రగిలిన తుందుర్రు
♦ భీమవరం మండలంలో ఆక్వాపార్క్ పనులపై ఆందోళన
♦ అడ్డుకునేందుకు వేలాదిగా తరలి వచ్చిన జనం
♦ లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు.. ఐదుగురికి తీవ్ర గాయాలు..
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం తీవ్రతరమైంది. జల, వాయు, భూ కాలుష్యాన్ని వెదజల్లే ఈ మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ వివిధ గ్రామాల ప్రజలు శుక్రవారం ఫుడ్ పార్క్ నిర్మాణ ప్రాంతం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగగా.. వారిపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. లాఠీచార్జిలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. పలువురికి స్వల్పగాయాలయ్యాయి. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లురువ్వారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది.
పూర్వాపరాలివీ..
తుందుర్రు గ్రామంలో రూ.150 కోట్ల వ్యయంతో ప్రైవేటు యాజమాన్యం ఆధ్వర్యంలో గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ పేరిట ఆక్వా ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పరిశ్రమలో రొయ్యల్ని ప్రాసెసింగ్ చేసేందుకోసం టన్నులకొద్దీ రసాయనాల్ని వినియోగించాల్సి ఉం డటంతో.. దానివల్ల భీమవరం, వీరవాసరం, నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని పలుగ్రామాల్లో జల, వాయు, భూకాలుష్యం ఏర్పడుతుం దని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆక్వా ఫుడ్‌పార్కు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఉద్యమం చేపట్టారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ ఉద్యమం సాగుతోంది. సీపీఎం, సీపీఐసహా పలు పార్టీలతోపాటు వివిధ ప్రజా సంఘాలు దీనికి మద్దతు ప్రకటించాయి. అయితే ఉద్యమాలు కొనసాగుతున్నా పార్క్ నిర్మాణ పనులు యథాతథంగా సాగుతున్నాయి.
తాత్కాలికంగా ఆందోళన విరమణ
ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న నరసాపురం సబ్ కలెక్టర్ దినేష్‌కుమార్, డీఐజీ కె.హరిబాబులు ఆందోళనకారులు, పార్క్ యాజమాన్య ప్రతినిధులతో చర్చలు జరిపారు. పార్క్ నిర్మాణాన్ని ఎట్టిపరిస్థితుల్లో నిలిపేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేయగా, తమకు అన్ని అనుమతులున్నాయని యాజమాన్య ప్రతినిధి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. దీంతో పోరాట కమిటీ ప్రతినిధులు, యాజమాన్య పెద్దలతో నరసాపురంలోని తన కార్యాలయంలో శనివారం చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తానని సబ్‌కలెక్టర్ దినేష్‌కుమార్ హామీ ఇచ్చి ఆందోళనకారుల్ని శాంతింప చేశారు. ఆందోళనకారులు తాత్కాలికంగా ఆందోళనను విరమించారు.ఈ నేపథ్యంలో తాత్కాలికంగా పనుల్ని నిలిపివేస్తున్నట్టు పార్కు యాజమాన్యం తెలిపింది.
ఆందోళనకారులపై విరిగిన లాఠీ
ఈ నేపథ్యంలో పార్కు వ్యతిరేక పోరాట కమిటీ, సీపీఎం ఆధ్వర్యంలో తుందుర్రు, జొన్నలగరువు, పెదగరువు, కె.బేతపూడి, మత్య్సపురి, శేరేపాలెం తదితర గ్రామాలకు చెందిన వేలాదిమంది ప్రజలు ర్యాలీగా తుందుర్రు చేరుకున్నారు. పార్కు నిర్మించి తమ గ్రామాల్ని కాలుష్యంలో ముంచొద్దని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పార్కు పనుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ పెద్దఎత్తున మోహరించిన పోలీసులు ఆందోళనకారుల్ని అడ్డుకునేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే ఆందోళనకారులు వాటిని తొలగించి లోనికెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఆందోళనకారులపై విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. ఫలితంగా ఐదుగురు గాయపడ్డారు. దారం గాంధీ అనే వ్యక్తికి తలపై తీవ్రగాయమైంది. పోతురాజు సూర్యకుమారి, తంపాకులు వెంకటల క్ష్మి, గూడపాటి శాంతికుమారి, తాడి సువార్త అనే మహిళలకూ తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కోపోద్రిక్తులైన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత రణరంగంగా మారింది.