stones rain
-
రాళ్ల వర్షం కురిసిందట.. ఆ ఊరిలో పొలాల నిండా రాళ్లే
వైఎస్సార్ జిల్లా (జమ్మలమడుగు): జమ్మలమడుగు పట్టణానికి తూర్పు దిశగా ఐదు కిలోమీటర్ల దూరంగా ఉన్న చిన్న గ్రామమైన రాళ్లగుళ్లకుంట ప్రత్యేకత చాటుకుంది. కేవలం గ్రామానికి కిలోమీటరు చుట్టూ మాత్రమే పొలాల నిండా రాళ్లుతో నిండిపోయి ఉంటుంది. ఈ రాళ్లలోనే రైతులు భూమిని దున్ని పంటలను సాగుచేస్తున్నారు. కేవలం గ్రామానికి కిలోమీటరు చుట్టూ రాళ్లు ఉండటం ఈ గ్రామానికి ప్రత్యేకత తీసుకుని వచ్చింది. గ్రామానికి చుట్టూ కిలోమీటరు దూరం వరకు ఉన్న పొలాల్లో రాళ్లు మాత్రమే కనిపిస్తాయి తప్ప భూమి ఎక్కడ కనిపించదు. కిలోమీటరు దాటిన తర్వాత పూర్తిగా నల్లరేగటి భూమిలే. రాళ్లు ఎక్కువగా ఉండటంతో ఈ గ్రామానికి రాళ్ల గుల్లకుంటగా గుర్తింపు తీసుకుని వచ్చింది. ఈ గ్రామానికి మరో పేరు శేషారెడ్డిపల్లె. రాళ్లవర్షం కురిసిందంటా... త్రేతా యుగంలో గ్రామం చుట్టూ పరిసరా ప్రాంతాలలో రాళ్ల వర్షం పడ్డాయని గ్రామస్థులు కథలు చెబుతున్నారు. భూమిలోరాళ్లు ఎక్కువ ఉండటంతో రైతులు మొదట్లో రాళ్లను తొలగించే ప్రయత్నం చేశారు. భూమిని దున్నుతున్న ప్రతి సారి భూమిలో నుంచి రాళ్లు ఎక్కువగా వస్తుండటంతో శ్రమంతా నిరుపయోగం అవుతుండటంతో రాళ్లును తొలగించే ప్రయత్నం మానుకున్నారు. అయితే ఈ రాళ్లు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. గ్రామంలో చుట్టూప్రక్కల భూములన్ని వర్షాధార ఆధారంగా పంటలను సాగుచేస్తున్నారు. అయితే వర్షాలు తక్కువగా పడిన సమయంలో భూమిలో రాళ్లు ఉండటంతో ఆ రాళ్ల చల్లదనానికి పంటలు ఎండకుండ కాస్త దిగుబడి ఎక్కువగా వస్తుందని రైతులు చెబుతున్నారు. -
హడలెత్తించిన రాళ్లవాన
సాక్షి నెట్వర్క్: ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో శుక్రవారం రాత్రి రాళ్లవాన హడ లెత్తించింది. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో వృక్షాలు, స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. భీకర గాలులకు పలు ఇళ్ల రేకులు కొట్టుకుపోయాయి. హోర్డింగ్‌లు ఊడిపడటంతో పలువురు గాయపడ్డారు. వృక్షాలు కూలడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. మొక్కజొన్న, కందులు, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాల వద్ద ఆరబెట్టిన పసుపు తడిసిపోయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. జగిత్యాల జిల్లాలోని మల్యాల, పెగడపల్లి, గొల్లపల్లి మండలాల్లో మొక్కజొన్న, పసుపు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జగిత్యాల మార్కెట్‌యార్డులో అమ్మకానికి తీసుకొచ్చిన కందులతోపాటు వ్యాపారులకు చెందిన వరిధాన్యం బస్తాలు తడిసిపోయాయి. మెట్పల్లి డివిజన్లో మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మండలాల్లో చేతికి వచ్చిన జొన్న, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నువ్వుల పంటకు తీవ్ర నష్టం జరిగింది. మెట్పల్లి బస్టాండ్ వద్ద భవనంపై ఉన్న భారీ హోర్డింగ్ ఊడి పడటంతో పలువురు గాయపడ్డారు. మార్కెట్‌యార్డులో నిల్వ ఉంచిన సుమారు వెయ్యి క్వింటాళ్ల పసుపు, 200 క్వింటాళ్ల కందులు తడిసిపోయాయని అధికారులు తెలిపారు. కొండాపూర్‌లో మర్రిచెట్టు విరిగి పడటంతో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. గాలికి పలు గృహాల రేకులు కొట్టుకుపోయాయి. ఇబ్రహీంపట్నం మండలంలో కల్లాల వద్ద ఆరబెట్టిన పసుపు తడిసింది. అమ్మక్కపేట నుంచి డబ్బా దారిలో తాటిచెట్టు విరిగి పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాళ్ల వానతో మామిడి పూత, పిందె రాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలితో కూడిన వాన రావడంతో జనాలు ఇబ్బంది పడ్డారు. అలాగే.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మెండోరా, ముప్కాల్, బాల్కొండ మండలాల్లో వర్షం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జల మయమయ్యాయి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌యార్డులో సుమారు 10 వేల క్వింటాళ్ల పసుపు తడిసింది. -
వైఎస్సార్ సీపీ మద్దతుదారులపై దాడి
పూలకుంట(గుమ్మఘట్ట) : మండలంలోని పూలకుంటలో టీడీపీ వర్గీయులు వైఎస్సార్ సీపీ మద్దతుదారులపై ఆదివారం రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన ఉపాధి క్షేత్రసహాయకుడు గంగప్ప, గౌనికుంట ప్రభుత్వ చౌక దుఖాణపు డీలర్ రాధాస్వామి తీవ్రంగా గాయపడ్డారు. జన్మభూమి కమిటీ సభ్యు డు నాగరాజు, మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. వివరాల్లోకెళితే.. గ్రామం లో చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై తనిఖీలు నిర్వహించిన అనంతరం సామాజిక బృందం సభ్యులు గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభకు డీఆర్పీ, గ్రామ సర్పంచ్ ముసలిరెడ్డి, ఏపీఓ వెంకటేశ్‌నాయక్, క్షేత్రసహాయకుడు గంగప్ప హాజరయ్యారు. గ్రామ సభకు ఏర్పాట్లు చేస్తుండగానే టీడీపీ నేతలు కొందరు వచ్చి అడ్డుతగిలారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న క్షేత్ర సహాయకుడు గంగప్పను ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. దీంతో ఏపీఓ కలుగజేసుకుని తొలగించినా కోర్టు నుంచి స్టే ఉత్తర్వులు తీసుకురావడంతో మళ్లీ కొనసాగించాల్సి వచ్చిందని చెప్పారు. అయినా వినకుండా అతని స్థానంలో గంగధర్నే కొనసాగించాలని పట్టు పట్టారు. అలా అయితే సభ నిర్వహించండి.. లేదంటే వెనక్కి వెళ్లిపోం డంటూ అధికారులపై మండిపడ్డారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు.. కేవలం రాజకీయ కక్షతోనే తొలగించారని క్షేత్ర సహాయకుడు సమాధానం చెప్పడంతో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. వైఎస్సార్ సీపీ మద్దతుదారుడు, క్షేత్రసహాయకుడు గంగప్పపై టీడీపీ వర్గీయులు, తొలగించిన క్షేత్రసహాయకుడు గంగాధర్, బొమ్మన్న, జన్మభూమి కమిటీ సభ్యుడు నాగరాజు, సొంటు నింగప్ప, లక్ష్మిదేవి, నాగరాజు దాడికి తెగబడ్డారు. విషయం తెలుసుకున్న గంగప్ప సోదరుడు, డీలర్ రాధాస్వామి అడ్డు వెళ్లడంతో అతడిని కూడా తీవ్రంగా గాయపరిచారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో టీడీపీ వర్గీయులైన నాగరాజు మరో వ్యక్తి స్వల్పంగా గాయాలయ్యాయి. ఇరు వర్గాల వారు చికిత్స కోసం రాయదుర్గం ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ సురేష్ తెలిపారు.