70 మంది బాలికల బట్టలు విప్పించింది
- రక్తపు మరకలు ఎవరివో గుర్తించేందుకు వార్డెన్ దుశ్చర్య
- యూపీలోని కస్తూర్బా పాఠశాలలో దారుణం
ముజఫర్నగర్: సభ్యసమాజం తలదించుకునే సంఘటన యూపీలోని ఓ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో జరిగింది. అక్కడి హాస్టల్లోని మహిళా వార్డెన్ ఏకంగా 70 మంది విద్యార్థినులను వివస్త్రలను చేసి అనాగరికంగా ప్రవర్తించింది. తరగతి గదిలోనూ నగ్నంగా కూర్చోబెట్టింది. ముజఫర్నగర్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ పాఠశాల (కేజీబీవీ)లో గురువారం జరిగిందీ దారుణం. మరుగుదొడ్డిలో రక్తపు మరకలు ఉండటంతో వార్డెన్ కోపోద్రిక్తురాలైంది. ఎవరో ఓ విద్యార్థిని బహిష్టు అవ్వడమే అందుకు కారణమని అనుమానిస్తూ, ఆ బాలిక ఎవరో కనుగొనేందుకు మొత్తం అందరి చేత దుస్తులు విప్పించి పరీక్షించింది.
తరగతులకు వెళ్లేటప్పుడూ బట్టలు తొడుక్కునేందుకు అనుమతించలేదు. తాను చెప్పినట్లు వినకపోతే దారుణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించినట్లు సమాచారం. ఘటనపై ఓ విద్యార్థిని మాట్లాడుతూ ‘ఆ సమయంలో అక్కడ టీచర్లు లేరు. మమ్మల్ని కిందకు రమ్మని పిలిచింది. మమ్మల్ని అందరినీ బట్టలు విప్పేయమని చెప్పింది. లేకపోతే కొడతానంది. మేం పిల్లలం. ఏం చేయగలం? ఆమె మాట వినకపోతే మమ్మల్ని చితకబాదేది’అని వాపోయింది. విషయం తెలుసుకున్న బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వార్డెన్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. ‘నేను చాలా కఠినంగా ఉంటాను. నన్ను ఇక్కడి నుంచి పంపించివేయడానికి నాపై కుట్రపన్నారు. బట్టలు విప్పేయమని నేను చెప్పలేదు’అని వార్డెన్ తన వాదన వినిపించారు. కాగా, ఇప్పటికే 35 మంది విద్యార్థినులు పాఠశాల వదిలి వెళ్లిపోయారు.