలో గుజరాత్‌ తమ తొలి రెండు సీజన్లలో ఫైనల్స్‌కు చేరింది. 2022లో ఛాంపియన్‌గా, 2023లో రన్నరప్‌గా నిలిచింది. ఇంతటి విజయవంతమైన జోడీ ప్రస్తుతం గుజరాత్‌ను వీడాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. గత సీజన్‌లో (2024) వైఫల్యాల కారణంగా ఫ్రాంచైజీ యాజమాన్యం సైతం వీరిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం​. 

మేనేజ్‌మెంట్‌ తప్పించాలని నిర్ణయం తీసుకునే లోపే తామే స్వచ్చందంగా తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని వీరు భావిస్తుండవచ్చు. గుజరాత్‌ ఫ్రాంచైజీకి సంబంధించి ఈ టాపిక్‌ నడుస్తుండగానే మరో వార్త సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. నెహ్రా గుజరాత్‌ హెడ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పుకుంటే టీమిండియా దిగ్గజం యువరాజ్‌ సింగ్‌ ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతుంది. 

యువరాజ్‌తో గుజరాత్‌ యాజమాన్యం సంప్రదింపులు కూడా పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. యువీకి గతంలో ఏ జట్టుకు కోచింగ్‌ ఇచ్చిన అనుభవం లేదు. ఒకవేళ అతన్ని గుజరాత్‌ టైటాన్స్‌ పంచన చేర్చుకుంటే ఇదే అతనికి తొలి కోచింగ్‌ పదవి అవుతుంది. గుజరాత్‌ ఆఫర్‌పై యువీ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. 

కాగా, గుజరాత్‌ గత సీజన్‌లో ట్రేడింగ్‌ ద్వారా హార్దిక్‌ పాండ్యాను ముంబై ఇండియన్స్‌కు అప్పజెప్పిన విషయం తెలిసిందే. హార్దిక్‌ ఎగ్జిట్‌తో శుభ్‌మన్‌ గిల్‌ గుజరాత్‌ నూతన కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గిల్‌ నేతృత్వంలో గుజరాత్‌ గత సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో ఐదింట మాత్రమే విజయాలు సాధించి లీగ్‌ దశలోనే నిష్క్రమించింది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement