జెడ్పీ పీఠం వైఎస్‌ఆర్‌సీపీదే | YSRCP ZP leaders | Sakshi
Sakshi News home page

జెడ్పీ పీఠం వైఎస్‌ఆర్‌సీపీదే

Published Sun, Jul 6 2014 2:09 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

YSRCP ZP leaders

కడప కార్పొరేషన్: జిల్లా పరిషత్ పీఠం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వశమైంది. శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎర్రగుంట్ల జెడ్పీటీసీ సభ్యుడు గూడూరు రవి జిల్లా పరిషత్ చైర్మన్‌గా, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జెడ్పీపీఠం మాదే అంటూ గాంభీర్యం ప్రదర్శించిన అధికార తెలుగుదేశం పార్టీ ఎస్సీ వర్గానికి చెందిన జెడ్పీటీసీ సభ్యులే లేకపోవడంతో పోటీ కూడా పెట్టలేకపోయింది. దీంతో ఆ పార్టీకి చెందిన జె డ్పీటీసీలు ప్రమాణస్వీకారానికి మాత్రమే హాజరై ఎన్నిక జరిగే సమయంలో డుమ్మా కొట్టారు.
 
 ఎర్రగుంట్ల జెడ్పీటీసీ గూడూరు రవిని జిల్లా పరిషత్ చైర్మన్‌గా కాశీనాయన  జెడ్పీటీసీ వెంకటసుబ్బయ్య ప్రతిపాదించగా గాలివీడు జెడ్పీటీసీ మిట్టపల్లె లక్ష్మీదేవి బలపరిచారు. అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా  చక్రాయపేట జెడ్పీటీఈ బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రతిపాదించగా జమ్మలమడుగు జెడ్పీటీసీ జయసింహారెడ్డి బలపరిచారు. పోటీ లేకపోవడంతో జిల్లా కలెక్టర్ వారిద్దరినీ  సభ్యుల హర్షధ్వానాల మధ్య జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్లుగా ప్రకటించారు. అనంతరం వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు.
 
 కో ఆప్షన్ సభ్యులుగా మదార్‌వలీ, అక్బర్
 జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా శనివారం ఉదయం వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, కడప మేయర్ కె.సురేష్‌బాబు, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రొద్దుటూరు, కడప ఎమ్మెల్యేలు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, అంజద్‌బాషా వెంటరాగా వైఎస్‌ఆర్‌సీపీ జెడ్పీటీసీ సభ్యులంతా బస్సులో ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ వద్దకు వచ్చి అక్కడి నుంచి నడుచుకుంటూ జెడ్పీ సమావేశమందిరానికి చేరుకున్నారు.
 
 ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు  ఆదినారాయణరెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి,  రవీంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి, కొరముట్ల, జయరాములు సమావేశమందిరానికి వచ్చాక కో ఆప్షన్ సభ్యులు, జెడ్పీ చైర్మన్, వైస్‌చైర్మన్ అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు.  మధ్యాహ్నం 12గంటలకు నామినేషన్ల స్క్రూటీనీ ముగిసింది. కో ఆప్షన్ సభ్యులుగా నలుగురు నామినేషన్లు వేయగా ఒంటిగంటలోపు ఇద్దరు ఉపసంహరించుకున్నారు. దీంతో మిగిలిన చిన్నకమ్ముగారి మదార్‌వలీ, కె.అక్బర్‌లను జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులుగా కలెక్టర్ ప్రకటించారు. 1గంట తర్వాత అక్షర క్రమంలో జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.  
 
 సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు
 చేరుస్తాం - జెడ్పీ చైర్మన్ గూడూరు రవి
 ప్రభుత్వ సంక్షేమ పథకాలను సామాన్య ప్రజల వద్దకు చేర్చేందుకు కృషి చేస్తామని నూతన జిల్లా పరిషత్ చైర్మన్ గూడూరు రవి అన్నారు. జిల్లాలో చాలా గ్రామాలకు సరైన రోడ్లు లేవని, వర్షాలు రాక తాగునీటి సమస్య అధికమైందన్నారు.
 
 సభ్యులందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తాను జెడ్పీ చైర్మన్  కావడానికి సహకరించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తాగునీటి ఎద్దడిని నివారించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా సభ్యులందరినీ సమాన దృష్టితో చూస్తామన్నారు.
 
 ప్రజా సమస్యలపై దృష్టిసారించాలి
 - కలెక్టర్ :
 కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ పాలకవర్గం ప్రజా సమస్యలపై దృష్టిసారించి వాటిని పరిష్కరించేలా ప్రయత్నించాలని జిల్లా కలెక్టర్ కె.శశిధర్ పేర్కొన్నారు. ప్రత్యేక పరిస్థితులున్న జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. వర్షాలు రాక రైతులు ఆందోళనలో ఉన్నారని, తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంద న్నారు. జిల్లా అధికార యంత్రాంగం తరపున తాము పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
 
 నిధులు విషయంలో సహకరించండి..- ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి :
 జిల్లా పరిషత్‌కు జనరల్ ఫండ్స్ తెచ్చే విషయంలో నూతన పాలకవర్గానికి సహకరించాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కలెక్టర్‌ను కోరారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున వివక్ష ప్రదర్శించకుండా సమాన దృష్టితో చూడాలన్నారు. జిల్లాలో చాలా సిమెంటు ఫ్యాక్టరీలున్నాయని, సీనరేజ్ సెస్సు విషయంలో స్థానిక సంస్థలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.  జమ్మలమడుగులో మున్సిపల్ ఎన్నిక జరిగిన తీరు అత్యంత ఘోరమన్నారు. జిల్లా పరిత్ ఎన్నిక అలా జరగకపోవడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. అన్ని సదుపాయాలతో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్మించిన  సమావేశ మందిరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకన్నా బాగుందని కితాబిచ్చారు. ఇక్కడ ఒక్కసారైనా శాసనసభ సమావేశాలు జరిగేలా చూడాలని కలెక్టర్‌ను కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement