దంబోద్భవుడికి గుణపాఠం
పురానీతి
ఒకానొక కాలంలో దంబోద్భవుడనే రాజు ఉండేవాడు. పేరుకు తగ్గట్లే గర్విష్టి. పైగా భుజబల పరాక్రమ సంపన్నుడు. అతడిని ఎదిరించే రాజులే ఉండేవారు కాదు. రోజూ అతడు సభకు వచ్చి, సింహాసనంపై కూర్చోగానే వందిమాగధులు, భట్రాజులు అతడిని కీర్తిస్తూ స్తోత్రాలు పఠించేవారు. బల సంపదలో అతడికి సాటివచ్చే వారు ముల్లోకాలలోనూ లేరని పొగిడేవారు. దంబోద్భవుడు చిరునవ్వులు చిందిస్తూ, మీసం మెలితిప్పుతూ ఆ పొగడ్తలను వీనుల విందుగా ఆలకించేవాడు. రోజూ పొగడ్తలను విని విని లోకంలో తనను మించిన వారే లేరనే భ్రమలో బతకసాగాడు.
‘ఈ భూలోకంలో నన్ను మించిన వీరుడెవరైనా ఉన్నాడా? ధనుర్విద్యలోనే కాదు, ఖడ్గ గదా యుద్ధాలలో నన్ను జయించగల వాడెవడైనా ఉన్నాడా? కనీసం మల్లయుద్ధంలో నన్ను మట్టికరిపించే ధైర్యం ఎవరికి ఉంది?’ అంటూ సభాసదులను ప్రశ్నించేవాడు.
‘భూలోకంలోనే కాదు ప్రభూ! ముల్లోకాలలోనూ మిమ్మల్ని జయించగల వీరులెవ్వరూ లేరు’ అని వందిమాగధులు ముక్తకంఠంతో బదులిచ్చేవారు.
మిగిలిన వారు మౌనంగానే తలలు పంకించేవారు. వందిమాగధుల పలుకులు వింటూ భుజాలు ఎగరేస్తూ పకపకా వికటాట్టహాసం చేసేవాడు దంబోద్భవుడు. అతడి సభలో ఇదంతా అనుదినం జరిగే తతంగమే. రోజూ పొగడ్తలు మాత్రమే వింటూ ఉండటంతో దంబోద్భవుడు మితిమీరిన గర్వంతో విర్రవీగసాగాడు.
ఇలా ఉండగా, ఒకనాడు పొరుగు రాజ్యానికి చెందిన విప్రులు యాత్రలకు వెళుతూ దంబోద్భవుని సభకు వచ్చారు. దంబోద్భవుడు వారికి ఉచిత మర్యాదలు చేశాడు.
‘విప్రులారా! మీరు దూర ప్రాంతం నుంచి వచ్చారు. యాత్రలు చేస్తూ ఉన్నారు. నన్ను మించిన వీరుడు ఎవరైనా మీకు తారసపడ్డాడా?’అని ప్రశ్నించాడు.
‘రాజా! నీవు మహావీరుడివే! సందేహం లేదు. రాజులలో నిన్ను మించిన వారు లేనేలేరు. అయితే, గంధమాధన పర్వతం మీద నర నారాయణులనే ఇద్దరు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వారిని జయించగల వీరులు ముల్లోకాలలో ఎవరూ లేరని విన్నాం’ అని చెప్పారు ఆ విప్రులు.
ఆ మాట వినడంతోనే తోక తొక్కిన త్రాచులా బుసలు కొట్టాడు దంబోద్భవుడు. ‘నన్ను మించిన వీరులా..? వారిని జయించగలవారు ముల్లోకాలలోనే లేరా..? ఆ సంగతి ఇప్పుడే తేల్చుకుంటాను’ అంటూ సేనలను యుద్ధానికి సిద్ధం చేసి గంధమాధన పర్వతం వైపు బయలుదేరాడు.
గంధమాధన పర్వతం మీద ప్రశాంత వాతావరణంతో ఉన్న వనంలో ఆశ్రమం ఏర్పరచుకుని తపస్సు చేసుకుంటున్న నర నారాయణులు కనిపించారు. యుద్ధానికి రమ్మంటూ దంబోద్భవుడు వారిని తొడగొట్టి మరీ ఆహ్వానించాడు. ఆశ్రమానికి వచ్చిన దంబోద్భవునికి నర నారాయణులు అతిథి మర్యాదలు చేయబోగా, అతడు వాటన్నింటినీ తిరస్కరించాడు.
‘ఈ మర్యాదలన్నీ అనవసరం. నాకు యుద్ధం కావాలి... నేను మీతో యుద్ధం కోసమే వచ్చాను’ అంటూ వికటాట్టహాసం చేశాడు.
‘లౌకిక కార్యకలాపాలకు దూరంగా తపస్సు చేసుకునే మునులం మేము. మాతో యుద్ధం చేయాలనే కోరిక నీకు ఎలా కలిగింది రాజా! యుద్ధం ఆలోచనను విరమించుకుని, చక్కగా నీ రాజ్యానికి పోయి ప్రజల ఆలనా పాలనా చూసుకో’ అని నచ్చచెప్పారు నర నారాయణులు.
వారి మాటలు రుచించని దంబోద్భవుడు దాడి చేయమంటూ సైన్యాన్ని ఆదేశించాడు. తానూ కత్తి ఝుళిపించాడు. నర నారాయణుల్లో నరుడు ఇక లాభం లేదనుకుని ఒక దర్భపుల్లను తీసుకుని, దానిని మంత్రించి సైన్యం మీదకు సంధించాడు. దర్భపుల్ల ధాటికి సైన్యం చేతిలో ఉన్న ఆయుధాలన్నీ తుత్తినియలయ్యాయి. వాళ్ల అవయవాలు తెగాయి. భయభ్రాంతులైన సైనికులు పలాయనం చిత్తగించసాగారు.
ఈ దృశ్యం చూడటంతో దంబోద్భవుడికి ధైర్యం దిగజారింది. తన తప్పు తెలిసివచ్చింది. తనను మన్నించాలంటూ నర నారాయణుల కాళ్ల మీద పడ్డాడు.
‘రాజా! బల పరాక్రమాలను దుర్జన శిక్షణకు, సజ్జన రక్షణకు మాత్రమే ఉపయోగించాలి తప్ప వాటి కారణంగా గర్వం తలకెక్కించుకుని ఇతరులను పీడించరాదు’ అంటూ హితబోధ చేసి దంబోద్భవుడిని సాగనంపారు నర నారాయణులు.