సమ్మె నాలుగు నెలలు వాయిదా
న్యూఢిల్లీ: ఏడో వేతన సంఘం సిఫార్సులను నిరసిస్తూ ఈ నెల 11నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మెను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. వినతుల పరిష్కారానికి కమిటీని నియమించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మెను 4 నెలలపాటు వాయిదా వేస్తున్నామన్నాయి. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జాతీయ ఉమ్మడి కార్యాచరణ మండలి (ఎన్జేసీఏ) కన్వీనర్ శివగోపాల్ మిశ్రా చెప్పారు.
అంతకుముందు ఆయా సంఘాల నేత కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలసి తమ సమస్యల గురించి ఏకరువు పెట్టారు. దీంతో ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని నిర్ణయించింది. ఉద్యోగుల సమస్యలపై త్వరలోనే కొత్త కమిటీని నియమిస్తామని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కాగా, బీఎంఎస్ మాత్రం తొలుత నిర్ణయించినట్లు ఈనెల 8న తమ నిరసనలు కొనసాగుతాయంది.