storm Hudood
-
తుపాను వస్తే అంతే సంగతులు
నెల్లూరు(పొగతోట) జిల్లాలో తుపాన్ల సీజన్ ప్రారంభమైంది. ఇటీవల హుదూద్ తుపాను ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టించి చేదు జ్ఞాపకాలు మిగిల్చిన సంగతి తెలిసిందే. ఎన్నిముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా ప్రాణ, ఆస్తినష్టాలు తప్పలేదు. ఈ క్రమంలో తరచూ తుపాన్ల బారిన పడే జిల్లా వాసుల్లోనూ ఆందోళన మొదలైంది. సాధారణంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో దక్షిణ కోస్తాపై తుపాన్ల ప్రభావం ఉంటుంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో సెప్టెంబర్, అక్టోబర్లో కురిసే వర్షాలతో చెరువుల్లో నీరు చేరుతుంది. అనంతరం తుపాన్లు వస్తే చెరువులకు గండ్లు పడటంతో పాటు రహదారులు దెబ్బతింటున్నాయి. తరచూ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా నష్టనివారణ చర్యలు చేపట్టడంలో జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలోని తీరప్రాంతంలో 11 మండలాలు ఉన్నాయి. మరో ఐదు మండలాలు లోతట్టు ప్రాంతాల జాబితాలో ఉన్నాయి. కావలి నుంచి తడ మండలం వరకు తీరం పొడవునా 177 తుపాను షెల్టర్లు నిర్మించారు. వీటిలో అధిక శాతం షెల్టర్లు శిథిలమై అధ్వానస్థితిలో ఉన్నాయి. తుపాన్లు సంభవించిన సమయంలో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఆ సమయంలో ముంపుబారిన పడిన వారిని తరలించేందుకు షెల్టర్లు అనుకూలంగా లేవు. ముందస్తు చర్యల్లో నిర్లక్ష్యం తుపాన్లను సమర్ధంగా ఎదుర్కొని సహాయచర్యలు చేపట్టేందుకు జిల్లా అధికారుల కమిటీలు ఉన్నాయి. ప్రతి ఆరు నెలలకోసారి ఈ కమిటీలు కలెక్టర్ అధ్యక్షతన సమావేశమై ముందస్తు చర్యలపై చర్చించాలి. అయితే ఇటీవల కాలంలో సమావేశాల నిర్వహణ సక్రమంగా సాగడం లేదు. ప్రకృతి విపత్తులు సంభవిస్తే ప్రజలను ఆదుకునేందుకు అవసరమైన సామగ్రి అందుబాటులో లేదు. పరికరాల కొనుగోలుకు నిధులు విడుదల చేసి రెండేళ్లవుతోంది. ఏదేని ఉపద్రవం సంభవించాక హడావుడి చేస్తున్న ప్రభుత్వం ముందస్తుగా ఎలాంటి నిధులు విడుదల చేయడం లేదు. రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టడానికి అవసరమైన పరికరాలు అగ్నిమాపక శాఖ వద్ద మాత్రమే ఉన్నాయి. సహాయక చర్యలకు అవసరమైన సామగ్రి ఆర్డీఓ కార్యాలయాల్లో ఉన్నాయని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. హుదూద్ నేర్పిన పాఠంతోనైనా ముందస్తు జాగ్రత్తలపై అధికారులు దృష్టిపెట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు. సహాయక చర్యలకుసిద్ధంగా ఉన్నాం: తుపాన్లు సంభవిస్తే సహాయక చర్యలు చేపట్టడానికి జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. సామగ్రి కొనుగోలుకు నిధు లు లేవు. అవసరమైన సమయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. తుపాన్లను ఎదుర్కోవడంపై వచ్చే వారంలో అధికారులతో సమావేశం నిర్వహిస్తాం. -నాగేశ్వరరావు, డీఆర్వో -
ఐదుగురు సజీవ సమాధి
కొండచరియలు విరిగిపడి మృత్యువాత మెదర్సోలాలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి విషాదం అరకురూరల్: హుదూద్ తుఫాన్ ఐదుగురిని మింగేసింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో వీరు సజీవ సమాధి అయ్యారు. అరకులోయ పంచాయతీ మెదర్సోలా గ్రామంలో ఆది వారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఉదయం నుంచి కురుస్తున్న తు ఫాన్ వర్షాలకు హఠాత్తుగా కొండచరిలు విరి గిపడడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. తుఫాన్ బీభత్సం నుంచి రక్షించాలంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్న సమయంలోనే ఈ ఘటన జరగడం విషాదంలో విషాదం. వివరాల్లోకి వెళితే... గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది ఐదు గృహాల్లో నివసిస్తున్నారు. తుఫాన్ వర్షాలనుంచి రక్షించాలని మొక్కుకునేందుకు సిద్ధమయ్యారు. వీరి పూజల్లో పాల్గొనేందుకు సమీపంలో ఉన్న గిమ్మెలపుట్టి, అసో దంపతులు కూడా వచ్చారు. వీరంతా మేకపోతు బలి ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో కొండచరియలు విరిగి పడడంతో ఇళ్లలో ఉన్న వారిలో ఐదుగురు సజీవ సమాధికాగా మిగిలిన 13 మంది బతికి బయటపడ్డా రు. గెమ్మెలి భీమన్న, అప్పన్నలు ఓ స్తంభాన్ని పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. మృతులను గెమ్మెలి పొట్టి (70), అసో (65), సోభన్న (25), సందో (30), సుబ్బారావు (9) గుర్తించారు. ఘటన ఆలస్యంగా వెలుగు చూడడంతో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కిల్లో సురేంద్ర, సీపీఎం మండల క్యాదర్శి పొద్దు బాలదేవ్ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీయించారు. కొన్ని పశువులు, మేకలు కూడా ప్రళయంలో కొట్టుకుపోయాయని వారు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం చెల్లిం చాలని సురేంద్రతోపాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ డిమాండ్ చేశారు. మృత దేహాల వెలికితీతలో అధికారులు తాత్సారం చేశారని, కనీసం ఆదుకునే విషయంలోనైనా స్పందించాలని కోరారు. ప్రమాదం అంచున పీటీజీ గ్రామాలు మాదల పంచాయతీ రత్తకండి, దోమలజోడి, పాల్మన్వలస, చిట్టంగొంది, తుంగగడ్డ గ్రామాల్లోని గిరిజనులు ప్రమాదం అంచున బితుకుబితుకుమంటూ కాలం గడుపుతున్నారు. ఆదివారం జరిగిన ఘటనలో మిగిలిన వారు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ ఘటన జరుగుతుందో, ఎవరి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో అని పీటీజీలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తమకు మోడల్ కాలనీలు నిర్మించాలని పీటీజీలు కోరుతున్నారు. కాగా, విశాఖ-అరకు ఘాట్లో వరద ఉద్ధృతికి పలుచోట్ల కల్వర్టులు, రక్షణ గోడలు ధ్వంసమయ్యాయి. ఘాట్లో విరిగిపడిన చెట్లను తొలగించడంలో కూడా అధికారులు విఫలమయ్యారు. -
హుదూద్పై అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన హుదూద్ తుపాను ప్రభావంతో రాష్ట్రం నష్టపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తూర్పు తీర సముద్రతీర గస్తీదళాల అధిపతి ఎస్పీ.శర్మ తెలిపారు. అన్ని సహాయక చర్యల్లోనూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు ఆయన శనివారం చెప్పారు. చెన్నై, సాక్షి ప్రతినిధి : భారత సముద్ర తూర్పుతీర గస్తీ దళాల కోసం ఏర్కుషన్వేగిల్ హెచ్-197 అనే అత్యాధునిక గస్తీ నౌకను ప్రభుత్వం కేటాయించింది. ఈ నౌకను జాతికి అంకింతం చేసే కార్యక్రమం చెన్నైలోని గస్తీదళాల కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్కే కవుల్ ప్రత్యేక అతిథిగా పాల్గొని గస్తీ నౌకను జాతికి అంకింతం చేశారు. ప్రధాన న్యాయమూర్తి కవుల్ మాట్లాడుతూ హుదూద్ తుపాను ప్రభావం రాష్ట్రంపై పడకుండా సముద్రతీర ప్రాంతాల్లో అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా మత్స్యకారులను చేపల వేటకు అనుమతించరాదని, వారి మరపడవలు, ఇతర ఆస్తులు కొట్టుకుపోకుండా చూడాలని కోరారు. పజల ప్రాణాలు, ఆస్తులు కాపాడటంలో గస్తీ దళాలు అంకితం కావాలని ఉద్బోధించారు. ఆనంతరం ఎస్పీ.శర్మ మాట్లాడుతూ తమిళనాడు సముద్రతీరంలో తీవ్రవాదుల చొరబాటు, సముద్రపు దొంగలను అరికట్టడం సవాలుగా మారిందన్నారు. గత ఏడాది కాలంలో హద్దుమీరి భారత్ సరిహద్దులోకి ప్రవేశించిన 260 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.4.80 కోట్లకుపైగా విలువైన 45వేల కిలోల చేపలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. సముద్రతీరాలను కాపుకాయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని చెప్పారు. ఆదివారం తీరందాటనున్న హుదూద్ తుపానుపై అధికారులను అప్రమత్తం చేస్తూ అన్ని చర్యలుచేపట్టామని చెప్పారు. మత్స్యకారులను చేపల వేటకు అనుమతించలేదని, ఇప్పటికే చేపలవేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకుని ఉన్న మత్స్య కారులను సైతం రక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రైళ్ల దారిమళ్లింపు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం వద్ద ఆదివారం ఉదయం తుపాను తీరం దాట నున్న దృష్ట్యా చెన్నై సెంట్రల్ నుంచి శనివారం బయలుదేరిన 8 రైళ్లను, తమిళనాడు మీదుగా ఆంధ్రవైపు ప్రయాణించే తిరువనంతపురం రైలును దారిమళ్లించారు. ఆలంపూర్-ధన్బాద్ ఎక్స్ప్రెస్, విళుపురం-పురువిలా వారాంతర ఎక్స్ప్రెస్ రైలు, చెన్నై-హౌరా మెయిల్, చెన్నై-ఆసన్సోల్ వారాంతర ఎక్స్ప్రెస్, చెన్నై-హౌరా వారాంతర ప్రిమియం ప్రత్యేక రైలు, చెన్నై-చంద్రికాశి, చెన్నై-హౌరా కోరమండల్ ఎక్స్ప్రెస్, తిరువనంతపురం నుంచి శనివారం బయలుదేరాల్సిన షాలిమార్ ఎక్స్ప్రెస్, కన్యాకుమారి-హౌరా ఎక్స్ప్రెస్ రైళ్లను దారిమళ్లించారు.