టీమిండియా కోచ్‌గా గౌతం గంభీర్ ప్రయాణం జూలైలో ఆరంభం కానుంది. ఈనెల చివర్లో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే విడుదల చేసింది.
రెండు వేదికల్లో 13 రోజులపాటు జరిగే ఈ సిరీస్‌లో శ్రీలంకతో భారత జట్టు మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడుతుంది. పల్లెకెలో మైదానంలో జూలై 26, 27, 29వ తేదీల్లో వరుసగామూడు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి.
అనంతరం ఆగస్టు 1, 4, 7 తేదీల్లో కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో మూడు వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును ఇంకా ప్రకటించలేదు.
ఈ నేపథ్యంలో జట్టు ఎంపిక గురించి హెడ్ కోచ్ గౌతం గంభీర్ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో వచ్చే వారం భేటీ కానున్నట్లు సమాచారం. కాగా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా ఈ పర్యటనకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, టీ20 జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌లకు కూడా మేనేజ్‌మెంట్ విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో లంకలో పర్యటించే జట్ల ఎంపిక కూర్పుపై.. ముఖ్యంగా కెప్టెన్ల విషయంలో గౌతీ అజిత్‌తో చర్చలు జరుపనున్నట్లు సమాచారం. కాగా కేఎల్ రాహుల్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ వన్డేల్లో పునరాగమనం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
రోహిత్ శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ లంకతో వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా.. శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ గురించి కూడా ఈ భేటీలో గంభీర్ అజిత్‌తో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఒకవేళ హార్దిక్ విశ్రాంతి కోరుకోనట్లయితే అతడికి టీ20 పగ్గాలు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అతడికి డిప్యూటీగా సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేస్తారని బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాతో పేర్కొన్నాయి.
అదే విధంగా సీనియర్ల గైర్హాజరీలో శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్,ఆవేశ్ ఖాన్, అభిషేక్ శర్మ తదితర యువ ఆటగాళ్లు లంకతో టీ20 సిరీస్ ఆడబొయే జట్టులో చోటు దక్కించుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీళ్లంతా జింబాబ్వే పర్యటనలో ఉన్నారు.
ఇక ఈసారి టీమిండియా- శ్రీలంక సిరీస్‌కు మరో ప్రత్యేకత ఏర్పడింది. రెండు జట్లూ ఈసారి కొత్త హెడ్ కోచ్‌ల పర్యవేక్షణలో ద్వైపాక్షిక సిరీస్‌లో పోటీపడనున్నాయి. టీమిండియాకు గౌతం గంభీర్... శ్రీలంకకు సనత్ జయసూర్య హెడ్ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు.
గందరగోళంగా శ్రీలంక జట్టు పరిస్థితి
గత నెలలో వెస్టిండీస్–అమెరికాలలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో హసరంగ నేతృత్వంలో ఆడిన శ్రీలంక లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. జట్టు పేలవ ప్రదర్శన కారణంగా హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ తన పదవికి రాజీనామా చేయగా, కోచ్ బాటనే కెప్టెన్ కూడా అనుసరించాడు.
శ్రీలంక టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ వైదొలిగాడు. శ్రీలంక క్రికెట్ మేలు కోరే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు, జట్టులో సభ్యుడిగా కొనసాగుతానని హసరంగ వివరించాడు. హసరంగ రాజీనామా నేపథ్యంలో టీమిండియాతో సిరీస్‌ను శ్రీలంక కొత్త కెప్టెన్ ఆధ్వర్యంలో ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment