stirke
-
ఫేస్బుక్లో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి
సాక్షి, నవాబుపేట(మహబూబ్‌నగర్): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్రీనగర్‌కాలనీకి చెందిన యువతి(24), మండలంలోని ఇప్పటూర్ పంచాయతీ చౌటపల్లికి చెందిన తిలక్‌గౌడ్(25)తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడి మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. ప్రస్తుతం తిలక్‌గౌడ్ వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపించింది. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు నిరసన చేపట్టానంది. ఈ విషయమై బాధితురాలు నవాబుపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తే హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు పంపారని వివరించింది. చదవండి: రెండు పెళ్లిళ్లు.. మరొక వ్యక్తితో సహజీవనం..చివరకు -
చర్చలు సఫలం : 16 శాతం మధ్యంతర భృతి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్టీసీ ఉద్యోగులకు మధ్య వివాదం, సస్పెన్స్‌కు తెరపడింది. ఆర్టీసీ కార్మికులకు 16 శాతం మధ్యంతర భృతి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించినట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మంత్రి ఈటెల రాజేందర్ మీడియా సమవేశంలో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని కితాబిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కార్మికులు అన్యాయానికి గురయ్యారని వెల్లడించారు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు 25 శాతం మధ్యంతర భృతి అడిగారని, ఆర్టీసీ వందల కోట్ల నష్టాల్లో ఉన్నప్పటికీ 16 శాతం ఐఆర్ ప్రకటించినట్లు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని వ్యాఖ్యానించారు. సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, అసంఘటిత కార్మిక సంఘాలవైపే సీఎం దృష్టి సారించారని అన్నారు. ఈ వ్యవహారంలో మంత్రి హరీష్ రావు అటు కార్మిక సంఘం నాయకుడిగా, ఇటు మంత్రిగా ద్విపాత్రాభినయం చేశారని కొనియాడారు. అనంతరం మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పెరిగిన 16 శాతం ఐఆర్‌తో నెలకు 16కోట్లు, ఏడాదికి 200 కోట్ల రూపాయల వరకూ భారం పెరిగిందని అన్నారు. అయినా కూడా ఉద్యోగుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఇప్పటికే ఆర్టీసీ చాలా నష్టాల్లో ఉందని, లాభాల బాట పట్టించడానికి అనేక విధాలుగా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. ఉద్యమంలో నుంచి పుట్టిన సంస్థ టీఎంయూ అని, ఆర్టీసీ సంస్థ బలోపేతం చేశాక ఫిట్మెంట్ కూడా ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ నష్టాలపై హైలెవల్ కమిటీ వేస్తామని, తాత్కాలికంగా ఐఆర్ ప్రకటిస్తున్నామని, జులై నుంచి ప్రకటించిన ఐఆర్‌ను ఇస్తామని మంత్రి ప్రకటించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ రాయితీలన్నీ కల్పిస్తామని అన్నారు. వయసు మీరిన కార్మికుల ఉద్యోగాన్ని వాళ్ల పిల్లలకు కూడా అర్హతలను బట్టి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సకల జనుల సమ్మె సమయంలో జీతాన్ని కూడా కార్మికులకు తక్షణమే అందచేసే ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. అనంతరం టీఎంయూ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ తాము కోరిన 16శాతం ఐఆర్ ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ప్రకటించిందని, భవిష్యత్తులో తాము కోరిన ఫిట్‌మెంట్‌కు సీఎం సానుకూలంగా ఉన్నారని తెలిపారు. చిన్న చిన్న విషయాలకు కండక్టర్లు, డ్రైవర్లపై సస్పెన్షన్ వేటు ఉండదని అన్నారు. ఇప్పటి నుంచే సమ్మె నోటీసుని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించారు. సంబంధిత కథనం ఇక్కడ చదవండి : ముగిసిన చర్చలు.. కొనసాగుతున్న సస్పెన్స్ -
ఏడో రోజుకు లారీల సమ్మె
సాక్షి, హైదరాబాద్: పలు డిమాండ్లతో లారీ యజమానుల సంఘాలు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి ఏడో రోజుకు చేరుకుంది. రాష్ట్రంతోపాటు దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. పలు అత్యవసర సరుకుల రవాణా మాత్రమే జరుగుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వనస్థలిపురం, మూసాపేట, ఔటర్‌రింగ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో లారీలను ఆపేశారు. ఇటీవల ఐఆర్‌డీఏతో జరిపిన చర్చలు కూడా విఫలమైన నేపథ్యంలో సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు తెలంగాణ లారీ యజమానుల సంఘం, దక్షిణాది లారీ యజమానుల సంఘం కార్యాచరణకు సన్నద్ధమవుతున్నాయి. ఈ మేరకు జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. అఖిల భారత మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా సమ్మెను విస్తృతం చేసేందుకు అన్ని రాష్ట్రాల లారీ యాజమాన్య సంఘాలు సన్నద్ధమైనట్లు వెల్లడించారు. గురువారం (6వ తేదీ) నుంచే అత్యవసరాలైన పాలు, కూరగాయలు, మందులు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ వంటివాటి సరఫరాను నిలిపివేయాలని భావించినా.. పెట్రోలియం లారీ సంఘాలతో సంప్రదింపులు జరుగుతున్న దృష్ట్యా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. థర్డ్ పార్టీ బీమా ప్రీమియమే ప్రధానం! లారీలకు థర్డ్ పార్టీ బీమా ప్రీమియం పెంపును నిలిపివేయాలనే ప్రధానమైన డిమాండ్‌తో దేశవ్యాప్తంగా లారీల సమ్మెను చేపట్టారు. దాంతో పాటు తెలుగు రాష్ట్రాలకు వర్తించే విధంగా సింగిల్ పర్మిట్లను ఇవ్వాలని, టోల్‌ట్యాక్స్‌ల భారాన్ని తొలగించాలని లారీ సంఘాలు కోరుతున్నాయి. 41 శాతం పెంచిన థర్డ్ పార్టీ ప్రీమియాన్ని తగ్గించడంపై రెండు రోజుల కింద ఐఆర్డీఏ చైర్మన్ విజయన్‌తో బషీర్‌బాగ్ పరిశ్రమల భవన్లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఈ పెంపును నిలిపివేయడం సాధ్యం కాదని, దీనిపై చర్చించేందుకు లారీ సంఘాలతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని విజయన్ పేర్కొన్నారు. కానీ బీమా ప్రీమియం పెంపును నిలిపివేస్తే తప్ప తాము కమిటీకి ప్రాతినిధ్యం వహించబోమంటూ లారీ సంఘాలు చర్చల నుంచి బయటకు వచ్చాయి. స్తంభించిన నిత్యావసరాల సరఫరా హైదరాబాద్‌కు నిత్యావసరాలను సరఫరా చేసేసుమారు 5,000 లారీలు సమ్మె కారణంగా నిలిచిపోయాయి. బియ్యం, పప్పులు, ఉల్లి, సిమెంట్, స్టీల్, బొగ్గు, ఇసుక తదితరాల రవాణా పూర్తిగా స్తంభించింది. స్థానికంగా డీసీఎం వ్యాన్ల ద్వారా కొన్ని రకాల వస్తువులను సరఫరా చేస్తున్నారు. కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సరుకు రవాణా నిలిచిపోవడంతో బియ్యం, పప్పులు వంటి నిత్యావసరాల ధరలు 15 శాతం వరకు పెరిగాయి.