శభాష్... స్ట్రాంగెస్ట్ మాన్!
ఆదర్శం
‘‘జైశంకర్ పని అయిపోయినట్లే’’ అనుకున్నారు అందరూ.
రెండు సంవత్సరాల క్రితం అతనికి జరిగిన ప్రమాదం చిన్నాచితకాది కాదు. వెంట్రుకవాసిలో మృత్యువు నుంచి బయటపడ్డాడు. చాలారోజులు ఆస్పత్రిలో బెడ్ మీద ఉండాల్సి వచ్చింది. ఒంటి మీద మొత్తం 42 ఫ్రాక్చర్లు! తాను యాక్సిడెంట్ నుంచి బయటపడిన రోజు తన అసలైన జన్మదినం అంటాడు ఢిల్లీకి చెందిన జైశంకర్.
‘‘మహా అయితే నడవగలడు. అంతకు మించి వేరే పనులు చేయడం కష్టం’’ అన్నారు వైద్యులు. అయితే వారి అంచనా తప్పని రుజువు కావడానికి ఎంతో కాలం పట్టలేదు.
యాక్సిడెంట్ జరిగిన ఆరునెలల తరువాత తనకు బాగా ఇష్టమైన వ్యాయామాలు చేయడం ప్రారంభించాడు.
నడవడమే కాదు...‘ఇండియాస్ స్ట్రాంగెస్ట్ మ్యాన్’ టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు. 70-90 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో రెండు బంగారు పతకాలు గెలుచుకున్నాడు.
‘‘శక్తి అంటే శారీరకశక్తి మాత్రమే కాదు. మానసిక, శారీరకశక్తుల సమన్వయం’’ అంటున్నాడు ఇరవెరైండు సంవత్సరాల జైశంకర్.
‘‘చాలామంది శక్తిమంతులకు తమ శక్తిని ఎలా వినియోగించుకోవాలి అనేదాని మీద సరైన అవగాహన ఉండదు’’ అంటున్న జైశంకర్ పాఠశాల విద్యార్థులకు రకరకాల వ్యాయామాలలో శిక్షణ ఇస్తున్నాడు.
‘‘శిక్షణ ఇవ్వడం అనేది ఒక కళ’’ అని నమ్ముతున్న జైశంకర్ ‘‘స్ట్రెంత్ ట్రైనింగ్ మీద అవగాహన పెంచడమే నా లక్ష్యం’’ అంటున్నాడు. ఆయన లక్ష్యాలలో మరొకటి ‘వరల్డ్స్ స్రాంగెస్ట్ మాన్’ టైటిల్ గెలుచుకోవడం.