నిల్వవుంటే దిగులే..
ఖమ్మం వ్యవసాయం: నాణ్యతా ప్రమాణాల పేరుతో జిల్లాలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాల్లో సరుకు ధర తగ్గించే దిశగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అడుగులు వేస్తోంది. పత్తి పంట చివరి దశలో ఉంది. ప్రస్తుతం వస్తున్న పంటలో పింజ పొడవు తక్కువగా ఉంటుందని సీసీఐ భావిస్తోంది. మధ్య రకం ధరతో కొనుగోలు చేయాలని యోచిస్తోంది. జిల్లాలో ఖమ్మం, ఏన్కూరు, కొత్తగూడెం, భద్రాచలం, చండ్రుగొండ, నేలకొండపల్లి, బూర్గంపాడు, మధిర వ్యవసాయ మార్కెట్లలో సీసీఐ కేంద్రాలు నిర్వహిస్తున్నారు.
వీటితో పాటు నాలుగు జిన్నింగ్మిల్లుల్లో కూడా పత్తి కొనుగోళ్లు చేస్తున్నారు. వీటి ద్వారా ఇప్పటి వరకు దాదాపు 15.50 లక్షల క్వింటాళ్ల సరుకు కొనుగోలు చేశారు. 2014-15 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పింజ పొడవు ఆధారంగా ధరలు నిర్ణయించింది. దీనిలో తేమ శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. పొడవు పింజ రకానికి (29.5 మి.మీ- 30.5 మి.మీ) క్వింటాలుకు గరిష్టంగా రూ.4,050 వరకు, మధ్య రకం పింజ పొడవు (27.5 మి.మీ-29,0 మి.మీ) క్వింటాలుకు గరిష్టంగా రూ.3,750 వరకు ధర నిర్ణయించారు. ఇప్పటి వరకు పొడవు పింజ రకానికి నిర్ణయించిన ధరతో పంట ఉత్పత్తిని కొనుగోలు చేశారు. ఈ రకం సరకును తేమ శాతాన్ని కూడా పరిశీలించి కొనుగోలు చేశారు.
చివరి దశ పత్తి అమ్మకానికి వస్తుందని, ఆ పత్తి నాణ్యతగా లేదని, పింజ పొడవు తక్కువగా ఉందని జిల్లాలోని పలు సీసీఐ కేంద్రాల నిర్వహకులు ఆ సంస్థ ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ కారణంతో ఇప్పటికే ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నిర్వహిస్తున్న పత్తి కొనుగోలు కేంద్రాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.
నేలకొండపల్లి కొనుగోలు కేంద్రంలో కూడా పత్తి కొనుగోళ్లను ఆపే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. మిగిలిన కేంద్రాల్లో కూడా రెండు, మూడు రోజుల్లో పత్తి కొనుగోళ్లను నిలిపి వేసి, పింజ రకానికి ఇచ్చే ధరతో తిరిగి కొనుగోళ్లు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. వచ్చే వారం నుంచి దీన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రైతుల్లో ఆందోళన
పింజ పొడవు ఆధారంగా సీసీఐ పత్తి కొనుగోళ్లకు రంగం సిద్ధం చేస్తుండటంతో గ్రామాల్లో పత్తి నిల్వ చేసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా రైతుల వద్ద సరుకు అమ్మకాలు పూర్తయిన దశలో ఆ పంట ఉత్పత్తికి డిమాండ్ పెరుగుతుంది. ఈ ఉద్దేశ్యంతో కొందరు రైతులు తాము పండించిన పత్తిని నిల్వ ఉంచుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆ పరిస్థితులు రాలేదు. సీసీఐ నిర్ణయించిన ధర కన్నా పత్తి ధర ఏమాత్రం పెరగ లేదు.
సీసీఐ ధర కన్నా ప్రైవేటు మార్కెట్ ధర రూ.400 వరకు తక్కువగా ఉంది. ఖమ్మం మార్కెట్లో సీసీఐ కేంద్రం తాత్కాలికంగా నిలిపి వేయటంతో ప్రైవేటు మార్కెట్లో వ్యాపారులు కూడా ధర మరికొంత తగ్గించారు. పింజ పొడవు ఆధారంగా సీసీఐ కూడా ధర తగ్గిస్తుందని తెలిసి వ్యాపారులు ధరను మరింత తగ్గించాలని భావిస్తున్నారు. సీసీఐ మధ్య రకం పింజ ధర నిర్ణయిస్తే సరుకు నిల్వ చేసుకున్న రైతులు భారీగా ధర నష్టపోయే ప్రమాదం ఉంది. పొడవు పింజ రకం ధరతోనే పత్తిని కొనుగోలు చేయాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.