నెల్లూరు(పొగతోట)
జిల్లాలో తుపాన్ల సీజన్ ప్రారంభమైంది. ఇటీవల హుదూద్ తుపాను ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టించి చేదు జ్ఞాపకాలు మిగిల్చిన సంగతి తెలిసిందే. ఎన్నిముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా ప్రాణ, ఆస్తినష్టాలు తప్పలేదు. ఈ క్రమంలో తరచూ తుపాన్ల బారిన పడే జిల్లా వాసుల్లోనూ ఆందోళన మొదలైంది. సాధారణంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లలో దక్షిణ కోస్తాపై తుపాన్ల ప్రభావం ఉంటుంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో సెప్టెంబర్, అక్టోబర్‌లో కురిసే వర్షాలతో చెరువుల్లో నీరు చేరుతుంది.
అనంతరం తుపాన్లు వస్తే చెరువులకు గండ్లు పడటంతో పాటు రహదారులు దెబ్బతింటున్నాయి. తరచూ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా నష్టనివారణ చర్యలు చేపట్టడంలో జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలోని తీరప్రాంతంలో 11 మండలాలు ఉన్నాయి. మరో ఐదు మండలాలు లోతట్టు ప్రాంతాల జాబితాలో ఉన్నాయి.
కావలి నుంచి తడ మండలం వరకు తీరం పొడవునా 177 తుపాను షెల్టర్లు నిర్మించారు. వీటిలో అధిక శాతం షెల్టర్లు శిథిలమై అధ్వానస్థితిలో ఉన్నాయి. తుపాన్లు సంభవించిన సమయంలో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఆ సమయంలో ముంపుబారిన పడిన వారిని తరలించేందుకు షెల్టర్లు అనుకూలంగా లేవు.
ముందస్తు చర్యల్లో నిర్లక్ష్యం
తుపాన్లను సమర్ధంగా ఎదుర్కొని సహాయచర్యలు చేపట్టేందుకు జిల్లా అధికారుల కమిటీలు ఉన్నాయి. ప్రతి ఆరు నెలలకోసారి ఈ కమిటీలు కలెక్టర్ అధ్యక్షతన సమావేశమై ముందస్తు చర్యలపై చర్చించాలి. అయితే ఇటీవల కాలంలో సమావేశాల నిర్వహణ సక్రమంగా సాగడం లేదు. ప్రకృతి విపత్తులు సంభవిస్తే ప్రజలను ఆదుకునేందుకు అవసరమైన సామగ్రి అందుబాటులో లేదు.
పరికరాల కొనుగోలుకు నిధులు విడుదల చేసి రెండేళ్లవుతోంది. ఏదేని ఉపద్రవం సంభవించాక హడావుడి చేస్తున్న ప్రభుత్వం ముందస్తుగా ఎలాంటి నిధులు విడుదల చేయడం లేదు. రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టడానికి అవసరమైన పరికరాలు అగ్నిమాపక శాఖ వద్ద మాత్రమే ఉన్నాయి. సహాయక చర్యలకు అవసరమైన సామగ్రి ఆర్డీఓ కార్యాలయాల్లో ఉన్నాయని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. హుదూద్ నేర్పిన పాఠంతోనైనా ముందస్తు జాగ్రత్తలపై అధికారులు దృష్టిపెట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
సహాయక చర్యలకుసిద్ధంగా ఉన్నాం:
తుపాన్లు సంభవిస్తే సహాయక చర్యలు చేపట్టడానికి జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. సామగ్రి కొనుగోలుకు నిధు లు లేవు. అవసరమైన సమయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. తుపాన్లను ఎదుర్కోవడంపై వచ్చే వారంలో అధికారులతో సమావేశం నిర్వహిస్తాం.
-నాగేశ్వరరావు, డీఆర్వో
తుపాను వస్తే అంతే సంగతులు
Published Sun, Nov 9 2014 1:49 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement
Advertisement