street child
-
Street Child World Cup 2022: వీధి బాలికల టీమ్ ఆడుతోంది చూడండి
కతార్‌లోని దోహాలో వీధి బాలికల ఫుట్‌బాల్ ఉత్సవం జరుగుతోంది. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వీధి బాలికలు తమ పేదరికాన్ని, దురదృష్టాన్ని, కష్టాలను, ఆకలిని దాటి తామేంటో నిరూపించుకోవడానికి కసిదీరా బంతిని కాలితో తంతున్నారు. మన దేశం నుంచి టీమ్ వెళ్లింది. వారిలో 9 మంది చెన్నై వీధి బాలికలు. కెప్టెన్ కూడా. ‘గెలవడం ఓడటం కాదు... మేము కూడా దేశంలో భాగమే అని చెప్పగలుగుతున్నాం’ అంటున్నారు వారు. ఇటీవల ఇదే అంశం పై ‘ఝుండ్’ సినిమా వచ్చింది. ఇది నిజం ఝుండ్. కతార్‌లోని దోహాలో ఫుట్‌బాల్ వరల్డ్ కప్. అక్టోబర్ 6 నుంచి 15 వరకు. దాని పేరు ‘స్ట్రీట్ చైల్డ్ వరల్డ్ కప్ 2022’. 25 దేశాల వీధి బాలికలు ఈ కప్ కోసం హోరాహోరీ ఆడుతున్నారు. మన దేశం నుంచి టీమ్ వెళ్లింది. ఎవరెవరి తో తలపడుతున్నదో తెలుసా? అమెరికా, మెక్సికో, జింబాబ్వే, పెరు, బంగ్లాదేశ్. వీటన్నింటిని దాటితే అక్టోబర్ 15న ఫైనల్స్. గెలుస్తారో లేదో తర్వాతి సంగతి. కాని చెన్నైలోని మురికివాడలకు చెందిన అమ్మాయిలు ఫుట్‌బాల్ నేర్చుకుని, ప్రతిభ చూపి, విమానం ఎక్కి, విదేశి గడ్డ మీద, విదేశీ టీమ్‌లతో– వాళ్లూ వీధి బాలికలే– తలపడటం ఉందే... అదే అసలైన గెలుపు. మిగిలింది లాంఛనం. 2010లో లండన్‌లో వీధి బాలల ఫుట్‌బాల్ మొదలయ్యింది. పేదరికం వల్ల, అయినవారు లేకపోవడం వల్ల, ఇళ్ల నుంచి పారిపోవడం వల్ల దిక్కులేని వారిగా ఉన్న వీధి బాలలు నేరస్తులుగా, డ్రగ్ ఎడిక్ట్లుగా మారకుండా వారికి ఆరోగ్యకరమైన ఒక వ్యాపకం ఉండేందుకు ‘స్ట్రీట్ చైల్డ్ యునైటెడ్’ అనే సంస్థ ఈ ఫుట్‌బాల్ తర్ఫీదును మొదలెట్టింది. అది క్రమంగా ఇవాళ 25 దేశాలకు పాకింది. వీధి బాలలతో మొదలైన ఫుట్‌బాల్ వీధి బాలికలకు చేరింది. మన దేశంలో అనేక నగరాలలో వీధి బాలికల ఫుట్‌బాల్ టీమ్స్ ఉన్నాయి. వీటన్నింటి నుంచి 12 మంది సభ్యుల నేషనల్ జట్టును తయారు చేసి దోహాకు పంపారు. ఈ జట్టులో చెన్నైకు చెందిన ‘కరుణాలయ’ అనే వీధి బాలికల సంస్థకు చెందిన 9 మంది బాలికలు ఉన్నారు. కెప్టెన్ కూడా చెన్నై నుంచే. వీరంతా దోహాలో ఇప్పుడు మ్యాచ్‌లు ఆడుతున్నారు. మన దేశం నుంచి వెళ్లిన వీధిబాలికల జట్టులో ఒక్కొక్కరిది ఒక్కో కథ. సంధ్య అనే అమ్మాయి చెన్నైలోని కూరగాయల మార్కెట్లో దిక్కులేక తిరుగుతుంటే కరుణాలయలో చేర్చారు. అక్కడే ఉండి చదువుకుంటోంది. ఇప్పుడు ఫుట్‌బాల్ మేటి ఆటగత్తె అయ్యింది. ‘నేను జీవితంలో విమానం ఎక్కుతానని అనుకోలేదు. కరుణాలయ వాళ్లు నా పాస్‌పోర్ట్‌ను సిద్ధం చేస్తున్నారని విన్నానుగాని జట్టులో చోటు దొరుకుతుందని అనుకోలేదు. తీరా విమానం ఎక్కాక తెలిసింది నేనే ఈ జట్టుకు కెప్టెన్ అని’ అని సంబరపడుతోంది ఆమె దోహ నుంచి ఇంటర్వ్యూ ఇస్తూ. జట్టులో ఉన్న మరో ప్లేయర్– 17 ఏళ్ల ప్రియకు తల్లిదండ్రులెవరో తెలియదు. ఎలాగో కరుణాలయకు చేరి అక్కడే ఉంటోంది. ఇప్పుడు జాతీయ జట్టులో స్థానం పొందిన ప్లేయర్‌గా ఆమె ఆత్మవిశ్వాసం ఎంతో గొప్పగా ఉంది. వీరిద్దరే కాదు జాతీయ జట్టుకు ఎంపికైన ఈ చెన్నై ‘కరుణాలయ’ బాలికల్లో పవిత్ర, దివ్య, దర్శిని, గోల్‌కీపర్ సదా... వీరందరివీ ఇలాంటి కథలే. అయితే ఈ వరల్డ్ కప్‌కు ఆషామాషీగా వెళ్లారా మనవాళ్లు? కాదు. ఆరు నెలలుగా సాధన చేస్తున్నారు. కరుణాలయ ఉన్న తొండియర్పేట్ నుంచి పెరంబూర్‌లో ఉన్న గ్రౌండ్ వరకూ రోజూ వెళ్లి ప్రాక్టీసు చేశారు. అల్డ్రోయ్ అనే వ్యక్తి వీరికి కోచ్‌గా ఉన్నాడు. ఇప్పుడు ఈ టీమ్‌తో ఒక మేనేజర్, ఒక సహాయకురాలు, కోచ్ వెళ్లారు. ‘దోహాలో అంతా క్రమశిక్షణ. ఉదయం ఐదింటికల్లా మేమంతా లేచి బ్రేక్‌ఫాస్ట్‌లు చేసి ఏడున్నర ఎనిమిది నుంచి మ్యాచ్‌లకు సిద్ధమైపోతున్నాం’ అని చెప్పారు ఈ బాలికలు ఫోన్ ఇంటర్వ్యూలో. అయితే వీరు ఈ సంతోషం పొందడం వెనుక నిర్వాహకుల శ్రమ చాలా ఉంది. ఏమంటే వీరికి సరైన చిరునామాలు లేవు, తల్లిదండ్రుల వద్ద సరైన పత్రాలు లేవు. అందువల్ల వీరి పాస్‌పోర్టులు చాలా కష్టమయ్యాయి. కాని సాధించారు. ‘ఝుండ్’ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఇలాగే వీధి బాలలకు సాకర్ నేర్పిస్తే వరల్డ్ కప్‌కు పాస్‌పోర్ట్‌ల కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. వీరి కథ వింటే ఆ సినిమా గుర్తుకొస్తుంది. ఈ బాలికలు గెలిచి వచ్చినా ఓడి వచ్చినా వీరు వచ్చి చెప్పే అనుభవాలు ఎందరో వీధి బాలికల మనసులో స్ఫూర్తిని నింపుతాయనడంలో సందేహం లేదు. దోహాలో మన టీమ్ -
జానెడు పొట్ట..
బుక్కెడు బువ్వ.. గుక్కెడు నీళ్లు.. నిలువ నీడ.. బతుకుకు తోడు కరువై... జానెడు పొట్ట కోసం పోరాడుతున్న బాలలెందరో.. నేడు బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారుల బాధలపై బతుకు చిత్రాలు.. పాల‘బుగ్గల’ పసివాడా.. పట్నం వచ్చిన పోరగాడా.. పాలు మరిచిన పిల్లవాడా.. బాధ్యతలను మోస్తున్న మొనగాడా.. – సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్ కట్టెమైన బతుకులు భారమైన బతుకులో బాధలను మరిచి.. బతుకు బండిలో పయణిస్తున్నామని తలచి.. ఎర్రటి ఎండలో.. కట్టెల బరువుతో నడిచి.. అమ్మకు అండగా ఉంటున్నామని సంతోషించి.. – సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్ గుక్కెడు నీటి కోసం.. భూమిపై మూడింట రెండొంతుల నీరున్నా.. ప్రజలు దాహం.. దాహం.. అంటూ ల్లాడుతున్నారు. పాలకులు రక్షిత మంచినీరు అందిస్తున్నామని తెలుపుతున్నారు... కానీ నేటికీ గుక్కెడు నీటి కోసం తపిస్తున్న పేదలెందరో.. – సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్ ‘వీధి’ బాలలం పలకా, బలపం పట్టాల్సిన చిట్టి చేతులు మురికి సంచులను పట్టాయి. పేదరికం, విధి కారణంగా వీధి వీధి తిరుగుతూ పడవేసిన ప్లాస్టిక్ సామాన్లను ఎరుతున్నారీ చిన్నారులు.. – సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్ ఈ నవ్వులు బడిలో విరియాలి.... తరగతి గదిలోనే విద్యార్థుల భవిష్యత్ రూపుదిద్దుకుంటుంది. కానీ నేడు ఎందరో బాలలు చదువుకు దూరమవుతూ.. రోడ్ల వెంట, చెత్త కుప్పల దగ్గర కనిపిస్తున్నారు. బడిలో ఉండాల్సిన ఈ చిన్నారులు బతికేందుకు ఇలా రోడ్డుమీదకొచ్చారు... – పెద్దపల్లి వరప్రసాద్, సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్ గుక్కెడు నీటి కోసం.. భూమిపై మూడింట రెండొంతుల నీరున్నా.. ప్రజలు దాహం.. దాహం.. అంటూ అల్లాడుతున్నారు. పాలకులు రక్షిత మంచినీరు అందిస్తున్నామని తెలుపుతున్నారు... కానీ నేటికీ గుక్కెడు నీటి కోసం తపిస్తున్న పేదలెందరో.. – సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్ చెత్తలో బతుకును వెతుకుతూ.. పుట్టిన వెంటనే ఆడ పిల్లలను చెత్త కుప్పల్లో పడేయడం మనం చూస్తూనే ఉంటాం... పై చిత్రంలో కనిపిస్తున్న ఈ ఈ బాలిక అదే చెత్త కుప్పల్లో తన బతుకును వెతుకుతూ సాగుతోంది... తరాలు మారినా ఆడపిల్ల్లల తలరాతలు మారడం లేదు.. – సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్ ఆకలి రాజ్యం ధనవంతుడినైనా.. పేదవాడినైనా.. ఒకేలా పలకరించేది ఆకలి మాత్రమే.. కోట్లు సంపాదించే దీ కూటి కోసమే... భువిపై ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులెందరో..– సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్ -
కోక్ కొందామని వస్తే.. తోసిపారేశారు!
పెద్ద పెద్ద పేర్లతో వస్తున్న బహుళ జాతీయ రెస్టారెంట్లు మన దేశంలో ఉన్న బడుగు జీవులను చిన్నచూపు చూస్తున్నాయి. ఈ విషయం మహారాష్ట్రలోని పుణె నగరంలో స్పష్టంగా రుజువైంది. అక్కడి మెక్ డోనాల్డ్ రెస్టారెంటు ఉద్యోగులు.. కోక్ కొనేందుకు వచ్చిన ఓ వీధి బాలుడిని మెడపట్టుకుని బయటకు గెంటేశారు. అలాంటివాళ్లకు తమ రెస్టారెంటులో చోటు లేదని స్పష్టం చేశారు. ఈ ఘోరంపై దర్యాప్తు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయమై పూర్తి వివరాలు తెలుసుకోవాలని తాను ఇప్పటికే ఆదేశించానని, ప్రస్తుతం తనకు కూడా అన్ని విషయాలు తెలియవని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. ఈ మొత్తం విషయాన్ని షహీనా అత్తర్వాలా అనే మహిళ తన ఫేస్బుక్ పేజీలో వివరించారు. ఆమె తన స్నేహితులతో కలిసి మెక్ డోనాల్డ్ రెస్టారెంటుకు వెళ్లినప్పుడు అక్కడ బయట నిలబడి ఉన్న బాలుడిని చూశారు. వాళ్ల చేతుల్లో ఉన్న కోక్ టిన్నులను ఆశగా చూడటంతో.. నీక్కూడా కావాలా అని అడిగారు. అతడు అవుననడంతో షహీనా లోపలికెళ్తూ, తనతో పాటు లోపలికి వస్తావా అని ఆ పిల్లాడిని అడిగారు. దానికి అతడు సంతోషంగా అంగీకరించి లోపల క్యూలోకి వెళ్లగానే మెక్ డోనాల్డ్స్ ఉద్యోగులు అతడిని మెడపట్టి బయటకు గెంటేశారు. ఇలాంటి వాళ్లను అసలు లోపలకు అనుమతించేది లేదని కూడా ఓ ఉద్యోగి చెప్పారు. పిల్లాడి పక్కన తాను ఉండగానే అతడి కాలర్ పట్టుకుని మరీ బయటకు లాగి పారేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఎలాంటి దర్యాప్తు జరిగినా తాము సహకరించేది లేదని మెక్ డోనాల్డ్స్ సంస్థ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. తాము అంతర్గతంగా దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, అసలు తమ రెస్టారెంట్లలో వివక్షకు తావు ఇవ్వబోమని కూడా చెప్పింది.