Strengthening security
-
శ్రీవారి ఆలయానికి భద్రత పెంచండి
* లోక్‌సభలో ఎంపీ పెద్దిరెడ్డి * మిథున్‌రెడ్డి డిమాండ్ సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి భద్రత మరింత పెంచాలని లోక్‌సభలో రాజం పేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసి.. భక్తుల మనోభావాలను పరిరక్షించాలని కోరారు. లోక్‌సభలో మంగళవారం జీరో అవర్‌లో ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ దేశ, విదేశాల నుంచి భక్తులు రోజూ సగటున లక్ష మంది తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు శ్రీవారిని కొలుస్తున్నారన్నారు. కొన్ని ఉగ్రవాద సంస్థలు శ్రీవారి ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఇటీవల జారీచేస్తున్న హెచ్చరికలు భక్తుల్లో ఆందోళన నింపుతున్నాయని వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో శ్రీవారి ఆలయానికి భద్రత కల్పిస్తున్నారని చెప్పారు. శ్రీవారి ఆలయ భద్రతలో కేంద్రం కూడా పాలుపంచుకుంటే బందోబస్తు పటిష్టమవుతుందని సూచించారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్(ఐబీ) వంటి నిఘా సంస్థలు కేంద్రం నేతృత్వంలో పనిచేస్తున్న నేపథ్యంలో.. ఉగ్రవాద కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వానికన్నా కేంద్ర ప్రభుత్వం వద్దే ఎక్కువ సమాచారం ఉండే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భద్రతను కల్పిస్తే ఉగ్రవాదుల నుంచి ఎలాంటి ముప్పు ఉండదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు ముడిపడి ఉన్న నేపథ్యంలో తక్షణం కేంద్రం స్పందించి శ్రీవారి ఆలయానికి భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి జీవో అవర్‌లో లేవనెత్తిన ఈ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లోక్‌సభలో బుధవారం గానీ, గురువారంగానీ రాతపూర్వక సమాధానం ఇవ్వనున్నారు. -
మున్సి‘పోల్స్’కు పటిష్ట బందోబస్తు
కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో ఆదివారం జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎస్పీ జి.విజయ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికలు జరిగే పది మున్సిపాలిటీలకు ఇన్చార్జిలను, 2689 మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, పది మంది ఏఎస్సీ, డీఎస్పీలు, 30 మంది సీఐలు, 114 మంది ఎస్సైలు, 302 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 1337 మంది కానిస్టేబుళ్లు, 394 మంది హోంగార్డులు, 235 మంది ఆర్మ్డ్ రిజర్వు, మూడు కంపెనీల (265 మంది) పారా మిలటరీ సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నారు. అత్యవసర సమయంలో సంబంధిత అధికారులను సంప్రదించేందుకు వారి సెల్ నంబర్లు, ఇతర వివరాలను పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు మరింత పెంచారు. ప్రతి మున్సిపాలిటీకి ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించి వారి పర్యవేక్షణలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు ఎస్పీ విజయ్‌కుమార్ ఏర్పాట్లు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేశారు. ప్రజలు 1090, 94407 96514 నంబర్లకు ఫోన్ చేసి ఎలక్షన్ సెల్ సేవలను వినియోగించుకునే విధంగా సిబ్బందిని నియమించారు. పోలీసులకు సహకరించాలి మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసులకు సహకరించాలి. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందిస్తే తగు చర్యలు తీసుకుంటాం. ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉంది. ప్రత్యేక దళాలు, అదనపు బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నందున అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలి.