ఆచంట శిగలో ఆకుపచ్చని వరి!
రసాయనిక ఎరువులు, పురుగుమందులు లేకుండా...
కరువు కాటకాల్లోనూ మంచి దిగుబడులనిచ్చే దేశవాళీ వరి వంగడాలు కొత్త ఏడాదిలో అందుబాటులోకి రానున్న సంగతులు గత వారం ‘సాగుబడి’లో చదువుకున్నాం. ఆ విశిష్ట వంగడాలు ఫిలిప్పీన్స్లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఐఆర్ఆర్ఐ) నుంచి ప.గో. జిల్లా ఆచంట ముంగిటకు ఇంతకుముందే చేరుకున్నాయి. ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త నెక్కంటి సుబ్బారావు ట్రేలలో నారును అపురూపంగా పెంచుతున్నారు. ప్రత్యేక మడుల్లో రేపో మాపో ఊడ్చబోతున్నారు. ఐఆర్ఆర్ఐ లో ఈ వంగడాల సాగు వైభవాన్ని కొద్ది నెలల క్రితమే ప్రత్యక్షంగా చూసొచ్చిన రైతు ఆయనొక్కరే కావడం విశేషం. ‘సాక్షి’కి ఆయన వెల్లడించిన వివరాలు.. మీ కోసం..
ఆచంట.. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక గ్రామం. అంతేకదా.. అనుకునేరు. వరి సాగులో ప్రపంచస్థాయి రికార్డులను బద్దలుకొట్టిన ఊరు ఆచంట. దానికి మూలపురుషుడు నెక్కంటి సుబ్బారావు అనే రైతు శాస్త్రవేత్త. ఎస్సెస్సెల్సీ పూర్తి చేసి 1967లో పూర్తిస్థాయిలో వ్యవసాయ వృత్తిని చేపట్టిన యువ రైతు సుబ్బారావు తొలి హరిత విప్లవ కాలం నుంచి మొదలుకొని.. ఇప్పటి వరకు విత్తనోత్పత్తిలో అందెవేసిన చేయి ఆయనదే. వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, అరటి సాగులో తనదైన సరికొత్త ఒరవడిని నెలకొల్పి.. సాగు విజ్ఞానపు వెలుగులు పంచిన రైతు శాస్త్రవేత్తగా సుబ్బారావు ఎదిగారు. సాగును కొత్త పుంతలు తొక్కించాలనుకునే చైతన్యవంతుడైన రైతుకు మేలైన విత్తనమే వజ్రాయుధమంటారాయన. 1967 నాటి ఐఆర్8 వరి వంగడం దగ్గరి నుంచి.. ఇప్పటి ‘గ్రీన్ సూపర్ రైస్’ వరకు అద్భుతమైన వంగడం ఏదైనా ఆయన చేతుల మీదుగానే రైతుల పొలాల్లోకి రావాల్సిందే. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలలోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ(ఐఆర్ఆర్ఐ)తోపాటు దేశీయ పరిశోధనా సంస్థలకూ ఆయనపై ఉన్న గురి అలాంటిది. సృజనాత్మక రైతుగా అహరహం తపించే తత్వమే సుబ్బారావుకు గుర్తింపును తెచ్చిపెట్టింది.
