sub-divisions
-
‘ఎర్ర’దొంగలపై టాస్క్‘ఫోర్స్’
సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం అక్రమరవాణాపై జిల్లా ఎస్పీ కాంతిరాణా టాటా ఉక్కుపాదం మోపారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు చిత్తూరు కేంద్రంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులతో పాటు, జిల్లా పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. జిల్లాలో మదనపల్లె, పలమనేరు పోలీసు సబ్డివిజన్లలో ఎర్రచందనం కేసులు ఎక్కువగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. పీలేరు సర్కిల్లో ఈ కేసులు మరీ ఎక్కువగా ఉంటున్నాయి. చిత్తూరు కేంద్రంగా ఒకతను పెద్దఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నాడని టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఇతనికి కర్ణాటక, తమిళనాడులోని ఎర్రచంద నం స్మగ్లర్లతో ఎక్కువ సంబంధాలున్నట్లు తెలిసింది. పలుమార్లు ఇతనిపై ఎర్రచందనం కేసులు నమోదయినా పోలీసులకు దొరకలేదు. ఈ కీలక స్మగ్లర్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారణ చేపట్టారు. పాత స్మగ్లర్ల జాబితా బయటకు ఈ క్రమంలో ఎర్రచందనం పాత స్మగ్లర్ల జాబితాను టాస్క్‌ఫోర్స్ చీఫ్ ఉదయ్‌కుమార్ బయటకు తీయించారు. వీరందరూ ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉంటున్నారు, వీరి కి అటవీ సమీప ప్రాంతాల్లోని గ్రామాల్లో ఎవరెవరు సహకరిస్తున్నారనే దిశగా ప్రత్యేకంగా ఒక ఫైల్ సిద్ధం చేశారు. ఇలాంటివారిపై నిఘా పెట్టి వారిని పోలీసు ఇన్ఫార్మర్లుగా మార్చుకునేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. స్మగ్లర్ల అడ్డా బెంగళూరు రూరల్ బెంగళూరు రూరల్ జిల్లా హోస్కోట ప్రాంతంలోని కటికనహళ్లి అనే గ్రామం ఎర్రచందనం స్మగ్లర్లకు అడ్డాగా ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు, చిత్తూరు జిల్లా పోలీసులు గుర్తించారు. శేషాచల కొండల నుంచి తరలిస్తున్న ఎర్రచందనాన్ని ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్న గోడౌన్లలో ఉంచి అక్కడి నుంచి విదేశాలకు విక్రయించే వ్యాపారస్తులకు, బడా స్మగ్లర్లకు వీరు అందజేస్తున్నారు. ఇటీవల ఈ గ్రామానికి సంబంధించిన ఇద్దరు కీలక స్మగ్లర్లు ముక్తియార్, బాబును గంగవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కర్ణాటకలో టాస్క్‌ఫోర్స్ ఆపరేషన్ చేపట్టి కింగ్పిన్లుగా వ్యవహరిస్తున్న పెద్ద స్థాయి చేపలను వేటాడాలని పోలీసులు నిర్ణయించారు. మొత్తంమీద జిల్లా పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమరవాణాను అడ్డుకునేందుకు ఎస్పీ కాంతిరాణా టాటా పటిష్టంగా కేసులు నమోదు చేయిస్తున్నారు. మూడు రకాల వ్యూహం ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు మూడు రకాల వ్యూహంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముందుకు వెళుతున్నారు. మొదట అడవిలో ఎర్రచందనం చెట్లు నరికే దశలోనే కొట్టనీయకుండా తమిళనాడు కూలీలను అడ్డుకుని అరెస్టు చేసేందుకు దృష్టిసారించారు. రెండవ చర్యగా నరికిన ఎర్రచందనం రవాణాను మధ్యలోనే అడ్డుకుని స్వాధీనం చేసుకుంటున్నారు. మూడవ చర్యగా తమిళనాడు, కర్ణాటక కేంద్రంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న కింగ్పిన్లు, బడా స్మగ్లర్ల కేంద్రాలపై దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకునే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. తద్వారా ఎర్ర చందనం అక్రమ రవాణాను అరికడతామని పోలీసులు చెబుతున్నారు. -
