ఆన్లైన్లో ఆర్టీఏ సేవలు
సబ్ కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్
మీసేవ, ఈ సేవ నిర్వాహకులకు అవగాహన
ఆసిఫాబాద్ : మోటారు వాహనదారుల సౌలభ్యం కోసం ఇక నుంచి రవాణా శాఖ సేవలు పూర్తి స్థాయిలో ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు సబ్ కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఆసిఫాబాద్ ఎంవీఐ పరిధిలోని 12 మండలాలకు చెందిన మీసేవ, ఈ సేవ నిర్వాహకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 2 నుంచి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
ఎంవీఐ శ్యాంనాయక్ మాట్లాడుతూ రవాణా శాఖ ద్వారా 56 రకాల సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వాహనదారులు మీసేవ, ఈ సేవల ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీ, లైసెన్స్‌లు, అంతర్జాతీయ డ్రై వింగ్ లైసెన్స్‌లు, డూప్లికేట్ లైసెన్స్‌లు, రెన్యూవల్ తదితర సేవలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. లైసెన్స్‌ల జారీ సమయంలో వాహనాల డ్రై వింగ్ పరీక్ష కార్యాలయంలో నిర్వహిస్తామని తెలిపారు. టెక్నికల్ సపోర్టింగ్ ఇంజినీర్(టీఎస్ఈ) ఎండీ రఫి ఆన్లైన్ సేవలపై ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది సంతోశ్, మీసేవ, ఈ సేవ నిర్వాహకులు పాల్గొన్నారు.