సబ్‌డివిజనల్ అధికారి వసూళ్ల దందా
అక్రమార్జనకు కొత్త పంథా
వసూళ్లకు ప్రత్యేక వ్యవస్థ
ప్రతి మండలంలో సొంత దూత
తహశీల్దార్ల కదలికలపై నిఘా
కాసులు కురిపిస్తున్న చెరువులు, పాస్‌పుస్తకాలు, భూ బదలాయింపులు
ముందు హడావుడి..
ఆపై బంగ్లాలోనే సెటిల్మెంట్లు
సాక్షి, మచిలీపట్నం :
అక్రమ వసూళ్లకు ఆయన కొత్త మార్గాలు కనిపెట్టారు.. ప్రతి మండలంలోను సొంత దూతలను ఏర్పాటు చేసుకున్నారు.. తహశీల్దార్ల కదలికలపై నిఘాతో పాటు ఆయా మండలాల్లో అక్రమార్జనకు మధ్యవర్తులతో ప్రత్యేక నెట్‌వర్క్‌ను సైతం నడుపుతున్నారు.. ఇవి జిల్లాలోని ఒక సబ్‌డివిజనల్ అధికారి ఆగడాలు. విధి నిర్వహణ తప్ప ఎవరినీ పట్టించుకోనట్టు వ్యవహరించే ఆయన తెరవెనుక నడుపుతున్న వసూళ్ల దందాపై ‘రెవెన్యూ’ వర్గాలు సైతం తిట్టిపోస్తున్నాయి. ఆయన అక్రమార్జన లీలలు ఇటీవల గుప్పుమనడంతో రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారాయి.
అడుగడుగునా దూతలు...
ఒక మండల తహశీల్దార్ కార్యాలయంలో సూపరింటెండెంట్, ఇంకో మండలంలో ఆర్ఐ, మరో మండలంలో సర్వేయర్, ఇంకో చోట తహశీల్దార్ కార్డ్రైవర్ ఇలా తన పరిధిలోని అన్ని మండలాల్లోను సొంత మనుషులను దూతలుగా పెట్టుకున్నారాయన. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా మండలాల్లోని తహశీల్దార్లు ఏం చేస్తున్నారు.. వారిని ఎవరెవరు కలుస్తున్నారు.. ఎంత చక్కబెట్టుకుంటున్నారు.. వారి కదలికలు ఏమిటి.. కాసులు కూడబెట్టే మార్గాలు ఏమున్నాయ్.. వంటి కోణాల్లో నిఘా పెట్టే సొంత దూతలు ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఆ అధికారికి చేరవేస్తున్నారు. సమాచారం అందుకున్న సదరు అధికారి వెంటనే రంగంలోకి దిగి తహశీల్దార్లపై ‘మీ సంగతి తేలుస్తా’నంటూ చిందులు తొక్కి ఆయా మండలాల్లో జరిగిన అక్రమాలపై దృష్టిసారిస్తారు. చెరువులు తవ్వుతుండగా చోద్యం చూసే మండల స్థాయి దూతలు చెరువుల తవ్వకం జరిగే సమయంలో ‘సార్’కు సమాచారం అందిస్తారు. ఆయన అక్కడికి వెళ్లి హడావుడి చేసి వస్తారు. అటు తరువాత కంగారుపడిన చెరువులు యజమానులు దూతల సాయంతో సార్‌ను కలిసేందుకు ఆయన బంగ్లాకు వస్తారు.
డీల్ కుదిరితే.. చెరువుల తవ్వకాలకు ఓకే...
ప్రధానంగా చేపల చెరువులు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, భూ బదలాయింపులు వంటి కీలకమైన వాటిపై ఆ అధికారి దృష్టిసారించారు. తన అక్రమార్జనకు వాటిని అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఆయనకు అందుబాటులో ఉండే ఒక తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఇద్దరు ఆర్ఐలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఒక ఆర్ఐ చేపల చెరువుల తవ్వకాలు, మరో ఆర్ఐ ఇతర సమాచారం అందించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో పాటు ప్రతి మండల తహశీల్దార్ కార్యాలయంలోను సొంత దూతల ద్వారా ఆయా మండలాల్లో ఆదాయ మార్గాలపై దృష్టి సారించారు. ఆయన పరిధిలో అక్రమ చెరువుల తవ్వకానికి ఎకరానికి కనీసం రూ.10 వేలు ముట్టచెబితేగానీ శాంతించరు. రైతు సొంత భూమికి పట్టాదారు పాస్‌బుక్ ఇవ్వాలన్నా సొమ్ములు ఇచ్చుకోవాల్సిందే. ఒక్కో పాస్బుక్కు కనీసం రూ.5 వేలు నుంచి రూ.10 వేల వరకు సమర్పించుకోవాల్సిందే.
భూముల్లోనూ కాసులు పండిస్తున్నారు...
ఆయన పరిధిలోని భూములు చేతులు మారే వ్యవహారాల్లోను కాసులు పండుతున్నాయి. ఇటీవల ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక సంస్థకు భూసేకరణ చేసి ఇచ్చేలా ఆయన ఆఘమేఘాలపై స్పందించి పని చక్కబెట్టారు. భూముల బదలాయింపుల కోసం ఆయనతోపాటు మరో అధికారికి లక్షల్లో సొమ్ము ముట్టినట్టు ఆరోపణలు గుప్పుమన్నాయి. ఆ సంస్థకు భూములు అప్పగించే విషయంలో అత్యుత్సాహం చూపిన ఆ ఇద్దరు అధికారులు ప్రభుత్వం కేటాయించిన సొంత వాహనాలు వదిలి ప్రత్యేకంగా ప్రైవేటు సంస్థ సమకూర్చిన ఇన్నోవాలపై వెళ్లిరావడం గమనార్హం. సొంత ప్రయోజనాలను చక్కదిద్దుకోవడంలోనూ ఆయన ఎవరికీ అనుమానం రాకుండా ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించి కాసులు దండుకునేందుకు వెనుకాడకపోవడం కొసమెరుపు.