రెండో రోజూ విద్యుత్ ఉద్యోగుల సమ్మె
సాక్షి, తిరుపతి: 72 గంటల సమ్మెలో భాగంగా జిల్లాలో ని విద్యుత్ ఉద్యోగులు రెండవ రోజు శుక్రవారం కూడా సమ్మెలో పాల్గొనడంతో సేవలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని 2,500 మంది ఉద్యోగులు వందశాతం సమ్మెలో పాల్గొన్నారు. వసూళ్లు, బిల్లులను రూపొందించే పని పూర్తిగా అటకెక్కింది. విద్యుత్ బ్రేక్డౌన్లను పునరుద్ధరించే పరిస్థితి లేకపోవటంతో ఉన్నతాధికారులు కూడా చేతులెత్తేయాల్సి వచ్చింది. తిరుపతి సర్కిల్లో తిరుపతి అర్బన్, రూరల్, శ్రీకాళహస్తి, రేణిగుంట, పుత్తూరు, పలమనేరు, చిత్తూరు, పుంగనూరు, మదనపల్లె, పీలేరు సబ్ డివిజన్లతో పాటు కార్యాలయాల్లో, సబ్ స్టేషన్ల లో ఉద్యోగులు విధులను బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. తిరుపతి డిస్కం కార్యాలయం ఎదుట జేఏసీ కన్వీనర్ డీఈ మునిశంకరయ్య, చైర్మన్ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో కార్పొరేట్, ఎస్ఈ కార్యాలయ ఉద్యోగులు, నగరంలోని ఏఈలు, లైన్మన్లు, కార్యాలయాల సిబ్బంది ధర్నా చేశారు. సమైక్య వాదాన్ని వినిపిస్తూ పాటలు పాడారు. జిల్లాలో ఎస్ఈ మినహా ఏ ఒక్కరూ విధులకు హాజరుకాకపోవడంతో విద్యుత్ శాఖ పరిపాలన పూర్తిగా స్తంభించింది. మాస్క్‌లతో నిరసన డిస్కం కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోనియాగాంధీ, కేసీఆర్, డిగ్గీరాజ, కోదండరాం, హరీశ్‌రావు మాస్క్‌లు ధరించి వారు ఏ రకంగా రాష్ట్ర విభజనకు కుట్ర పన్నారనేది వివరిస్తూ స్క్రిప్ట్‌తో నాటకం వేశారు. సోనియా, కేసీఆర్, డిగ్గీరాజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే నష్టపోయే రంగాల్లో ప్రధానంగా విద్యుత్ సంస్థ ఉందని పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరి సమ్మెకు ఏపీఎన్జీవోలు ఉద్యోగ సంఘం జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించారు. వారు సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసు నుంచి ర్యాలీగా ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం చేరుకున్నారు. అక్కడ విద్యుత్ ఉద్యోగులు నిర్వహిస్తున్న ఆందోళనలో పాల్గొని, సంఘీభావం తెలిపారు. ఫ్యూజ్కాల్స్పై సమ్మె ప్రభావం విద్యుత్ సమ్మెతో జిల్లా వ్యాప్తంగా ఫ్యూజ్‌కాల్స్ సర్వీసులు నిలిచి పోయాయి. ఈ ఫిర్యాదులు తీసుకునేవారు లేరు. జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లను మరమ్మతు చేసే నాథుడే లేడు. కాంట్రాక్టు ఉద్యోగులకు వీటి నిర్వహణ చేతగాకపోవటంతో సమ్మె ముగిసేవరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావం గృహ సర్వీసులకే కాకుండా హెచ్.టీ పారిశ్రామిక సర్వీసులు, వాణిజ్య, వ్యవసాయ సర్వీసుల నిర్వహణపైనా పడుతోంది.