ఈవీఎంలో అభ్యర్థుల వివరాల నమోదు ప్రారంభం
న్యూస్‌లైన్, మంచిర్యాల టౌన్, పురపాలక ఎన్నికలకు సంబంధించి ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లు మంచిర్యాలకు చేరుకున్నాయి. జిల్లా కేంద్రం నుంచి సోమవారం రాత్రి మంచిర్యాలకు రాగా స్థానిక కాలేజ్‌రోడ్‌లోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో భధ్రపరిచారు. మంగళవారం నుంచి పట్టణంలోని 32 వార్డులకు.. 66 పోలింగ్ కేంద్రాలు ఉండగా 66 ఈవీఎంలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఒక్కో వార్డుకు సంబంధించి వార్డు నంబర్, బూత్ నంబర్, వార్డులో ఒక కౌన్సిలర్ స్థానం, స్థానానికి పోటీ అభ్యర్థుల సంఖ్య తదితర వివరాలను ఈవీఎంలలో నమోదు చేస్తున్నారు.
ఉప జిల్లా ఎన్నికల అధికారి, మంచిర్యాల ఆర్డీవో జి.చక్రధర్‌రావు, సహాయ ఎన్నికల అధికారి, తహశీల్దార్ అశోకచక్రవర్తి, ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ తేజావత్ వెంకన్న ఆధ్వర్యంలో ఈవీఎంలలో బ్యాలెట్ వివరాల నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. వివరాలను నమోదు చేసిన అనంతరం ఈవీఎం మాస్టర్ ట్రైనర్స్ చంద్రన్‌కుమార్, సీహెచ్ ప్రభాకర్ ఈవీఎంలలో నమోదు చేసిన వివరాలను పరిశీలించి లాక్ చేస్తున్నారు. మంగళవారం సాయంత్ర వరకు 15 వార్డులకు సంబంధించి పోటీ అభ్యర్థులు, గుర్తులు తదితర వివరాలను నమోదు చేశారు.