‘ఇంత చెత్తగా ఆడతారా?.. గంభీర్‌కు ఇలాంటివి నచ్చవు’ | Ind vs SL 1st ODI: Arshdeep Singh Brutally Trolled That Shot Not Impress Gambhir | Sakshi
Sakshi News home page

Ind vs SL: చెత్త షాట్‌ సెలక్షన్‌.. అతడి వల్లే ‘టై’!.. ఫ్యాన్స్‌ ఫైర్‌

Published Sat, Aug 3 2024 12:06 PM | Last Updated on Sat, Aug 3 2024 1:33 PM

Ind vs SL 1st ODI: Arshdeep Singh Brutally Trolled That Shot Not Impress Gambhir

టీమిండియా యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెత్త షాట్‌ సెలక్షన్‌తో గెలవాల్సిన మ్యాచ్‌ను ‘టై’ చేశాడంటూ భారత జట్టు అభిమానులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దూకుడుగా బ్యాటింగ్‌ చేయాలనే సరదానా? లేదంటే ప్రత్యర్థి అంటే లెక్కలేనితనమా అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు.

కాగా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌ నియమితుడైన తర్వాత తొలిసారిగా.. మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు భారత క్రికెట్‌ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలో టీ20 సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్‌ చేసిన టీమిండియా.. రోహిత్‌ శర్మ సారథ్యంలో శుక్రవారం వన్డే సిరీస్‌ మొదలుపెట్టింది.

కొలంబో వేదికగా జరిగిన తొలి వన్డేలో విజయానికి చేరువగా వచ్చిన టీమిండియా.. ‘టై’తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆతిథ్య లంక విధించిన 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ గెలుపొందాలంటే.. 18 బంతుల్లో 5 పరుగులు అవసరమైన సమీకరణానికి చేరుకుంది. చేతిలో అప్పటికి రెండు వికెట్లు ఉన్నాయి.

ఈ దశలో.. శ్రీలంక కెప్టెన్‌ చరిత్‌ అసలంక  48వ ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. అప్పటికి శివం దూబే, మహ్మద్‌ సిరాజ్‌ క్రీజులో ఉన్నారు. అయితే, అసలంక ఓవర్లో మొదటి రెండు బంతుల్లో దూబే పరుగులు రాబట్టలేకపోయాడు. ఈ క్రమంలో మూడో బంతికి ఫోర్‌ కొట్టగా ఇరు జట్ల స్కోరు సమమైంది. అయితే, అనూహ్య రీతిలో ఆ మరుసటి బంతికి దూబనే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు అసలంక.

ఈ రైటార్మ్‌ ఆఫ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌ బౌలింగ్‌లో దూబే ముందుకు వచ్చి ఆడబోగా.. బంతి ముందుగా ప్యాడ్‌ను తాకింది. దీంతో ఎల్బీడబ్ల్యూగా దూబే పెవిలియన్‌ చేరగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌ క్రీజులోకి వచ్చాడు. అయితే, వచ్చీ రాగానే అసలంక బౌలింగ్‌లో భారీ స్లాగ్‌స్వీప్‌ షాట్‌ ఆడబోయిన అర్ష్‌దీప్‌.. పూర్తిగా విఫలమయ్యాడు. అసలంక బౌలింగ్‌లో లెగ్‌ బిఫోర్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా  భారత్‌ పదో వికెట్‌ కోల్పోయింది. మ్యాచ్‌ టై గా ముగిసింది.

నిజానికి.. ఇంకా 14 బంతులు మిగిలి ఉండి.. విజయానికి ఒక్క పరుగు తీయాల్సిన సమయంలో అర్ష్‌దీప్‌ డిఫెన్స్‌ ఆడాల్సింది. కానీ అలా చేయకుండా బ్యాటర్‌ మాదిరి భారీ షాట్‌కు యత్నించి వికెట్‌ పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్‌ షాట్‌ సెలక్షన్‌పై విమర్శలు వస్తున్నాయి. మాజీ పేసర్‌ దొడ్డ గణేశ్‌ స్పందిస్తూ.. ‘‘టెయిలెండర్ల నుంచి పరుగులు ఆశించలేం.

కానీ కనీస క్రికెట్‌ ప్రమాణాలు తెలిసి ఉండాలి కదా! అర్ష్‌దీప్‌ షాట్‌ సెలక్షన్‌ కచ్చితంగా గంభీర్‌కు నచ్చి ఉండదు. ఏదేమైనా శ్రీలంక బౌలర్లు అద్భుతంగా ఆడారు. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంకకు ఈ ఫలితం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది’’ అని పేర్కొన్నాడు. టీమిండియా అభిమానులు సైతం దొడ్డ గణేశ్‌ వ్యాఖ్యలను సమర్థిస్తూ.. అర్ష్‌పై ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో లెఫ్టార్మ్‌ మీడియం పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌.. 33 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement