‘కోహ్లితో చెప్పలేదట.. హార్దిక్‌ పాండ్యాకు తెలుసు’ | No BCCI Kohli Chat Before Gambhir Appointment Hardik Consulted: Report | Sakshi
Sakshi News home page

‘కోహ్లితో చెప్పలేదట.. హార్దిక్‌ పాండ్యాకు మాత్రం తెలుసు’.. గంభీర్‌ ముందున్న సవాళ్లు!

Published Thu, Jul 11 2024 12:56 PM | Last Updated on Thu, Jul 11 2024 1:29 PM

No BCCI Kohli Chat Before Gambhir Appointment Hardik Consulted: Report

భారత క్రికెట్‌లో ‘గంభీర్‌’ శకం ఆరంభం కానుంది. పురుషుల జట్టు ప్రధాన కోచ్‌గా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు.

సీనియర్లు, జూనియర్ల మేళవింపుతో ఉన్న టీమిండియాను తన మార్గదర్శనంలో సమర్థవంతంగా ముందుకు నడపటం ఆషామాషీ కాదు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్యా వంటి స్టార్‌ ఆటగాళ్లను కొనసాగిస్తూనే యువకులకు అవకాశం ఇచ్చే విషయంలో గౌతీ ఎలా వ్యవహరిస్తాడనేది కీలకం.

రానున్న మూడున్నరేళ్ల కాలం హెడ్‌ కోచ్‌గా కొనసాగనున్న గంభీర్‌కు తొలుత చాంపియన్స్‌ ట్రోఫీ-2025 రూపంలో సవాలు ఎదురుకానుంది. ఆ తర్వాత వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25, టీ20 ప్రపంచకప్‌-2026, వన్డే వరల్డ్‌కప్‌-2027.

ఈ ఐసీసీ టోర్నీలలో టీమిండియాను టాప్‌లో నిలపడం అంత తేలికేమీ కాదు. రోహిత్‌- కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించారు. అయితే, వన్డే, టెస్టుల్లో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ, బ్యాటర్‌గా కోహ్లి కీలకం.

కాగా ఐపీఎల్‌-2023 సందర్భంగా కోహ్లితో గంభీర్‌కు వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఇద్దరూ కలిసిపోయినట్లుగా కనిపించినా.. ఇప్పుడు కోచ్‌, ఆటగాడి పాత్రల్లో ఏ మేరకు సమన్వయం చేసుకుంటారనేది  ఆసక్తికరంగా మారింది.

మరోవైపు.. ద్రవిడ్‌నే హెడ్‌ కోచ్‌గా కొనసాగితేనే బాగుంటుందంటూ రోహిత్‌ బీసీసీఐ ఎదుట తన మనసులో మాట బయటపెట్టినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో వీరిద్దరితో గంభీర్‌ ఎలా మెలుగుతాడన్నదే ప్రశ్న. రాహుల్‌ ద్రవిడ్‌లా పెద్దన్నలా వ్యవహరిస్తాడా? లేదంటే తనదైన సహజశైలిలో దూకుడుగానే ఉంటాడా? చూడాలి.


ఇదిలా ఉంటే.. గంభీర్‌ నియామకం నేపథ్యంలో బీసీసీఐ ఒక్కసారి కూడా రోహిత్‌- కోహ్లి ద్వయాన్ని సంప్రదించలేదనే వార్త బయటకు వచ్చింది.

అదే సమయంలో వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాకు మాత్రం ఈ విషయం గురించి ముందుగానే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు హిందుస్తాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘వీరంతా కూర్చుని మాట్లాడుకోవడానికి, జట్టు గురించి చర్చించడానికి చాలా సమయం ఉంది. ఇప్పుడే ఏమీ ముగిసిపోలేదు.

సమీప భవిష్యత్తులో యువ ఆటగాళ్లదే కీలక పాత్ర కాబోతున్నందున ఆ దిశగా బీసీసీఐ నిర్ణయాలు తీసుకుంటోంది. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ముందడుగు వేస్తోంది’’ అని పేర్కొన్నాయి.

కాగా రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి విశ్రాంతి కోరుకుంటున్నారని.. ఇద్దరూ లాంగ్‌ లీవ్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకతో సిరీస్‌తో కోచ్‌గా గంభీర్‌ అరంగేట్రం చేయనుండగా.. ఆ వన్డే సిరీస్‌కు వీరిద్దరు దూరంగా ఉండనున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement