పోలీసులే కొట్టి, నగ్నంగా ఊరేగించారు..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని దన్కౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. తమ ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేయటానికి వెళ్లిన ఓ దళిత కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. యూపీ రాజధాని లక్నోకు కూతవేటులో దూరంలోనే ఈ అమానుషం చోటు చేసుకుంది. ఆ దళిత దంపతుల పట్ల పోలీసులు అతి కిరాతకంగా ప్రవర్తించారు. స్టేషన్ నుంచి బయటకు ఈడ్చుకొచ్చి... నడి రోడ్డు మీద వారిపై తమ ప్రతాపం చూపారు. వారిని వివస్త్రలను చేసి చితకబాదిన సంఘటన కలకలం రేపుతోంది. ఈ దారుణాన్ని ఓ వ్యక్తి తన సెల్ ఫోన్లో చిత్రీకరించి ఆన్లైన్లో పెట్టడంతో.. పోలీసుల వైఖరిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్లోని దన్కౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సునీల్ గౌతమ్ అనే వ్యక్తి ఇంట్లో బుధవారం రాత్రి దొంగతనం జరిగింది. ఆ విషయంపై ఫిర్యాదు చేయడానికి అతడు తన భార్య, మరి కొందరు బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అయితే విధుల్లో ఉన్న స్టేషన్ ఆఫీసర్ ప్రవీణ్ యాదవ్ కేసు నమోదు చేయడానికి నిరాకరించాడు. అంతేకాకుండా వారిపట్ల నిర్లక్ష్యంగా , అవహేళనగా మాట్లాడాడు.
దీంతో తమ ఫిర్యాదును స్వీకరించి... కేసు నమోదు ఎందుకు చేయరో చెప్పాలని సునీల్ తదితరులు ఆ పోలీస్ అధికారిని నిలదీశారు. అంతే.... ఖాకీ అధికారికి ఎక్కడలేని కోపమొచ్చింది. నన్నే ఎదిరించి మాట్లాడతావా అంటూ చెలరేగిపోయాడు. ఆగ్రహంతో ఊగిపోతూ వారిపై దాడికి దిగాడు. స్టేషన్లో ఉన్న మరికొందరు ఖాకీలు ఆ అధికారికి తోడయ్యారు.
పోలీసులందరూ కలిసి ఒక్కసారిగా సునీల్ కుటుంబ సభ్యులు, బంధువులపై దాడి చేసి.... వారిని కొట్టుకుంటూ రోడ్డు మీదికి ఈడ్చుకొచ్చారు. అంతేకాకుండా సభ్య సమాజం నివ్వెరపోయేలా దారుణానికి ఒడిగట్టారు. అంతా చూస్తుండగానే చేతిలో చంటిబిడ్డతో ఉన్న సునీల్ భార్య చీరను లాగి పడేశారు. ఈ చర్యను అడ్డుకున్నవారిని చితక్కొట్టారు. అడ్డుపడిన సునీల్ బట్టలను కూడా చించేశారు. ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టిన పోలీసులు అంతటితో ఊరుకోకుండా సునీల్ పై, అతని భార్య, బంధువులపై క్రిమినల్ కేసులు బనాయించినట్టు సమాచారం.
అటు ఒక్క పక్క చంటిబిడ్డను, మరోపక్క తన దేహాన్ని, ఇంకో పక్క తన భర్తను కాపాడుకోవడానికి ఆ దళిత మహిళ పడిన ఆరాటం ..చేసిన పోరాటం ఇపుడు సోషల్ మీడియాలో పలువురిని దిగ్భ్రాంతికి, విస్మయానికి గురి చేసింది. షేమ్ ఇండియా అంటూ విరుచుకుపడుతున్నారు. ఒక పసిబిడ్డ తన అమ్మానాన్నల అభిమానాన్న, గౌరవాన్ని కాపాడిందంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు.
ఇదేనా మన డిజిటల్ ఇండియా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై యూపీ సర్కారు అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా స్పందించింది. మీడియాలో వస్తున్న వార్తలకు భిన్నంగా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయని పేర్కొంది. మరోవైపు బాధితుడు సునీల్ కూడా పోలీసుల చర్యను నిరసిస్తూ తామే నగ్నంగా మారి నిరసన తెలియ చేశామని తెలిపినట్టు తెలుస్తోంది.