strong letter
-
రైల్వే ఘనకార్యం! మూడు రోజుల్లో రిటైరయ్యే ఉద్యోగి బదిలీ
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ డివిజన్‌కు చెందిన ఒక సీనియర్ ఇంజనీర్ విషయంలో రైల్వేబోర్డ్ ఘనకార్యం చేసింది. మరో మూడు రోజుల్లో రిటైరవుతున్న కేపీ ఆర్యను ఢిల్లీలోని నార్తర్న్ రైల్వే జోన్‌కు బదిలీ చేసింది. ఖంగుతిన్న ఆయన బదిలీపై నిరాశను వ్యక్తం చేస్తూ రైల్వే బోర్డు సెక్రటరీకి ఘాటు లేఖ రాశారు. బదిలీ ఆర్డర్‌ను ఆయన బుద్ధిలేని పనిగా పేర్కొన్నారు. బదిలీ ఉత్తర్వు ప్రకారం కేపీ ఆర్య నవంబర్ 28న హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ పోస్ట్‌పై నార్తర్న్ రైల్వేలో చేరాల్సి ఉంది. అయితే ఆయన పదవీ విరమణ నవంబర్ 30న ఉంది. ఈ ఆర్డర్ పైకి బాగానే మూడు రోజుల్లో రిటైరవుతున్న తనను బదిలీ చేయడంలో పిచ్చితనమే కనిపిస్తోందని ఆర్య అన్నారు. ఇది జీవితమంతా ఇండియన్ రైల్వే సంస్థకు సేవ చేసిన ఒక ఉద్యోగిని పదవీ విరమణ సమయంలో కావాలని బదిలీ చేయడమే తప్ప మరొకటి కాదు అన్నారు. దీని వల్ల పదవీ విరమణ సెటిల్మెంట్కు అంతరాయం ఏర్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్లో హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ పోస్ట్ ఖాళీగా ఉన్నప్పటికీ, రైల్వే బోర్డు తనను నార్తర్న్ రైల్వే జోన్లో ఖాళీగా ఉన్న పోస్ట్‌కు బదిలీ చేసిందని ఆర్య పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. పదవీ విరమణకు ముందు కేవలం మూడు రోజులు తాను న్యూఢిల్లీలోని నార్తర్న్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం రైల్వే శాఖ తనకు దాదాపు రూ. 3 లక్షలు చెల్లిస్తుందని, ఇది ప్రజాధనాన్ని పూర్తిగా వృధా చేయడమేనని ఆయన ఆక్షేపించారు. ఇది ప్రమోషనల్ ట్రాన్స్‌ఫర్‌గా చెబుతున్నప్పటికీ దీని వల్ల తనకు అదనపు ఆర్థిక ప్రయోజనాలేవీ అందించలేదని ఆర్య పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తనకు ఇప్పటికే ఆర్థిక ప్రయోజనాలకు అర్హత ఉన్నప్పటికీ తన పదోన్నతిని ఆరు నెలలు ఆలస్యం చేశారని ఆరోపించారు. -
అన్నయ్యా.. చరిత్ర ఎవ్వరినీ క్షమించదు!
- ఎన్నికల్లో 100 సీట్లైనా గెలవకుంటే బాధ్యుడివి నువ్వే - ఎస్పీ చీఫ్ ములాయంకు తమ్ముడు రాంగోపాల్ ఘాటులేఖ లక్నో: 'అన్నయ్యా.. కొడుకును కాదని నీకు ప్రీతిపాత్రుడైన తమ్ముణ్ణి(శివపాల్ యాదవ్‌ను)వెనకేసుకొస్తున్నావ్. మంచిది. వచ్చే ఎన్నికల్లో మన పార్టీ కనీసం 100 సీట్లు కూడా గెలుచుకోలేకపోతే దానికి బాధ్యుడివి నువ్వే. ఇంత చేస్తున్న నువ్వు అసలు చరిత్రను ఒక్కసారైనా పరికించావా? చరిత్ర.. చాలా క్రూరమైనది. ఏ ఒక్కరినీ క్షమించదు' అంటూ సమాజ్ వాది పార్టీ ముఖ్యనేత రాంగోపాల్ యాదవ్.. తన పెద్దన్న, పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కు శనివారం ఘాటు లేఖ రాశారు. 2017 ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ సీఎం అభ్యర్థి కాబోడంటూ ఇటీవల ములాయం చేసిన వ్యాఖ్యలపై రాంగోపాల్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. చాలా కాలంగా కొడుకు అఖిలేష్, తమ్ముడు శివపాల్ ల మధ్య నడుస్తోన్న ఆధిపత్య పోరును సమం చేయాలని ములాయం భావిస్తున్నారని, ఆ క్రమంలో పెద్దాయన తమ్ముడివైపు మొగ్గుతున్నారని రాంగోపాల్ యాదవ్ తన లేఖలో ఆక్షేపించారు. తన అద్భుతమైన పరిపాలనతో సీఎం అఖిలేష్ యూపీ ప్రజల మన్ననలు పొందారని, 2017 ఎన్నికల్లోనూ అఖిలేష్ నే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని, లేకుంటే దారుణమైన ఫలితాలు చవిచూడాల్సి వస్తుందని రాంగోపాల్ అభిప్రాయపడ్డారు. మొదటి నుంచి సోదరుడు శివపాల్ యాదవ్ ను వ్యతిరేకిస్తోన్న రాంగోపాల్ యాదవ్.. ఆధిపత్య పోరులో సీఎం అఖిలేష్ పక్షాన నిలబడ్డారు. ప్రస్తుతం అఖిలేష్ టీంలో ప్రధాన వ్యూహకర్త రాంగోపాలే. ఆధిపత్యం కోసం ఇప్పటిదాకా జరిగిన పోరులో అఖిలేష్ వర్గం ఏనాడూ పార్టీ సుప్రీం ములాయంను నేరుగా విమర్శించలేదు. ఇప్పుడా కొరత తీర్చుతూ రాంగోపాల్.. ములాయంపై ఘాటులేఖాస్త్రాన్ని సంధించారు. దీనిపై వైరిపక్షం స్పందించాల్సిఉంది.