ఎరువులతో 18 బస్తాలు.. ఎరువుల్లేకుండా 40 బస్తాలు: 1967లో ఐఆర్8 వరి వంగడాన్ని ఐఆర్ఆర్ఐ శాస్త్రవేత్తలు ఆచంట వచ్చి.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేసి సాగు చేశారు. తీరా ఎకరానికి వచ్చిన దిగుబడి కేవలం 18 బస్తాలు! మిగిలిపోయిన నారుతో 10 సెంట్లలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు అసలు వాడకుండా సుబ్బారావు నాట్లు వేయగా 4 బస్తాల(ఎకరానికి 40 బస్తాల చొప్పున) దిగుబడి వచ్చింది! సారవంతమైన డెల్టా భూముల్లో రసాయనిక ఎరువుల అవసరమే లేదనే విషయం తెలియక, దాళ్వాలో ఊడ్చాల్సిన ఐఆర్8 వంగడాన్ని సార్వాలో ఊడ్చటం ద్వారా.. అప్పట్లో శాస్త్రవేత్తలు పప్పులోకాలేశారన్నమాట. ఆ నమ్మకంతో సుబ్బారావు ఆధ్వర్యంలో దాళ్వాలో వెయ్యి ఎకరాల్లో ఐఆర్8 వంగడాన్ని రైతులు విజయవంతంగా అధిక దిగుబడి తీశారు. సగటున ఎకరానికి 40 బస్తాలు దిగుబడి వస్తే, సుబ్బారావుకు 46 బస్తాల దిగుబడి వచ్చింది! అప్పటికి అదే కళ్లు చెదిరే రికార్డుకావడంతో ఆచంట పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది! ఆ తర్వాత ఎన్నో రికార్డులు.. అవార్డులు.. ఆచంటను, సుబ్బారావును వెతుక్కుంటూ వచ్చాయి.
సుబ్బారావు చేతికి ‘గ్రీన్’ వంగడాలు!
వరి వంగడాల పరిశోధనపై అమితాసక్తి కలిగిన సుబ్బారావుకు ఐఆర్8 నాటి కాలం నుంచే ఐఆర్ఆర్ఐతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో 2014 అక్టోబర్లో రైతుల దినోత్సవం సందర్భంగా సుబ్బారావు ఫిలిప్పీన్స్లోని ఐఆర్ఆర్ఐని సందర్శించారు. వివిధ దేశాల నుంచి 200 మంది అభ్యుదయ రైతులు ఈ కార్రక్రమంలో పాల్గొన్నారు. ‘గ్రీన్ సూపర్ రైస్’ గురించి తనకు అప్పుడే తొలిసారి తెలిసిందన్నారాయన. తెలుగు శాస్త్రవేత్తయిన డాక్టర్ జవహర్ ఆలి సారథ్యంలో ఐఆర్ఆర్ఐలో గ్రీన్ సూపర్ రైస్ పరిశోధనలు పదిహేనేళ్లుగా కొనసాగుతున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందులు లేకుండా.. కరువు కాలంలోనూ సగటుకన్నా అధిక దిగుబడినిచ్చే సూటి వంగడాల రూపకల్పనే ఈ ప్రాజెక్టు విశిష్టత. డా. ఆలి ఆహ్వానం మేరకు ఐఆర్ఆర్ఐ ప్రాంగణంలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న గ్రీన్ సూపర్ రైస్ పొలాన్ని సుబ్బారావు ఒక్కరే స్వయంగా చూసి.. ఉత్తేజితులయ్యారు. దేశ విదేశాల్లోని పరిశోధనా స్థానాల్లో గ్రీన్ సూపర్ రైస్ వంగడాలు హెక్టారుకు 12 టన్నుల వరకు దిగుబడినిచ్చాయని చెబుతున్నారు. ఇక రైతులతో ప్రయోగాత్మకంగా సాగు చేయించడానికి ఐఆర్ఆర్ఐ శ్రీకారం చుట్టింది. ఇప్పటికున్న సమాచారం మేరకు.. దేశంలోకెల్లా తొలిగా ఈ వంగడాలను సాగు చేయబోతున్న రైతు సుబ్బారావేనంటే ఆశ్చర్యం కలగకమానదు. నేలతల్లిని నమ్ముకున్న సృజనాత్మక రైతుగా 5 దశాబ్దాల జీవన యానంలో శాస్త్రవేత్తల వద్ద సంపాయించుకున్న అపార నమ్మకమే ఆయనను ఇందుకు యోగ్యుడ్ని చేశాయి.
110 రోజుల పంటే!
ఇప్పుడు సుబ్బారావు చేతిలో అపూర్వమైన 7 రకాల ‘గ్రీన్’ వరి వంగడాలున్నాయి. మన రైతులకు ఏ యే వంగడాలు నప్పుతాయో తేల్చే గురుతర బాధ్యత ఇప్పుడు 77 ఏళ్ల సుబ్బారావు భుజస్కంధాలపై ఉంది. నారు పోసిన రోజు నుంచి 110 రోజుల్లో ధాన్యాన్ని చేతికందించే స్వల్పకాలిక వంగడాలివి. ఐఆర్ఆర్ఐ అంచనాల ప్రకారం.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు స్వల్ప మోతాదుల్లో వాడితే ఎకరానికి 65-70 బస్తాల దిగుబడి రావాలి. రసాయనిక ఎరువులు, పురుగు మందులు అసలు వాడకపోతే 30-35 బస్తాలు రావాలి (సాంద్ర వ్యవసాయ పద్ధతి అమల్లో ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో వరి సాగు వ్యయం ఎకరానికి, కౌలు మినహా, రూ. 25 వేలు. రసాయనిక ఎరువులు, పురుగుమందులతో సేద్యం చేస్తే ఈ ఖరీఫ్ సగటు ధాన్యం దిగుబడి 25 బస్తాలే). ఒక్కో రకం వంగడాన్ని 250 గ్రాముల చొప్పున ఐఆర్ఆర్ఐ సుబ్బారావుకు అందించింది. గత నెల 20న ట్రేలలో నారు పోశారు. త్వరలో నాట్లు వేస్తారు. ఒక వంగడాన్ని రసాయనిక ఎరువులు, పురుగుమందులు అసలు వాడకుండా పండిస్తానని సుబ్బారావు ‘సాక్షి’కి తెలిపారు. మార్చి దిగుబడిపై అంచనా వస్తుంది. ఏప్రిల్లో నూర్పిళ్లతో కచ్చితంగా తేలుతుంది. ‘గ్రీన్’ వంగడాల్లో మనకు ఏ యే వంగడాలు ఉపయోగకరమో స్పష్టమవుతుంది. వచ్చే ఖరీఫ్ నుంచే.. గ్రీన్ వరి వంగడాల విప్లవం సాకారమవుతుందన్నమాట! - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
ఈ భాగ్యం నా ఒక్కడికే దక్కింది!
మనీల సమావేశానికి 200 మంది రైతులొచ్చినా.. గ్రీన్ సూపర్ రైస్ పొలాలు స్వయంగా చూసే భాగ్యం నా ఒక్కడికే కలిగింది. అది డా. జవహర్ అలి పుణ్యమే. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పండించే గ్రీన్ సూపర్ రైస్ వంగడాలు అందుబాటులోకి వస్తే.. ఎకరానికి కనీసం రూ. 7-8 వేల మేరకు ఖర్చు తగ్గుతుంది. సేంద్రియ ధాన్యం దిగుబడి 30- 35 బస్తాలు వచ్చినా.. రైతుకు మంచి ఆదాయం వస్తుంది. ఉప్పునీటి సమస్య ఉన్నా.. పొట్ట దశలో కరువు కాటకాలొచ్చి పొలం బీటలు వారినా.. పంట తట్టుకుంటుంది. అటువంటి అననుకూల పరిస్థితుల్లోనూ సగటు దిగుబడి కన్నా ఎక్కువగానే దిగుబడినిస్తుందన్న నమ్మకం నాకుంది. బోర్ల కింద వరి సాగు చేసే రైతులకు ఈ వంగడాలు ఎంతో ఉపయోగకరం.
- నెక్కంటి సుబ్బారావు
(94912 54567),
ప్రముఖ రైతు శాస్త్రవేత్త,
ఆచంట, ప. గో. జిల్లా