ప్రేమికురాలి ప్రాణం తీసిన 'సంప్రదాయం'
బెంగళూరు : వేర్వేరు రాష్ట్రాలకు చెందిన యువతీయువకులు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులను సంప్రదించారు. పెద్దలు వారి పెళ్లికి అంగీకరించారు. అయితే ఏ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవాలన్న విషయంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి. పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. సంప్రదాయం విషయంలో ఎంతకూ ఇరు కుటుంబ సభ్యులు రాజీకాలేదు. దీంతో విరక్తి చెందిన ప్రేమికురాలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
స్థానిక వర్తూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బీహార్‌కు చెందిన నిమిషా (28) స్థానిక కుందనహళ్లిలోని పేయింగ్ గెస్ట్ (పీజీ)లో ఉంటోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెంది న దుర్గాప్రసాద్ ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్నాడు. వీరిద్దరూ మారతహళ్లి సమీపంలోని సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఈ విషయాన్ని ఇద్దరూ వారి కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. వివాహానికి ఇరు కుటుం బాల పెద్దలూ అంగీకరించారు.
అయితే పెళ్లి తెలుగు సంప్రదాయంలో చేయాలని దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు.. కాదు, కాదు బీహార్ సంప్రదాయంలోనే జరగాలని నిమిషా కుటుంబ సభ్యులు వాదనకు దిగారు. ఈ విషయంలో ఇరు కుటుంబాల వారు పట్టువీడకపోవడంతో సమస్య జఠిలమైంది. ఆఖరికి పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో నిమిషా జీవితంపై విరక్తి చెందింది. బుధవారం రాత్రి తన చిన్నాన్న రంజిత్‌కు ఫోన్ చేసి తన బాధను చెప్పుకుంది. సుమారు 15 నిమిషాల పాటు తన గోడును వెళ్లబోసుకుంది.
కొద్దిసేపు తర్వాత రంజిత్‌కు అనుమానం వచ్చి నిమిషాకు ఫోన్ చేశాడు. అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె నిద్రపోయి ఉంటుందని భావించాడు. గురువారం మళ్లీ నిమిషాకు రంజిత్ ఫోన్ చేశాడు. అప్పటికీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వెంటనే ఈ విషయాన్ని దుర్గాప్రసాద్ దృష్టికి తీసుకెళ్లాడు. అతను నిమిషా ఉంటున్న హాస్టల్‌కు రావడంతో ఆత్మహత్య విషయం వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.