ICC: టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనే?! | No Hybrid Model: PCB Chief Sends Fiery Champions Trophy Warning To ICC | Sakshi
Sakshi News home page

ICC: నువ్వా- నేనా?.. తగ్గేదేలే అంటున్న బీసీసీఐ, పీసీబీ!

Published Sat, Jul 20 2024 7:38 PM | Last Updated on Sat, Jul 20 2024 7:52 PM

No Hybrid Model: PCB Chief Sends Fiery Champions Trophy Warning To ICC

చాంపియన్స్‌ ట్రోఫీ-2025 విషయంలో వెనక్కి తగ్గేందుకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ మొహ్సిన్‌ నఖ్వీ సిద్ధంగా లేరని సమాచారం. మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్‌లోనే నిర్వహించాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే విషయాన్ని నఖ్వీ అంతర్జాతీయ క్రికెట్‌ మండలికి కూడా చెప్పినట్లు సమాచారం. ఈ మెగా టోర్నీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించేందుకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఐసీసీకి స్పష్టం చేసినట్లు పాక్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

తగ్గేదేలే!
కాగా వన్డే ప్రపంచకప్‌-2023 టోర్నీకి భారత్‌ ఆతిథ్యమివ్వగా.. చాంపియన్స్‌ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను పాకిస్తాన్‌ దక్కించుకుంది. అయితే, ఇరు దేశాల మధ్య పరిస్థితులు, భద్రతా కారణాల దృష్ట్యా బీసీసీఐ టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు సిద్ధంగా లేదు.

అందుకే ఆసియా వన్డే కప్‌-2023 మాదిరే ఈసారి కూడా హైబ్రిడ్‌ విధానంలో షెడ్యూల్‌ ఖరారు చేయాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌ ఆతిథ్యమిచ్చిన ఆసియా టోర్నీలో టీమిండియా ఆడే మ్యాచ్‌లు మాత్రం శ్రీలంకలో నిర్వహించారు.

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ విషయంలోనూ ఇలాగే జరగాలని బీసీసీఐ కోరుకుంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ మొహ్సిన్‌ నఖ్వీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

ఆ బాధ్యత మీదే 
టీమిండియాను పాకిస్తాన్‌కు తీసుకువచ్చే బాధ్యత ఐసీసీదేనని.. ఈ విషయంతో తమకు ఎలాంటి సంబంధం లేదని నఖ్వీ కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. అలా జరగని పక్షంలో ఆ జట్టు టోర్నీ నుంచి వైదొలగాలే తప్ప హైబ్రిడ్‌ మోడల్‌కు మాత్రం తాము ఒప్పుకొనేది లేదని అతడు అన్నట్లుగా పాక్‌ మీడియా వెల్లడించింది.

ఈ నేపథ్యంలో ఐసీసీ ఎటువైపు మొగ్గుచూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. టీమిండియా గనుక ఈ టోర్నీ ఆడకపోతే ఓవరాల్‌గా తమకు నష్టం. అదే పాక్‌ మాట కాదంటే తాము నష్టపోయినందుకు పరిహారం చెల్లించాలని కోరే అవకాశం ఉంది.

టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనే?!
కొలంబోలో జరుగుతున్న ఐసీసీ సర్వసభ్య సమావేశం ముగిసేలోగా ఈ అంశంపై ఐసీసీ తుది నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు.. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్‌ ప్రభుత్వం టీమిండియా మ్యాచ్‌లను లాహోర్‌లో నిర్వహించేందుకు షెడ్యూల్‌ కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.  కాగా 2008లో చివరిసారిగా మహేంద్ర సింగ్‌ ధోని నాయకత్వంలో టీమిండియా పాకిస్తాన్‌లో పర్యటించింది. 

చదవండి: NCAకు వీవీఎస్‌ లక్ష్మణ్‌ గుడ్‌బై.. కొత్త హెడ్‌ అతడే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement