పోలీసాయన అరుదైన పెళ్లి కానుక
ఢిల్లీ: పోలీసులంటే సామాన్య జనంలో ఉన్న అభిప్రాయాన్ని తిరగరాశాడు ఢిల్లీలోని ఓ పోలీస్ అధికారి. త్వరలో పెళ్లిచేసుకోబోతున్న యువతికి అరుదైన పెళ్లి కానుకను అందించాడు. భారీ విలువైన నగలు , నగదుతో సహా పోయిందనుకున్న బ్యాగును తిరిగి ఆ కుటుంబానికి అందిజేశాడు. సుమారు 8 లక్షల రూపాయల కానుకను వారికి చేరవేశాడు. దీంతో నిజాయితీకి మారుపేరుగా నిలిచి, అటు ఉన్నతాధికారులు ఇటు ప్రజల ప్రశంసలందుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. మంగళవారం సాయంత్రం తన విధుల్లో భాగంగా ఎస్ఐ మంగేజ్ సింగ్ (58) పెట్రోలింగ్కి వెళ్లాడు. అజ్మీర్ గేటు దగ్గర అనుమానాస్పద స్థితిలో ఒక బ్యాగు కనిపించింది. అసలే నగరంలో రెడ్ అలర్డ్ అమల్లో ఉండడంతో ఆ సంచిని క్షుణ్ణంగా పరిశీలించాడు. అనంతరం షాక్ అవ్వడం అతని వంతైంది. విలువై వజ్రాల ఆభరణాలు, నగదు దర్శనమిచ్చాయి. రూ .8 లక్షలు విలువైన ఈ బ్యాగ్ సెంట్రల్ ఢిల్లీలోని కమలా మార్కెట్ లో వస్త్ర దుకాణం యజమానికి చెందినదిగా గుర్తించారు. అనంతరం బ్యాగును అసలు యజమానికి అప్పగించి తననిజాయితీని చాటుకున్నారు. అలా కాబోయే పెళ్లి కూతురికి అరుదైన పెళ్లి కానుకను అందించడంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. ఎస్ఐ మంగేజ్ సింగ్ ను అభినందనల్లో ముంచెత్తారు.
ఢిల్లీకి చెందిన వస్త్ర వ్యాపారి త్వరలో జరగబోయే కుమార్తె వివాహం కోసం వజ్రాల ఆభరణాలు కొనుగోలు చేశాడు. తిరిగి వస్తుండగా కొంతమంది దుండగులు, సదరు వ్యాపారి దృష్టి మళ్లించి బ్యాగు ఎత్తుకెళ్లారు. దాంట్లో ఉన్న మూడున్నర లక్షల నగదును తీసుకొని అనంతరం ఆ బ్యాగును పక్కన పడేసి వెళ్లాపోయారు. కానీ బ్యాగులో వేరే వేరే అరల్లో ఉన్న నగలు, డబ్బులను గమనించలేదు. ఆ బ్యాగే ఎస్ఐ మంగేజ్ సింగ్ కంటబడి, చివరికి అసలు యజమానికి చెంతకు చేరింది.
కాగా ఈ విషయాన్ని సెంట్రల్ డీసీపి పరమాదిత్య ధృవీకరించారు. ఎస్ఐ మంగేజ్ సింగ్ కు అవార్డుతో సత్కరించనున్నామని తెలిపారు.