‘అందుకే అప్లై చేయలేదు.. నేను గంభీర్‌లా కాదు’ | Soch Alag Hoti: Ashish Nehra On Not To Apply For India Coach Job Pandya Demotion | Sakshi
Sakshi News home page

అందుకే హెడ్‌కోచ్‌ పదవికి అప్లై చేయలేదు.. హార్దిక్‌ విషయంలో..: నెహ్రా

Published Thu, Jul 25 2024 12:06 PM | Last Updated on Thu, Jul 25 2024 12:19 PM

Soch Alag Hoti: Ashish Nehra On Not To Apply For India Coach Job Pandya Demotion

హార్దిక్‌ పాండ్యాతో నెహ్రా (PC: BCCI)

శ్రీలంక తాజా పర్యటనతో భారత క్రికెట్‌లో నూతన శకం ఆరంభం కానుంది. ఇంతవరకు కోచ్‌గా అనుభవం లేని మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అదే విధంగా.. దిగ్గజ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా రిటర్మెంట్‌ తర్వాత భారత్‌ తొలిసారి టీ20 సిరీస్‌లో పాల్గొననుంది.

ఇక ఈ జట్టుకు నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ పూర్తిస్థాయికి కెప్టెన్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను కాదని సూర్యకు టీ20 పగ్గాలు అప్పగించడంపై భిన్న స్పందనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ బౌలర్‌ ఆశిష్‌ నెహ్రా సైతం తన అభిప్రాయం వ్యక్తపరిచాడు.

ఆశ్చర్యం కలిగించలేదు
‘‘హార్దిక్‌ పాండ్యా మూడు ఫార్మాట్లు ఆడలేకపోతున్నాడు. టెస్టులకు దూరమైన అతడు యాభై ఓవర్ల క్రికెట్‌లోనూ పూర్తిస్థాయిలో జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. అలాంటి ఆటగాడి సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలనుకోవడం కత్తిమీద సాము లాంటిదే.

అయినా క్రికెట్‌లో ఇవన్నీ సహజం. హార్దిక్‌పై వేటు వేయడం నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. అయితే, టీ20 ప్రపంచకప్‌-2024లో వైస్‌ కెప్టెన్‌గా ఉన్న అతడిని ఇలా అకస్మాత్తుగా రేసు నుంచి తప్పించడం మాత్రం ఆశ్చర్యకరం. అయితే, కొత్త కోచ్‌ ఆలోచనలేమిటో మనకు తెలియదు. ప్రతి కోచ్‌, కెప్టెన్‌ అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి కదా’’ అని ఆశిష్‌ నెహ్రా పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే.. టీమిండియా హెడ్‌ కోచ్‌ రేసులో ఆశిష్‌ నెహ్రా పేరు కూడా వినిపించిన విషయం తెలిసిందే. అయితే, తాను మాత్రం ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోలేదని 45 ఏళ్ల నెహ్రా తెలిపాడు. ఇందుకు గల కారణాలు కూడా వెల్లడించాడు.

నేను గంభీర్‌లా కాదు
‘‘ఈ విషయం గురించి నేను ఎన్నడూ ఆలోచించనేలేదు. నా పిల్లలు ఇంకా చిన్నవాళ్లే. గౌతం గంభీర్‌ పిల్లలు కూడా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. అయితే, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు.

ప్రస్తుతం నా పనులతో నేను బిజీగా, సంతోషంగా ఉన్నాను. జట్టుతో కలిసి తొమ్మిది నెలల పాటు ప్రయాణించే ఓపిక నాకు లేదు’’ అని ఆశిష్‌ నెహ్రా స్పష్టం చేశాడు. కాగా ఆశిష్‌ నెహ్రా ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో కలిసి పనిచేస్తున్నాడు.

టైటాన్స్‌తో అనుబంధం
ఐపీఎల్‌-2022లో ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు నెహ్రా మార్గదర్శనంలోని  హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో చాంపియన్‌గా అవతరించింది. మరుసటి ఏడాది కూడా ఫైనల్‌ చేరింది. అయితే, ఐపీఎల్‌-2024లో పాండ్యా టైటాన్స్‌తో బంధం తెంచుకున్నాడు. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.

చదవండి: ప్రేమ’తో నటాషా పోస్ట్‌.. హార్దిక్‌ పాండ్యా కామెంట్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement