స్త్రీ శక్తికి సిసలైన నిదర్శనందేవీ నవరాత్రులు
సృష్టి స్థితి లయ కారులని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పేరు. ఈ ముగ్గురూ ఆ మూడు పనులనూ చేస్తూ ఉన్నా, ఇలా చేయవలసిందంటూ ఆయా పనుల్ని వాళ్లకి అప్పజెప్పింది ఎవరు? అని ప్రశ్నించుకుంటే ఆదిశక్తే అనే సమాధానం వస్తుంది. గడియారంలో చిన్నముల్లూ పెద్దముల్లూ సెకన్ల ముల్లూ ఉన్నా, వీటిని నడిపే యంత్రం లేనిదే ఇవి ఎలా కేవలం బొమ్మ ముల్లులే అవుతాయో, అలా కాకుండా ఈ మూటికీ శక్తినిచ్చి నడిపిస్తూ కాలాన్ని గుర్తింపజేసేది అక్కడ ఎలా యంత్రమో, అదేతీరుగా ఈ త్రిమూర్తుల్నీ తమ తమ పనుల్ని నెరవేర్చేలా చేస్తూ యుగాలని నడిపిస్తున్న శక్తి ఆదిశక్తి మాత్రమే. స్త్రీకి ఇంత గొప్పదనాన్నిచ్చింది భారతదేశం మాత్రమే.
ఈ బ్రహ్మవిష్ణుమహేశ్వరులు మాత్రమే సృష్టిస్థితిలయాలని చేసేస్తున్నారా అంటే ఆ ముగ్గురికీ కూడా మళ్లీ విలువ, అస్తిత్వం ఆధిక్యమనేవి తమ తమ భార్యల వల్లనే. బ్రహ్మకి ఓ ఆకారం అంటూ లేకపోయినా ఆయన గుర్తింపు కేవలం ఆయన నోట దాగిన ఆ సరస్వతి కారణంగానే. ఆకారం ఎలా ఉన్నా, ఏ లౌకికమైన పట్టాలూ లేకున్నా చదువు ద్వారానే వ్యక్తికి విలువ కదా! పండితుడైనవానికి ఈ దేశం ఆ దేశం ఈ భాషా ఆ భాషా అనే పరిమితి ఉండదు కదా!! అదేతీరుగా శ్రీహరికి గుర్తింపూ విలువా లక్ష్మీదేవి వల్లనే. శ్రీవేంకటేశ్వరుడు కన్పించేది కూడా ఎనలేని విలువైన ఐశ్వర్యం వెనుకనే. ఆయన్ని భక్తజనం కొలిచేది కూడా ఐశ్వర్యం అంటే అది పదవికి సంబంధించి జీవితానికి సంబంధించి లేదా ధనానికి సంబంధించిన వాటికోసం మాత్రమే.
ఇక శంకరునికున్న ఏ మాత్రపు గుర్తింపు అయినా పార్వతి కారణంగానే. శక్తి లేని శివుడు నిరర్థకుడు. ఏ ప్రయోజనాన్నీ చేకూర్చలేడట. అందుకే అర్ధనారీశ్వర రూపంలో ఆయన ఉన్నాడు. కేవలం తమ తమ భార్యల ద్వారా గుర్తింపు ఈ త్రిమూర్తులకీ ఉండడమే కాదు– తమ తమ భర్తలకు కష్టం వచ్చినప్పుడు రక్షించి ఒడ్డెక్కించింది కూడా తమ తమ భార్యలే.
నోటిలో నాలుక మీద ఉంటూ బ్రహ్మ నుండి ఎప్పుడూ ఎడబాయనిది సరస్వతి అవుతుంటే, వక్షస్థలాన్ని దిగకుండా తానున్న చోటుని ఆనమాలుగా అయ్యేలా చేసుకుని శ్రీ లక్ష్మి ఉంటుందనేందుకు వత్సం– గుర్తుగా ఏర్పడిన ఓ మచ్చ /ఆనమాలు ఉండేది లక్ష్మి అవుతుంటే, ఇక శరీరాన్నే నిండుగా చెరిసగంగా చేసుకుని ఎడమవైపున ఉంటున్నది పార్వతి. ఈ త్రి శక్తి దేవతల సమష్టి పండగే విజయ దశమి.
కాబట్టి స్త్రీలో వాక్ శక్తీ– ఐశ్వర్య శక్తీ– సాహస శక్తీ అనే మూడూ ఉంటాయనీ, వీటిని అభివృద్ధి చేసుకోగలగడమే నిజమైన స్త్రీ శక్తిని చాటడం ఔతుందనీ– స్త్రీ తన పాండిత్యాన్ని నేడు చూపగలుగుతోందంటే, ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించగలుగుతోందంటే, తన పరాక్రమాన్ని కూడా అవసరమైన పక్షంలో ప్రదర్శించగలుగుతోందంటే అదంతా ఆ అమ్మ తనకి గూఢంగా నిక్షిప్తం చేసిన ఆ శక్తి కారణంగానే అని గ్రహించుకోవాలి ప్రతి స్త్రీ. లేదా ఆమెని మార్గదర్శకురాలిగానైనా భావించుకోవాలి.
పండుగ ఇన్ని రోజులపాటా?
స్త్రీకున్న గొప్పదనాన్ని లోకానికి చాటాలని భావించిన మహర్షులు అమ్మవారి పండుగ రోజుల్ని 9 కాదు 39 రోజులపాటు చేయాలని చెప్పారు. అలా సంవత్సరం తలుపు తెరుచుకుందో లేదో ఆ రోజునే వచ్చే ఉగాది నుండి శ్రీరామ నవమి వరకూ అమ్మవారి పేరిట ఆ వసంత రుతువులో జరిగే 9 రోజుల ఉత్సవాలనీ వసంత నవరాత్రోత్సవాలని అంటారు. ఇవి 9.
ఇక శరత్కాలం ప్రారంభమయే ఆశ్వయుజ మాసం మొత్తం నెలంతా ఈ త్రి శక్తి దేవతల పండుగరోజులే. ఇవి 30. ఆ తొమ్మిదికీ ఈ ముప్ఫైరోజుల్నీ కలిపితే అమ్మవారికి జరిగే ఉత్సవాల రోజులు 39 అన్నమాట. ఒక స్త్రీకి ఇంతటి గౌరవాన్నీ–ఇన్ని రోజులపాటు ఉత్సవాల్నీ చేయాలని చెప్పిన దేశం– ప్రపంచ దేశాల్లో భారతదేశం మాత్రమే. అందుకే భారతదేశం స్త్రీని దేవత అంది– స్త్రీని ఓ దేవతగా చేసింది. ప్రతి ఒక్క స్త్రీనీ ఆ అమ్మ స్వరూపంగా భావిస్తూ సంబోధనలో కూడా అమ్మా అనవలసిందని చెప్పింది. మన పిలుపుల్లో అమ్మా! బంగారు తల్లీ! బుజ్జీ, కన్నతల్లీ! చిట్టితల్లీ, వరాలతల్లీ అనేవి ఇందుకే కనిపిస్తాయి.
9 రాత్రుల పండుగ ఏమిటి?
విజయదశమిని స్త్రీలకి సంబంధించిన పండుగ అని అనుకున్నాం కదా! లోకంలో ప్రతి స్త్రీ కూడా తొమ్మిది నెలల పాటు రాత్రిలా గడిపి పదవ నెలలో పండంటి బిడ్డని కని ఈ రాత్రితో పోల్చబడిన కష్టమంతటినీ ఆ బిడ్డణ్ణి చూస్తూనే మర్చిపోతుంది. దేవత అయిన అమ్మ కూడా పైన అనుకున్న రాక్షసులే కాక ఇతరులు కూడా తన సంతానాన్ని చంపెయ్యబోతుంటే అనుక్షణం రెండుకళ్లతోనూ పరిశీలిస్తూ మొత్తం రాక్షసుల్ని ఈ 9 రాత్రుల్లో వధించగలిగింది. రాక్షసులకి బలం నిలిచి ఉండేది రాత్రివేళల్లోనే కాబట్టి అమ్మకి కూడా రాత్రిపూటే యుద్ధం అనివార్యమౌతుండేది. అలా వధించి వధించి 10వనాటి ఉదయానికి సర్వ రాక్షస వధా ముగిసిపోయి ఆమె విజయాన్ని సాధించిన కారణంగా ఇది విజయ దశమి ఔతోంది.
ఇక్కడ మరో రహస్యమూ ఉంది. సాధారణంగా దేవతలు అని మనకి వినపడగానే అలా శపించేసి చంపేస్తారని అనుకుంటాం! ఈ నవరాత్ర విజయం అలాంటిది కానే కాదు. అమ్మ తన తోటి దేవతలందరి దగ్గరా ఆయుధాల్ని (తమ తమ దేవతా శక్తుల్ని నిక్షిప్తం చేసి ఉంచిన ఆయుధాల్ని) తీసుకుని వాటితోనే వధించింది– వధించగలిగిందంటే ఏ వ్యక్తీ కూడా ఒంటరిగా తనకు తానుగా అందరి మీద విజయానికి ప్రయత్నించడం సరికాదనీ– ఎంతటి వారైనా తోటివారి సహాయాన్ని స్వీకరించాలనీ అది తక్కువదనం కానేకాబోదనీ తెలియజేస్తోందన్న మాట అమ్మ.
అనుగ్రహ రహస్యం అదే!
ఈరోజు మంచిదేనా? లేకపోతే ఏ రోజైతే బాగుంటుందని మనం అడుగుతుంటాం ఇంటి పురోహితుల్ని. అమ్మ తనని మూడురూపాలుగా చేసుకుని ఆ మూడు శక్తి దేవతల అనుగ్రహానికీ ఏ రోజులు మంచివో తానే తెలియజేస్తోంది. అశ్వని నక్షత్రం పూర్ణిమనాడుండే ఆశ్వయుజ మాసం సరస్వతి– లక్ష్మి– పార్వతి అనే ముగ్గురు దేవతలనీ ప్రసన్నం చేసుకోవడానికి అనుకూలం. ఈ నెలలో కూడా మొదటి రోజునుండి ఆరవ రోజున మూలా నక్షత్రం ఉంటుంది కాలచ్రంలో. ఆ రోజున సరస్వతిని ఆరాధించడం అత్యుత్తమమని ఆ తల్లి చెప్తుంది. దీంతో త్రిమూర్తుల్లో మొదటివాడైన బ్రహ్మ భార్యకి పూజ అయిపోయింది.
ఇక త్రిమూర్తుల్లో మూడవ వాడైన శంకరుని భార్య పార్వతీదేవిని ఆరాధించడానికి పదవరోజు అంటే విజయ దశమి అనుకూలమని చెప్తుంది కాలచక్రం. దాంతో శంకర పత్నికి పూజ ముగిసింది. ఇక త్రిమూర్తుల్లో రెండవవాడైన శ్రీహరిభార్య లక్ష్మి మాత్రం మిగిలింది. ఈమెని ఆశ్వయుజమాసం చివరిరోజైన అమావాస్యనాడు పూజించాలి. ఆ అమావాస్యరోజునే దీపావళి అమావాస్య అంటారు. ఇలా ముగ్గురు దేవతలకీ మూడు విభిన్నమైన రోజుల్లో ముగ్గురి పేరా ఒకేనెలలో పూజని చేస్తూ ముగ్గురి అనుగ్రహాన్నీ ఒకేసారి పొందగలగడం ఎంత అదృష్టం!
చివరగా ఓ మాట!
పాడ్యమి నుండి విజయ దశమి వరకూ అంటే పదిరోజుల్లోనూ మొత్తం మీద 108 మార్లు లలితా సహస్రనామ స్తోత్రాన్ని అలా పారాయణ చేస్తూ ప్రతిరోజూ ఒక్కమారు చొప్పున ఈ సహస్రనామాలతో అలా పూజ చేస్తే ఈ విజయ దశమి మన పాలిట నిజమైన విజయాన్నిచ్చే దశమి ఔతుంది. ఇప్పటికే కొద్దిరోజులు గడిచాయి కాబట్టి తక్కువలో తక్కువగా కనీసం 27 మార్లు లలితా సహస్రనామ పారాయణ చేసినా... ఫలప్రదమే.
– ఎం.సుబ్బలక్ష్మి