ఇక బ్రిటన్లో చదువుకోవడం మనకు మరింత ఈజీ
న్యూఢిల్లీ: సంక్షోభంలోనూ కాస్త కలసిరావడం అంటే ఇదే! యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ తప్పుకోవడానికి అక్కడి పౌరులు ఓటు వేయడం వల్ల బ్రిటన్ స్టాక్ మార్కెట్ సహా పలు మార్కెట్లు పతనం అవడం, పౌండ్ మారక విలువ 31 ఏళ్లలో కనిష్ట స్థాయికి పడిపోవడం తెల్సిందే. ఈ పరిణామాల కారణంగా బ్రిటన్ పర్యాటక రంగం మరింత చౌకగా భారత్ లాంటి వర్ధమాన దేశాలకు అందుబాటులోకి రానుంది. పర్యవసానంగా భారత పర్యాటక సంస్థలు పరిఢవిల్లనున్నాయి. ఇక బ్రిటన్లో పర్యటించడం భారతీయులకు కలిసొచ్చే అదృష్టమని భారత్లోని పలు పర్యాటక సంస్థలు ఆనందిస్తున్నాయి.
పౌండ్ విలువ భారీగా పడిపోవడంతో బ్రిటన్ వెళ్లాలనుకునే భారతీయులకు ప్రయాణ చార్జీలు భారీగా తగ్గడమే కాకుండా పర్యాటక ప్రాంతాల్లో బస, భోజన వసతుల చార్జీలు కూడా భారీగా తగ్గుతాయని భారత పర్యాటక సంస్థలు భావిస్తున్నాయి. ఈ తాజా పరిణామాలు భారత విద్యార్థులకు కూడా ఇంతో కలిసొచ్చే అంశమని ఆర్థిక నిపుణులే చెబుతున్నారు. ఇప్పటి వరకు అమెరికా యూనివర్శిటీలవైపు మొగ్గుచూపుతున్న భారతీయ విద్యార్థులు ఇప్పుడు బ్రిటన్ యూనివర్శిటీలను ఆశ్రయిస్తారని వారు అంచనా వేస్తున్నారు. అందుకు కారణం అక్కడి యూనివర్శిటీల్లో విద్యార్థుల ఫీజులు గణనీయంగా పడిపోవడానికి ఆస్కారం ఉండడమేనని వారంటున్నారు.