subha reddy
-
గండికోటకు ఐదు టీఎంసీల నీరు
కడప సెవెన్‌రోడ్స్ : తాగు, సాగునీటి అవసరాల దృష్ట్యా జిల్లాలోని గండికోట రిజర్వాయర్‌కు ఐదు టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేసేందుకు నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అంగీకరించారని కలెక్టర్ కేవీ రమణ తెలిపారు. బుధవారం తన ఛాంబర్లో నీటిపారుదలశాఖ అధికారులు, జీఎన్ఎస్ఎస్ ప్రత్యేక కలెక్టర్ సుబ్బారెడ్డితో ఆయన చర్చించారు. గండికోట రిజర్వాయర్ నీటి లభ్యత, పునరావాస పనులపై సమీక్షించారు. గతంలో మూడు టీఎంసీల జలాలను గండికోటలో నిల్వ ఉంచేందుకు ఐదు గ్రామాలను ఖాళీ చేయాల్సి వచ్చిందని, ఈ ఏడాది ఐదు టీఎంసీలు నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం వల్ల ఎనిమిది గ్రామాలు ముంపునకు గురవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. ముంపునకు గురయ్యే గ్రామాల్లో చవటపల్లె, సీతాపురం, గండ్లూరు, ఓబన్నపేట, కె.బొమ్మేపల్లె, దొరువుపల్లె, బుక్కపట్నం, రంగాపురం ఉన్నాయని వివరించారు. ఈ గ్రామాల్లో 2706 మంది ప్రాజెక్టు ప్రభావిత నిర్వాసిత కుటుంబాల వారు ఉన్నట్లు చెప్పారు. వీరిలో సుమారు వెయ్యి మందిని ఇంతకుమునుపే మరో ప్రాంతానికి తరలించారన్నారు. ఈ ఏడాది అవుకు నుంచి గండికోటకు ఐదు టీఎంసీల నీరు చేరేందుకు రెండు నెలల సమయం పడుతుందన్నారు. నిర్వాసిత కుటుంబీకులకు పునరావాస ప్యాకేజీ చెల్లించేందుకు నిధులు కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం అంగీకరిచిందన్నారు. ఇప్పటివరకు 32.22 కోట్ల రూపాయలు పునరావాస ఏర్పాట్లకు ఖర్చు చేశారన్నారు. ప్రస్తుతం 18.42 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటికి తొమ్మిది పునరావాస కేంద్రాలకుగాను ఏడు కేంద్రాల్లో పనులు పూర్తయినందువల్ల ఎనిమిది గ్రామాల ప్రజలను ఆ కేంద్రాలకు వెంటనే తరలించాలని ఆదేశించారు. జేసీ రామారావు, డిప్యూటీ ఎస్ఈ లక్ష్మిరెడ్డి, గండికోట రిజర్వాయర్ ఈఈ గంగాధర్‌రెడ్డి, హౌసింగ్ పీడీ సాయినాథ్ పాల్గొన్నారు. -
జెడ్పీ పీఠం వైఎస్ఆర్సీపీదే
కడప కార్పొరేషన్: జిల్లా పరిషత్ పీఠం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వశమైంది. శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎర్రగుంట్ల జెడ్పీటీసీ సభ్యుడు గూడూరు రవి జిల్లా పరిషత్ చైర్మన్‌గా, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జెడ్పీపీఠం మాదే అంటూ గాంభీర్యం ప్రదర్శించిన అధికార తెలుగుదేశం పార్టీ ఎస్సీ వర్గానికి చెందిన జెడ్పీటీసీ సభ్యులే లేకపోవడంతో పోటీ కూడా పెట్టలేకపోయింది. దీంతో ఆ పార్టీకి చెందిన జె డ్పీటీసీలు ప్రమాణస్వీకారానికి మాత్రమే హాజరై ఎన్నిక జరిగే సమయంలో డుమ్మా కొట్టారు. ఎర్రగుంట్ల జెడ్పీటీసీ గూడూరు రవిని జిల్లా పరిషత్ చైర్మన్‌గా కాశీనాయన జెడ్పీటీసీ వెంకటసుబ్బయ్య ప్రతిపాదించగా గాలివీడు జెడ్పీటీసీ మిట్టపల్లె లక్ష్మీదేవి బలపరిచారు. అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా చక్రాయపేట జెడ్పీటీఈ బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రతిపాదించగా జమ్మలమడుగు జెడ్పీటీసీ జయసింహారెడ్డి బలపరిచారు. పోటీ లేకపోవడంతో జిల్లా కలెక్టర్ వారిద్దరినీ సభ్యుల హర్షధ్వానాల మధ్య జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్లుగా ప్రకటించారు. అనంతరం వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. కో ఆప్షన్ సభ్యులుగా మదార్‌వలీ, అక్బర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా శనివారం ఉదయం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, కడప మేయర్ కె.