అలనాటి ఆలయానికి సొబగులు
- రేపు లక్ష్మీనారసింహుడి కల్యాణోత్సవం
- హాజరు కానున్న సినీ ప్రముఖులు
అమడగూరు : అమడగూరు మండలానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక ప్రాంతం బిళ్లూరులో నూతనంగా నిర్మితమైన స్తంభ నరసింహాలయం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. బిళ్లూరు ఎస్సీ కాలనీ సమీపంలో గుట్టమీద సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈశ్వరుడు, ఆంజనేయస్వామి భారీ విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. సేద తీరేందుకు పచ్చిక బయళ్లు, కుర్చోవడానికి ఆసనాలు, రేకుల షెడ్లు ఏర్పాటు చేశారు. ఆలయం లోపల శిల్పాలు, శిలా విగ్రహాలు, పైన గుడి గోపురాలు, ఆలయ ప్రధాన ద్వారం చూడచక్కగా ఉన్నాయి. ఈ ఆలయంలో 9వ తేదీ మంగళవారం లక్ష్మీనరసింహాస్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గరికపాటి నరసింహారావు గారు ఏకాంతసేవ, తనికెళ్ల భరణి ప్రత్యేక పూజలు చేయించనున్నారు. కార్యక్రమానికి గౌరవాధ్యక్షుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హాజరు కానున్నారు.
చోళరాజుల కాలం నాటి ఆలయం
సుమారు 1300 సంవత్సరాల క్రితం చోళరాజుల కాలంలోనే ఈ గుడి ఉండేదని, 500 సంవత్సరాల క్రితం ఆలయాన్ని శ్రీకష్ణ దేవరాయలు దానిని పునర్నిర్మించారని ఆలయ ధర్మకర్త దంపతులు కోడూరు రామ్మూర్తి, రాధ తెలిపారు. ఇప్పుడు వంశపారంపర్యంగా తమ చేతుల్లో మరోసారి రూపుదిద్దుకుంటోందన్నారు. ఆదివారం వారు ‘సాక్షి’తో మాట్లాడారు. తాము 25 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటున్నప్పటికీ తమవాళ్లంతా బిళ్లూరులోనే ఉన్నారన్నారు. సొంత గ్రామానికి ఏదోకటి చేయాలనే తపనే ఆలయాన్ని అభివృద్ధి చేసే దిశగా నడిపించిందన్నారు. ఈ ఆలయంలో ప్రతి ఏటా మాఘమాసంలో విశేషపూజలు, శ్రావణమాసంలో వార్షికోత్సవ పూజలు వరుసగా పది రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. 9 వ తేదీన కల్యాణోత్సవంలో భాగంగా సుప్రభాతసేవ, అభిషేకం, విశేష అలంకరణ, వేద పారాయణం లాంటివి చేయిస్తున్నామని, ప్రముఖులు కూడా హాజరవుతున్నారని చెప్పారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కల్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.