Strength of Party
-
రాజ్యసభలో పుంజుకోనున్న బీజేపీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ సాధారణ ఎన్నికలకు ఏడాదిన్నర సమయం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో కొత్త బిల్లుల్ని పార్లమెంట్లో ఆమోదింపచేసుకుని తన ప్రతిష్ట పెంచుకోవాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. రాజ్యసభలో తగినంత సంఖ్యా బలం లేకపోవడం బీజేపీకి ఇబ్బందిగా మారింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బలం పెంచుకునే అంశంపై బీజేపీ దృష్టి పెట్టిందని ఆ పార్టీ పార్లమెంటరీ కమిటీ కార్యదర్శి బాలసుబ్రమణియమ్ చెప్పారు. 2018 ద్వితీయార్థానికల్లా రాజ్యసభలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించబోతోంది. ప్రస్తుతమున్న 57 మంది సభ్యుల బలం 67కి చేరుతుంది. 244 మంది సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీఏ కూటమి బలం 98కి చేరువకానుంది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఆ పార్టీ లాభపడనుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు రాజ్యసభలో 57 మంది ఎంపీలుండగా.. జూలైకు ఆ బలం 48కి పడిపోనుంది. యూపీఏ కూటమి ఎంపీలు 72 నుంచి 63 తగ్గనున్నారు. బడ్జెట్ సమావేశాల నాటికి బీజేపీ బలం 58కి పెరగనుండగా.. కాంగ్రెస్ బలం 54కి పడిపోనుంది. కాంగ్రెస్ తర్వాత రాజ్యసభలో సమాజ్‌వాదీ పార్టీ ఎక్కువ నష్టపోనుంది. ఆ పార్టీ ఐదు స్థానాలు కోల్పోనుండగా.. ఆర్జేడీ బలం మూడు నుంచి ఐదుకు పెరుగుతుంది. రాజ్యసభ ఉప ఎన్నికలు, ద్వైవార్షిక ఎన్నికల ఫలితాలపై ఈ మార్పులు చేర్పులు ఆధారపడి ఉన్నాయి. ఇక ఏప్రిల్‌లో ద్వై వార్షిక ఎన్నికల్లో 59 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. యూపీలో 10 స్థానాలకు ఎన్నిక జరగనుండగా 8 స్థానాలు బీజేపీ సొంతం కానున్నాయి. -
పార్టీ పటిష్టతపై వైఎస్సార్సీపీ తెలంగాణ దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ పటిష్టత, సంస్థాగత బలోపేతంపై వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళనలు చేపట్టడంపై కార్యాచరణ రూపొందించుకోనుంది. ఇప్పటికే రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలు, కమిటీల నియామకాన్ని చేపట్టగా, మండల స్థాయిలో కమిటీల నియామకాన్ని పూర్తిచేయనున్నారు. ఈ నెల 16 నుంచి 20 వరకు లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి జిల్లాల వారీగా సమీక్షలను నిర్వహించనున్నారు. 16న నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్లి జిల్లాల సమావేశాలు.. ఈ నెల 16న నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల సమీక్ష సమావేశాలు జరగనున్నాయి. 18న నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు, 19న గ్రేటర్ హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలు, 20న మెదక్, ఖమ్మం జిల్లాల సమావేశాలు ఉంటాయి. ఈ సమావేశాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం, మండల స్థాయి కమిటీల నియామకంపై చర్చించనున్నట్లు పార్టీ రాష్ర్ట ప్రధానకార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. ఈ సమావేశాలకు ఆయా జిల్లాల పార్టీ పరిశీలకులు, పార్టీ సహ పరిశీలకులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు మాత్రమే హాజరుకావాలన్నారు.