సురేష్‌బాబు, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రొద్దుటూరు, కడప ఎమ్మెల్యేలు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, అంజద్‌బాషా వెంటరాగా వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ సభ్యులంతా బస్సులో ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్దకు వచ్చి అక్కడి నుంచి నడుచుకుంటూ జెడ్పీ సమావేశమందిరానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి, కొరముట్ల, జయరాములు సమావేశమందిరానికి వచ్చాక కో ఆప్షన్ సభ్యులు, జెడ్పీ చైర్మన్, వైస్‌చైర్మన్ అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. మధ్యాహ్నం 12గంటలకు నామినేషన్ల స్క్రూటీనీ ముగిసింది. కో ఆప్షన్ సభ్యులుగా నలుగురు నామినేషన్లు వేయగా ఒంటిగంటలోపు ఇద్దరు ఉపసంహరించుకున్నారు. దీంతో మిగిలిన చిన్నకమ్ముగారి మదార్‌వలీ, కె.అక్బర్లను జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులుగా కలెక్టర్ ప్రకటించారు. 1గంట తర్వాత అక్షర క్రమంలో జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేరుస్తాం - జెడ్పీ చైర్మన్ గూడూరు రవి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సామాన్య ప్రజల వద్దకు చేర్చేందుకు కృషి చేస్తామని నూతన జిల్లా పరిషత్ చైర్మన్ గూడూరు రవి అన్నారు. జిల్లాలో చాలా గ్రామాలకు సరైన రోడ్లు లేవని, వర్షాలు రాక తాగునీటి సమస్య అధికమైందన్నారు. సభ్యులందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తాను జెడ్పీ చైర్మన్ కావడానికి సహకరించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తాగునీటి ఎద్దడిని నివారించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా సభ్యులందరినీ సమాన దృష్టితో చూస్తామన్నారు. ప్రజా సమస్యలపై దృష్టిసారించాలి - కలెక్టర్ : కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ పాలకవర్గం ప్రజా సమస్యలపై దృష్టిసారించి వాటిని పరిష్కరించేలా ప్రయత్నించాలని జిల్లా కలెక్టర్ కె.శశిధర్ పేర్కొన్నారు. ప్రత్యేక పరిస్థితులున్న జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. వర్షాలు రాక రైతులు ఆందోళనలో ఉన్నారని, తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంద న్నారు. జిల్లా అధికార యంత్రాంగం తరపున తాము పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. నిధులు విషయంలో సహకరించండి..- ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి : జిల్లా పరిషత్‌కు జనరల్ ఫండ్స్ తెచ్చే విషయంలో నూతన పాలకవర్గానికి సహకరించాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కలెక్టర్‌ను కోరారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున వివక్ష ప్రదర్శించకుండా సమాన దృష్టితో చూడాలన్నారు. జిల్లాలో చాలా సిమెంటు ఫ్యాక్టరీలున్నాయని, సీనరేజ్ సెస్సు విషయంలో స్థానిక సంస్థలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. జమ్మలమడుగులో మున్సిపల్ ఎన్నిక జరిగిన తీరు అత్యంత ఘోరమన్నారు. జిల్లా పరిత్ ఎన్నిక అలా జరగకపోవడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. అన్ని సదుపాయాలతో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్మించిన సమావేశ మందిరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకన్నా బాగుందని కితాబిచ్చారు. ఇక్కడ ఒక్కసారైనా శాసనసభ సమావేశాలు జరిగేలా చూడాలని కలెక్టర్‌ను కోరారు. -
ప్రమాదంలో చిన్నారి దుర్మరణం
ఖాజీపేట, న్యూస్‌లైన్: తిరుపతిలో ఉంటూ వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ చిన్నారి రోడ్డు ప్రమాద ంలో మృతిచెందింది. మండల పరిధిలోని రావులపల్లెకు చెందిన పోలు సుబ్బారెడ్డి, సుజాత దంపతులకు ఇద్దరు సంతానం. సుబ్బారెడ్డి పోలీసుశాఖలో తిరుమలలో ఉద్యోగం చేస్తూ అక్కడే భార్య బిడ్డలతో కాపురం ఉంటున్నాడు. వేసవి కాలం రావడంతో కూతురు భవ్యశ్రీ(4) అమ్మమ్మగారి ఊరైన వల్లూరు మండలం చెరువుకిందపల్లె వచ్చింది. బుధవారం మండల పరిధిలోని కొత్తపేటలో బంధువుల వివాహం జరుగుతుండగా అమ్మమ్మతో కలిసి వివాహ వేడుకలకు వచ్చింది. అక్కడి నుంచి రావులపల్లెలోని నాన్నమ్మ ఇంటికి వెళ్లాలని కడప-కర్నూలు జాతీయ రహదారి పక్కన ఉండగా ఐషర్ వాటర్ ట్యాంకర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఆ చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. మనువరాలు తన క ళ్ల ముందు మృతి చెండడంతో ఆమె బాధ వర్ణనాతీతమైంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకొని విలపిస్తుండటంతో రావులపల్లె వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. తప్పెట్ల సమీపంలో... వల్లూరు: వల్లూరు మండలంలోని తప్పెట్ల సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జ్ఞానమయ్య(65) దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు కాశినాయన మండలం ఇటుకలపల్లెకు చెందిన జ్ఞానమయ్య వల్లూరు మండలంలోని పుల్లారెడ్డిపేటలో వున్న తన కుమార్తె వద్ద గత కొంతకాలంగా వుంటున్నాడు. ఉదయం తప్పెట్ల బస్టాపు వద్ద గల కల్వర్టుపై కూర్చుని వుండగా లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతనిని స్థానికులు కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇతడు మరణించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కనుల పండువగా గోదాదేవి కల్యాణం
వల్లూరు, న్యూస్‌లైన్: పుణ్య క్షేత్రమైన పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి కల్యాణోత్సవం మంగళవారం కనుల పండువగా జరిగింది. ఆలయ చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి సమక్షంలో వేద పండితులు అఖిల్ దీక్షితులు, సుమంత్ దీక్షితుల ఆధ్వర్యంలో శ్రీ మహా విష్ణువు అంశ అయిన శ్రీ చెన్న కేశవునికి , శ్రీమహాలక్ష్మి అంశ అయిన గోదాదేవి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాంగల్య ధారణ కార్యక్రమాన్ని చూసిన భక్తులు పరవశించిపోయారు . స్వామి వారి తలంబ్రాల కార్యక్రమం ప్రత్యేకంగా నిలిచింది. స్వామివారి తలంబ్రాలను వేదపండితులు భక్తులకు ప్రసాదంగా పంచి పెట్టారు. ఈ సందర్భంగా కొండప్రాంతమంతా గోవిందనామ స్మరణతో మార్మోగింది. కాగా ఉదయం స్వామివారికి బిందె తీర్థ సేవను నిర్వహించారు. దనుర్మాస ప్రాతఃకాల పూజ నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కల్యాణోత్సవంలో మాజీ మేయర్ పుష్పగిరిలో జరిగిన గోదాదేవి కల్యాణంలో మాజీ మేయర్, వైఎస్ఆర్సీపీ కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త పీ రవీంద్రనాధరెడ్డి పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సేవాదళ్ అడ్‌హక్ కమిటీ సభ్యుడు ఇందిరెడ్డి శంకర్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి, పార్టీ నేతలు ఈవీ. మహేశ్వరరెడ్డి, డీఎల్ శ్రీనివాసులురెడ్డి,డీఎల్ మురళీధర్‌రెడ్డి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త రాజోలు వీరారెడ్డి దంపతులు కూడా కల్యాణోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు.