అద్దె భవనాలే దిక్కు
మేడికొండూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వపరంగా వైద్యసేవలందించేందుకు గ్రామస్థాయిలో ఏర్పాటుచేసిన ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాలు కరువయ్యాయి. అద్దె భవనాల్లోనే కేంద్రాలు కొనసాగుతున్నాయి. మండలంలోని మేడికొండూరు, మందపాడు గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలుండగా.. వాటి పరిధిలో 11 ఉపకేంద్రాలున్నాయి. ఒక్క పాలడుగు గ్రామంలో మాత్రమే ఆరోగ్య ఉపకేంద్రానికి సొంత భవనం ఉంది.
పేరేచర్ల, విశదల, గుండ్లపాలెం, డోకిపర్రు, మంగళగిరిపాడు, కొర్రపాడు, జంగంగుంట్లపాలెం, వరగాని, సిరిపురం, యలవర్తిపాడు గ్రామాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాలన్నీ అద్దెభవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాల ప్రజలు అత్యవసర సమయాల్లో ప్రాథమిక చికిత్స నిమిత్తం సబ్సెంటర్లపైనే ఆధారపడుతుంటారు. మండలంలోని అన్ని గ్రామాల్లోనూ ఉప కేంద్రాలు సౌకర్యాలలేమితో కొట్టుమిట్టాడుతున్నాయి.
ఎన్నో ఇబ్బందులు... నిర్దేశిత రోజుల్లో టీకాల కార్యక్రమాన్ని గ్రామాల్లోని సబ్‌సెంటర్ల వద్ద నిర్వహించాల్సి ఉన్నా.. సౌకర్యాలు లేకపోవడంతో సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా టీకాలు వేస్తున్నారు. మండలంలోనే మేజర్ పంచాయతీ పేరేచర్లలో 20వేల మంది ఉన్నారు. వీరికి కూడా ఆరోగ్య ఉపకేంద్రమే దిక్కు. అది కూడా అద్దె భవనంలో కొనసాగుతోంది. అది కూడా కునారిల్లుతోంది. చిన్నపాటి వైద్యానికైనా స్థానికులు గుంటూరు వెళ్లాల్సి వస్తోంది.రాళ్ల క్వారీలు ఎక్కువగా ఉండటంతో నిత్యం ఏదో ఓ చోట ప్రమాదాలు వాటిల్లుతూనే ఉన్నాయి. వీరంతా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ప్రతి గ్రామంలోనూ అత్యవసర సేవల కోసం ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోంది. వైద్యం కోసం దూర ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఆయా పంచాయతీల ఆధ్వర్యంలో స్థలాలు కేటాయిస్తే పక్కా భవానాలు నిర్మిస్తామని వైద్య ఆరోగ్యశాఖాధికారులు హామీలు గుప్పిస్తున్నా అవి అమలుకు నోచుకోవడంలేదు. ప్రజలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ప్రశాంత, పరిశుభ్ర వాతావరణంలో ఆరోగ్యకేంద్రాలు ఉంటే ప్రజలకు సురక్షిత సేవలు అందే అవకాశముంటుందని, అందుకు అనుగుణంగా సబ్‌సెంటర్లకు శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది స్పందించాల్సి ఉంది.