- కొండచరియలు విరిగిపడి మృత్యువాత
- మెదర్‌సోలాలో ఘటన
- ఆలస్యంగా వెలుగులోకి విషాదం
అరకురూరల్: హుదూద్ తుఫాన్ ఐదుగురిని మింగేసింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో వీరు సజీవ సమాధి అయ్యారు. అరకులోయ పంచాయతీ మెదర్‌సోలా గ్రామంలో ఆది వారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఉదయం నుంచి కురుస్తున్న తు ఫాన్ వర్షాలకు హఠాత్తుగా కొండచరిలు విరి గిపడడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు.
తుఫాన్ బీభత్సం నుంచి రక్షించాలంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్న సమయంలోనే ఈ ఘటన జరగడం విషాదంలో విషాదం. వివరాల్లోకి వెళితే... గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది ఐదు గృహాల్లో నివసిస్తున్నారు. తుఫాన్ వర్షాలనుంచి రక్షించాలని మొక్కుకునేందుకు సిద్ధమయ్యారు. వీరి పూజల్లో పాల్గొనేందుకు సమీపంలో ఉన్న గిమ్మెలపుట్టి, అసో దంపతులు కూడా వచ్చారు.
వీరంతా మేకపోతు బలి ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో కొండచరియలు విరిగి పడడంతో ఇళ్లలో ఉన్న వారిలో ఐదుగురు సజీవ సమాధికాగా మిగిలిన 13 మంది బతికి బయటపడ్డా రు. గెమ్మెలి భీమన్న, అప్పన్నలు ఓ స్తంభాన్ని పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. మృతులను గెమ్మెలి పొట్టి (70), అసో (65), సోభన్న (25), సందో (30), సుబ్బారావు (9) గుర్తించారు. ఘటన ఆలస్యంగా వెలుగు చూడడంతో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కిల్లో సురేంద్ర, సీపీఎం మండల క్యాదర్శి పొద్దు బాలదేవ్ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీయించారు.
కొన్ని పశువులు, మేకలు కూడా ప్రళయంలో కొట్టుకుపోయాయని వారు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం చెల్లిం చాలని సురేంద్రతోపాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ డిమాండ్ చేశారు. మృత దేహాల వెలికితీతలో అధికారులు తాత్సారం చేశారని, కనీసం ఆదుకునే విషయంలోనైనా స్పందించాలని కోరారు.
ప్రమాదం అంచున పీటీజీ గ్రామాలు
మాదల పంచాయతీ రత్తకండి, దోమలజోడి, పాల్మన్‌వలస, చిట్టంగొంది, తుంగగడ్డ గ్రామాల్లోని గిరిజనులు ప్రమాదం అంచున బితుకుబితుకుమంటూ కాలం గడుపుతున్నారు. ఆదివారం జరిగిన ఘటనలో మిగిలిన వారు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ ఘటన జరుగుతుందో, ఎవరి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో అని పీటీజీలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తమకు మోడల్ కాలనీలు నిర్మించాలని పీటీజీలు కోరుతున్నారు. కాగా, విశాఖ-అరకు ఘాట్‌లో వరద ఉద్ధృతికి పలుచోట్ల కల్వర్టులు, రక్షణ గోడలు ధ్వంసమయ్యాయి. ఘాట్‌లో విరిగిపడిన చెట్లను తొలగించడంలో కూడా అధికారులు విఫలమయ్యారు.