తనివితీరా వాన
సాక్షి, విశాఖపట్నం: వేసవిని తలపించే ఎండలు.. తెల్లారేసరికే సెగలు కక్కే మండుటెండలు.. దానికి ఉక్కపోత తోడు.. వెరసి కొన్నాళ్లుగా నగర వాసులు నానా అవస్థలు పడుతున్నారు. వానాకాలంలో వేసవి తాపంతో అల్లాడిపోతున్నారు. సాధారణంకంటే నాలుగైదు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతల నమోదవుతుండడంతో మేఘాలు, చినుకుల జాడ ఎప్పుడా? అని ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో సోమవారం ఉదయం అనూహ్యంగా వాతావరణంలో మార్పు వచ్చింది. ఆకాశం మబ్బులు కమ్ముకుని మధ్యాహ్నానికల్లా చిరుజల్లులు కురవడం మొదలయింది. దీంతో ఇన్నాళ్లూ ఎండల తీవ్రతను చవి చూసిన జనానికి ఎంతో ఉపశమనం కలిగినట్టయింది. రాత్రి వరకు అడపాదడపా తేలికపాటి వర్షం కురిసింది. దీంతో ఇన్నాళ్లూ ఉక్కపోతతో ఇబ్బంది పడ్డవారికి చల్లబడ్డ వాతావరణం హాయినిచ్చింది. సోమవారం నగరంలో కురిసిన వర్షపాతం 2.5 సెం.మీలు నమోదయింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావమే ఈ పరిస్థితికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రానున్న రెండు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వీరు పేర్కొంటున్నారు.