దాదాపు 27 ఏళ్ల తర్వాత తొలిసారి శ్రీలంక టీమిండియాపై వన్డే సిరీస్ గెలిచింది. సొంతగడ్డపై స్పిన్ వల పన్ని భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి.. 2-0తో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో లంక తాత్కాలిక హెడ్‌కోచ్, మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య హర్షం వ్యక్తం చేశాడు.
కుర్రాళ్లు అద్భుత ఆటతీరుతో.. ఎంతో కఠిన శ్రమకోర్చి గెలుపు రుచిని చవిచూశారని ప్రశంసించాడు. టీ20 సిరీస్‌లో ఎదురైన చేదు అనుభవం నుంచి కోలుకుని.. అనూహ్య విజయాన్ని అందుకున్నారని సనత్ జయసూర్య లంక వన్డే జట్టును కొనియాడాడు. కాగా మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.
చేదు అనుభవం
ఈ టూర్‌తో టీమిండియా టీ20 రెగ్యులర్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, కొత్త హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టారు. ఆతిథ్య శ్రీలంకను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేయడంతో ఇద్దరి ఖాతాలో భారీ విజయం నమోదైంది. అయితే, వన్డేలో మాత్రం టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది.
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు 2-0తో సిరీస్‌ను లంకకు సమర్పించుకుంది. తొలి వన్డేను టై చేసుకున్నప్పటికీ... శ్రీలంక స్పిన్నర్లు జెఫ్రె వాండర్సె, దునిత్ వెల్లలగే స్పిన్ మాయాజాలంలో చిక్కి ఆఖరి రెండు వన్డేల్లో ఓటమిని మూటగట్టుకుంది.
ఈ నేపథ్యంలో శ్రీలంక కోచ్ సనత్ జయసూర్య మాట్లాడుతూ.. ‘‘సుదీర్ఘకాలం పాటు ఇందుకోసం నిరీక్షించాం. 1997లో నేను జట్టులో ఉన్నపుడు టీమిండియాపై వన్డే సిరీస్ గెలిచాం. మళ్లీ ఇప్పుడు ఇలా విజయం అందుకున్నాం. 27 ఏళ్ల తర్వాత.. ఇలా దక్కిన గెలుపులో నేనూ భాగమైనందుకు సంతోషంగా ఉంది.
ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు
శ్రీలంకలో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. వాళ్లు ఏం చేయగలరో ఈ సిరీస్ ద్వారా చేసి చూపించారు. టీ20 సిరీస్ తర్వాత అంతా స్తబ్దుగా మారిపోయింది. మేము తిరిగి పుంజుకుంటామని ఎవరూ ఊహించలేదు. అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. అద్భుతంగా ఆడారు.
వెల్లలగే, నిసాంక, అవిష్క ఫెర్నాండో, అసలంక.. ఇలా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. హసరంగ గాయం కారణంగా దూరం కాగా.. వాండర్సె అతడి స్థానంలో వచ్చి.. అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. వెల్లలగే సైతం అద్బుతంగా రాణించాడు’’ అని సనత్ జయసూర్య తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.
కొత్త కోచ్ కోసం వెతుకున్నారు
టీమిండియా, ఇంగ్లండ్‌లతో సిరీస్‌ల నేపథ్యంలో తాను కోచ్‌గా బాధ్యతలు చేపట్టానని... ఈ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత కొత్త కోచ్ వస్తాడని సనత్ జయసూర్య తెలిపాడు. ఇందుకోసం లంక బోర్డు వివిధ ఆప్షన్లు పరిశీలిస్తున్నట్లు తెలిపాడు. అయితే, హై పర్ఫామెన్స్ ఇన్‌చార్జ్‌గా తాను శ్రీలంక క్రికెట్‌కు సేవలు అందిస్తూనే ఉంటానని స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment