భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా అతడికి కాలం కలిసిరావడం లేదు.
భార్య నటాషా స్టాంకోవిక్‌తో విడాకులు తీసుకున్నట్లు హార్దిక్ ఇటీవలే అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, కుమారుడు అగస్త్య విషయంలో మాత్రం ఇద్దరం సమానంగా బాధ్యత వహిస్తామని.. కో పేరెంటింగ్ చేస్తామని వెల్లడించాడు.
కానీ సంయుక్త విడాకుల ప్రకటన అనంతరం నటాషా అగస్త్యను తీసుకుని తన పుట్టినిల్లు సెర్బియాకు వెళ్లిపోయింది. ముంబై ఎయిర్‌పోర్టు నుంచి అక్కడికి బయల్దేరుతున్న సమయంలో అగస్త్య ఏడుస్తూ కనిపించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.
ఏడ్చేసిన అగస్త్య!
తండ్రిని విడిచి వెళ్లేందుకు సిద్ధంగా లేకపోయినా.. తల్లి బలవంతం చేయడంతోనే అగస్త్య ఆమెతో వెళ్లినట్లుగా ఆ వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో హార్దిక్ సైతం తీవ్రమైన బాధతో కుంగిపోతున్నట్లు సమాచారం.
వ్యక్తిగత జీవితంలో ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యాకు.. టీమిండియాలోనూ కష్టకాలం మొదలైనట్లే కనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్-2024లో వైస్ కెప్టెన్‌గా సత్తా చాటిన ఈ ఆల్‌రౌండర్‌ను బీసీసీఐ పక్కనపెట్టింది.
చేజారిన కెప్టెన్సీ
కొత్త కోచ్ గౌతం గంభీర్ హయాంలో సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. శ్రీలంక పర్యటన నేపథ్యంలో రెగ్యులర్ కెప్టెన్‌గా సూర్యను ప్రకటించి హార్దిక్ పాండ్యాను కేవలం ఆటగాడిగా పేర్కొంది.
అయితే, ఈ టూర్‌లో భాగంగా వన్డే సిరీస్ కూడా జరుగనుంది. కానీ జట్టులో హార్దిక్‌కు చోటు ఇవ్వలేదు సెలక్టర్లు. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతం గంభీర్ వల్లే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మూడు ఫార్మాట్లలో ఆడాలి
కాగా కోచ్‌గా ప్రయాణం మొదలుపెట్టకముందే.. గంభీర్ తన వైఖరేంటో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఫిట్‌గా ఉండే ఆటగాళ్లు కచ్చితంగా మూడు ఫార్మాట్లు ఆడాలని పేర్కొన్నాడు.
గాయాల భయంతో ఆటకు దూరంగా ఉంటే తనకు నచ్చదని పేర్కొన్నాడు. హార్దిక్ విషయానికొస్తే.. ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ తరచూ గాయాల బారిన పడుతూ ఉంటాడన్న విషయం తెలిసిందే.
అందుకే ఇప్పటికే అతడు టెస్టు ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నాడు. కేవలం వన్డే, టీ20లు మాత్రమే ఆడుతున్నాడు. ఇక వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా గాయపడిన తర్వాత అతడికి మళ్లీ వన్డే ఆడే అవకాశం రాలేదు.
దేశవాళీ క్రికెట్ ఆడితేనే రీఎంట్రీ
ఐపీఎల్-2024లో ఫిట్‌నెస్ నిరూపించుకోవడం ద్వారా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని గంభీర్ హార్దిక్‌కు కండిషన్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
విజయ్ హజారే ట్రోఫీ(వన్డే)లో ఆడి.. బౌలింగ్‌లోనూ ఫిట్‌నెస్ నిరూపించుకున్న తర్వాతే యాభై ఓవర్ల ఫార్మాట్‌లో పునరాగమనం చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
బీసీసీఐ కూడా చెప్పిందిదే
ఈ మేరకు బీసీసీఐ వర్గాలు.. ‘‘వన్డేల్లో హార్దిక్ పూర్తి కోటా బౌలింగ్ చేస్తే చూడాలని ఉందని గంభీర్ అతడికి ఫోన్ కాల్ ద్వారా తెలిపాడు’’ అని హిందుస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నాయి.
ఇక శ్రీలంక టూర్‌కు జట్ల ప్రకటన సమయంలో బీసీసీఐ సైతం దేశవాళీ క్రికెట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆటగాళ్లు డొమెస్టిక్ క్రికెట్‌కు అందుబాటులో ఉండాల్సిన ఆవశ్యకత ఉందని.. దేశీ టోర్నీల్లో పాల్గొన్నాలన్న నిబంధనలు అమలు చేస్తామని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment