హుదూద్‌పై అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన హుదూద్ తుపాను ప్రభావంతో రాష్ట్రం నష్టపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తూర్పు తీర సముద్రతీర గస్తీదళాల అధిపతి ఎస్‌పీ.శర్మ తెలిపారు. అన్ని సహాయక చర్యల్లోనూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు ఆయన శనివారం చెప్పారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి : భారత సముద్ర తూర్పుతీర గస్తీ దళాల కోసం ఏర్‌కుషన్‌వేగిల్ హెచ్-197 అనే అత్యాధునిక గస్తీ నౌకను ప్రభుత్వం కేటాయించింది. ఈ నౌకను జాతికి అంకింతం చేసే కార్యక్రమం చెన్నైలోని గస్తీదళాల కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌కే కవుల్ ప్రత్యేక అతిథిగా పాల్గొని గస్తీ నౌకను జాతికి అంకింతం చేశారు. ప్రధాన న్యాయమూర్తి కవుల్ మాట్లాడుతూ హుదూద్ తుపాను ప్రభావం రాష్ట్రంపై పడకుండా సముద్రతీర ప్రాంతాల్లో అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా మత్స్యకారులను చేపల వేటకు అనుమతించరాదని, వారి మరపడవలు, ఇతర ఆస్తులు కొట్టుకుపోకుండా చూడాలని కోరారు.
పజల ప్రాణాలు, ఆస్తులు కాపాడటంలో గస్తీ దళాలు అంకితం కావాలని ఉద్బోధించారు. ఆనంతరం ఎస్‌పీ.శర్మ మాట్లాడుతూ తమిళనాడు సముద్రతీరంలో తీవ్రవాదుల చొరబాటు, సముద్రపు దొంగలను అరికట్టడం సవాలుగా మారిందన్నారు. గత ఏడాది కాలంలో హద్దుమీరి భారత్ సరిహద్దులోకి ప్రవేశించిన 260 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.4.80 కోట్లకుపైగా విలువైన 45వేల కిలోల చేపలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. సముద్రతీరాలను కాపుకాయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని చెప్పారు. ఆదివారం తీరందాటనున్న హుదూద్ తుపానుపై అధికారులను అప్రమత్తం చేస్తూ అన్ని చర్యలుచేపట్టామని చెప్పారు. మత్స్యకారులను చేపల వేటకు అనుమతించలేదని, ఇప్పటికే చేపలవేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకుని ఉన్న మత్స్య కారులను సైతం రక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
రైళ్ల దారిమళ్లింపు
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం వద్ద ఆదివారం ఉదయం తుపాను తీరం దాట నున్న దృష్ట్యా చెన్నై సెంట్రల్ నుంచి శనివారం బయలుదేరిన 8 రైళ్లను, తమిళనాడు మీదుగా ఆంధ్రవైపు ప్రయాణించే తిరువనంతపురం రైలును దారిమళ్లించారు. ఆలంపూర్-ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్, విళుపురం-పురువిలా వారాంతర ఎక్స్‌ప్రెస్ రైలు, చెన్నై-హౌరా మెయిల్, చెన్నై-ఆసన్‌సోల్ వారాంతర ఎక్స్‌ప్రెస్, చెన్నై-హౌరా వారాంతర ప్రిమియం ప్రత్యేక రైలు, చెన్నై-చంద్రికాశి, చెన్నై-హౌరా కోరమండల్ ఎక్స్‌ప్రెస్, తిరువనంతపురం నుంచి శనివారం బయలుదేరాల్సిన షాలిమార్ ఎక్స్‌ప్రెస్, కన్యాకుమారి-హౌరా ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారిమళ్లించారు.