తీన్మార్ స్టెప్పులు.. బతుకమ్మ ఆటలు
ముక్తాపూర్ (భూదాన్‌పోచంపల్లి) : పోచంపల్లి మండలం ముక్తాపూర్‌లో విదేశీయులు ఆదివారం సందడి చేశారు. తీన్మార్ స్టెప్పులు, బతుకమ్మ ఆటలతో ఆకట్టుకున్నారు. గ్రామీణ కుల వృత్తులు, పంచాయతీ పాలనపై అధ్యయనం చేసేందుకు హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్త(నిర్డ్), పంచాయతీ రాజ్‌శాఖ ఆధ్వర్యంలో జింబాబ్వే, సిరియా, ఎరిథ్రియా, టంజానియా, తజకిస్తాన్, సూడాన్, సౌత్ సూడాన్, మారిషస్, ఘనా, మయన్మార్ దేశాలకు చెందిన 16మంది గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, మహిళా సంక్షేమ శాఖల అధికారులు గ్రామాన్ని సందర్శించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మునుకుంట్ల బాలచంద్రం, పంచాయతీ కార్యదర్శి అనిల్‌కుమార్, వీఆర్వో శ్రీకాంత్, వార్డు సభ్యులతో సమావేశమయ్యారు.
గామ పంచాయతీ పాలన, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక, వారి విధులను అడిగి తెలుసుకొన్నారు. అలాగే గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధులు, సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. కులవృత్తుల అధ్యయనంలో భాగంగా చేనేత, గీత, మత్స్య, కుమ్మ రి వృత్తులను పరిశీలించారు. వారితో ముచ్చటించారు. కల్లు గీసే విధానం, మగ్గాలు, స్థానిక చెరువులో చేపల పెంపకాన్ని పరిశీలించారు. గ్రామ కూడలిలో స్థానికులతో కలిసి విదేశీయులు బతుకమ్మ ఆడి పాడి సందడి చేశారు. ఈత కల్లు రుచి చూశారు. అనంతరం గ్రామంలో అధ్యయనం చేసిన సామాజిక, ఆర్థిక అంశాలపై సోషల్ మ్యాప్‌ను గీశారు.
ముక్తాపూర్ గ్రామ పర్యటన ఎంతో ఆకట్టుకొందని, ఇక్కడి ప్రజలు చూపిన ఆదరాభిమానాలు మరువలేనివని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఐఆర్డీ కోర్సు డైరక్టర్ డాక్టర్ టి.విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్ఐఆర్డీలో ‘సముదాయక భాగస్వామ్యంతో అభివృద్ధి’ అనే అంశంపై ఆరు వారాల అంతర్జాతీయ శిక్షణ తరగతులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అందు లో భాగంగానే క్షేత పర్యటన నిమిత్తం ముక్తాపూర్‌ను సందర్శించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు ప్రవీణ, అనిత, శోభ, ఉపసర్పంచ్ కళమ్మ, వార్డు సభ్యులు బండారు ప్రకాష్‌రెడ్డి, ఇటమోని లక్ష్మయ్య, కొండమడుగు రామేశ్వర్, కె. మహేష్, జి.ధనమ్మ, గొలనుకొండ కిష్టమ్మ తదితరులు పాల్గొన్నారు.