ఎస్బీఐలో దోపిడీకి యత్నం
తాళాలు పగులగొట్టి స్ట్రాంగ్‌రూమ్‌లోకి వెళ్లిన దొంగ
నగదు, బంగారం భద్రం
వడ్డాది (బుచ్చెయ్యపేట), న్యూస్‌లైన్: బుచ్చెయ్యపేట మండలం పంచాయతీ వడ్డాది నాలుగురోడ్ల జంక్షన్లో ఉన్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శనివారం తెల్లవారుజామున దొంగలు చొరబడి దోపిడీకి యత్నించారు. దొంగలు బయట తాళాలతోబాటు లోపల స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగులగొట్టి లోపలకు ప్రవేశించినా నగదు, ఆభరణాలు తీసుకెళ్లలేకపోయారు.
శనివారం తెల్లవారుజాము మూడు గంటల ప్రాంతంలో స్టేట్‌బ్యాంక్ వెనుక గేటు బద్దలుకొట్టి కిటికీలోంచి దొంగలు ప్రవేశించి స్ట్రాంగ్‌రూమ్ తాళాలు పగులగొట్టారు. స్ట్రాంగ్ రూమ్‌లోకి వెళ్లిన వెంటనే అలారం మోగడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అదే సమయంలో స్ట్రాంగ్‌రూమ్‌లోకి వెళ్లిన వ్యక్తికి ఫోన్ రావడంతో దొంగ పరారైనట్లు సీసీ కెమెరాల ద్వారా తెలుస్తోంది.
ముగ్గురు నలుగురు వ్యక్తులు ఈ దోపిడీకి ప్రయత్నించి ఉంటారని, లోపలకు వెళ్లిన వ్యక్తికి ఫోన్ ద్వారా బయట సమాచారం చేరవేసి దొంగతనానికి పాల్పడినట్లు సీసీ కెమెరా ఆధారంగా తెలుస్తోంది. లోపలకు వెళ్లిన వ్యక్తి ముఖానికి ముసుగు ఉన్నట్లు సీసీ కెమెరా ద్వారా గుర్తించి, దొంగ ఆచూకీ కోసం వెతుకుతున్నారు.
చోడవరం సీఐ ఎ.విశ్వేశ్వరరావు, ఏఎస్ఐ అప్పారావు, హెచ్‌సీ సన్యాసిరావు, తదితరులు బ్యాంకును పరిశీలించారు. దొంగలు విడిచిపెట్టి వెళ్లిన గునపాం, పగులగొట్టిన తాళం కప్పలు, చెప్పులను స్వాధీనం చేసుకొని క్లూస్‌టీమ్ ద్వారా వేలిముద్రలు సేకరించి విచారణ చేస్తున్నారు. బ్యాంకు మేనేజర్ జోసెఫ్ రాజ్‌ను పోలీసులు విచారిస్తున్నారు.